చంద్రబాబు ఇంటి పేరే వంచన


– వరదలకు ఏపీలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
– పంట నష్టంపై అధికారుల అంచనాలు తప్పుల తడకగా ఉన్నాయి
– పంట నష్టాన్ని తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతోంది
– రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

విజయవాడ: ప్రతి ఒక్కరిని వంచించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ఆయన ఇంటిపేరు వంచనగా మార్చుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం నెలకొంటే చంద్రబాబు ప్రత్యేక విమనాల్లో తిరుగుతూ రైతులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కరువు మండలాల ప్రకటనలో మోసం చేశారని, ఇప్పుడు పంట నష్టంపై అధికారుల అంచనాలు తప్పుల తడకగా ఉన్నాయని పేర్కొన్నారు. పంట నష్టాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.

వాస్తవమైన పరిస్థితులు జాతీయ సర్వేలు, సంస్థలు చెబుతున్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, వారి భూములు బలవంతంగా లాక్కొని, వారిని నిర్వాసితులుగా చేసిందన్నారు. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ ప్రభుత్వం రైతులపై కక్షగట్టిందన్నారు. ప్రకృతిని జయించానని, రుతు పవనాలను ఒడిసి పట్టుకున్నానని కళ్లిబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మాటలతో ప్రకృతి కూడా ఈ రాష్ట్రంపై కన్నె్రరజేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఒకవైపు కరువుతో అతలాకుతలం అవుతుంటే..ఆరు జిల్లాలు పూర్తిగా సంక్షోభంతో దెబ్బతిన్నాయన్నారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ఏపీలో అధిక వర్షాల కారణంగా అనేక మండలాల్లో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు మండలాల ప్రకటనతో పాటు, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 393 మండలాల్లో కరువు ఉన్నట్లు వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయని, ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రచురించాయని తెలిపారు.  అయితే ప్రభుత్వం 270 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం బాధాకరమన్నారు. అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో 3.70 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అంచనాలు ఇంకా పెరిగే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఇక్కడ కూడా 141 మండలాల్లో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించిందని తప్పుపట్టారు. ప్రభుత్వం మోసపూరితంగా ప్రకటించిందని వైయస్‌ఆర్‌సీపీ చెప్పడం లేదని, కర్నూలు జిల్లాలోని ఓ మీటింగ్‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ..జిల్లాలో 56 మండలాలు ఉంటే ప్రభుత్వం కేవలం 36 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. జిల్లా మొత్తాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మీడియా ముందే వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డిని ఉప ముఖ్యమంత్రి కోరినట్లు చెప్పారు. 

ఇంతటి తీవ్రమైన సంక్షోభం రాష్ట్రంలో ఉంటే రైతులను కాపాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఇంతవరకు ఒక్కసారైనా తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మే నెలలో కురిసిన వర్షాల కారణంగా ప్రభుత్వం అంచనా వేసిన వాటికైనా ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చారా అని నిలదీశారు. ఇంతవరకు ఎక్కడా కూడా రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. 2013–2014లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌ బాకీ పడ్డారని వివరించారు. రాష్ట్రంలో ఇంతటి సంక్షోభం ఉంటే చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారే తప్ప..క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదన్నారు. వ్యవసాయం గురించి ఏమాత్రం  అవగాహన లేని వ్యక్తి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖరీఫ్‌ పంటల సాగుకు సమయం మించిపోయిందని, ప్రత్యామ్నయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించడం విడ్డూరంగా ఉందన్నారు.  


 
Back to Top