రైతు గుండెపోటుతో చనిపోలేదు..ఇది ప్రభుత్వ హత్యే





– తుపాను సమయంలో సీఎం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు
– మానవాతీత శక్తిలాగా చంద్రబాబు వ్యాఖ్యలు
– రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పేరుతో ఏదేదో చెప్తున్నారు


హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లాలో రైతు గుండెపోటుతో చనిపోలేదని..ఇది ప్రభుత్వ హత్యే అని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అసలు పెథాయ్‌ తుపాను ప్రభావం లేదని ప్రభుత్వం చెప్పిందని, పంట నష్టం వాటిల్లిందని మెళియపుట్టి మండలం కొసమాలలో పంట చేనులో రైతు చిన్నవాడు ప్రాణాలు వదిలారన్నారు. కళ్లముందు సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రైతులకు ఆత్మసై్థర్యం ఇచ్చే ప్రభుత్వం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవత్వంతో కరువుపై స్పందించాలన్నారు. అయితే చంద్రబాబు ఏ నాడు కూడా కరువు సహాయక ర్యలపై మానవత్వంతో ఆలోచించలేదన్నారు. చంద్రబాబు మొదటి నుంచి కూడా ప్రకృతిపై, కరువును జయించానని, రుతుపవనాలను ఒడిసి పట్టుకున్నానని, సముద్రాన్ని కంట్రోల్‌ చేశానని, తుపాన్లు అన్నీ కూడా కంట్రోల్‌ చేసే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదని, నా వద్దే ఉందని పేర్కొనడం, మానవాతిత శక్తిలాగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం అని మండిపడ్డారు. నిన్న రాజస్థాన్‌ వెళ్లే సమయంలో తిత్లీ తుపాన్‌ మాదిరిగా నష్టం జరుగకుండా చూడాలని చంద్రబాబు అన్నారన్నారు. రాత్రింబవళ్లు రైతులు కుప్పలు పెట్టుకోండని సీఎం సలహాలు ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. సాధ్యంకాని విషయాలు మాట్లాడుతున్నారన్నారు. గత 124 ఏళ్ల తరువాత ఇలాంటి తుపాను వచ్చిందని వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందే ప్రకటిస్తే..తుపాను సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో లేకుండా..ఎక్కడో రాజస్థాన్‌లో జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావడం ఎంతవరకు సబబు అన్నారు.  
రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని అనుకునే భావనలో చంద్రబాబు ఉన్నారన్నారు. తుపాను తరువాత ఇరిగేషన్‌ శాఖ మంత్రి మాట్లాడుతూ..59900 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని ప్రకటించారన్నారు. చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనను ముగించుకొని వచ్చిన తరువాత 1400 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని ప్రకటించారన్నారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో 10556 హెక్టార్లు అని ప్రకటించారన్నారు. ఈ ప్రకటనలలో ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. తాజాగా సీఎం మాట్లాడుతూ..నవంబర్‌లోనే పంటలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొనడం దారుణమన్నారు. 
ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు  ఏంటని ఆయన ప్రశ్నించారు. రెండు వేల మంది అధికారులు తుపాను ప్రాంతాల్లో నియమించామని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొంటే..అరగంట తరువాత మీ కుమారుడు మంత్రి లోకేష్‌ 10 వేల మంది ఫీల్డ్‌లో ఉన్నారని ట్వీట్‌ చేసినట్లు గుర్తు చేశారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పేరుతో ఏదేదో చెప్తున్నారని, ఏపీ ప్రజలు ఏమైనా పిచ్చివాళ్లు అనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. 

 
Back to Top