గురజాలలో ఏరులై పారుతున్న అవినీతి

చంద్రబాబు, లోకేష్‌ అండతో యరపతినేని అక్రమ మైనింగ్‌
సున్నపు గనులు తవ్వకుంటూ కోట్లు దండుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే
పట్టించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం
అవినీతిని సీరియస్‌గా పరిగణించి విచారణకు ఆదేశించిన కోర్టు
చంద్రబాబు ప్రభుత్వానికి అక్షింతలు వేసిన న్యాయస్థానం
కోర్టు తీర్పుతో వైయస్‌ఆర్‌ సీపీ నైతిక విజయం సాధించింది
విజయవాడ:  చంద్రబాబు, లోకేష్‌ అండతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అక్రమంగా మైనింగ్‌ తవ్వకాలకు పాల్పడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనకు అండగా ఉందని ఇష్టానుసారంగా మనుషులను పెట్టి తవ్వకాలు జరిపి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌పై వైయస్‌ఆర్‌ సీపీ వేసిన పిల్‌తో హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసిందన్నారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాసు మహేష్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటంపై హైకోర్టు తీర్పుతో వైయస్‌ఆర్‌ సీపీ నైతిక విజయం సాధించిందన్నారు. యరపతినేని శ్రీనివాసరావు ఇష్టం వచ్చినట్లుగా కోనంకి, కేసానిపల్లి, నడికుడి గ్రామాల్లో  సున్నపు గనులను తవ్వి ప్రభుత్వానికి ట్యాక్స్‌ కట్టకుండా డబ్బులు దండుకుంటున్నాడని మండిపడ్డారు. నాలుగేళ్లలో సుమారు 42 లక్షల టన్నులు అమ్మకున్నాడని, రూ. 2.70 కోట్ల డబ్బులు దోచుకున్నారన్నారు. ప్రజలకు దక్కాల్సిన డబ్బును చంద్రబాబు, లోకేష్‌ అండతో సొమ్ముచేసుకుంటున్నాడన్నారు. 


యరపతినేని అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వానికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నేత కృష్ణారెడ్డి, కార్యకర్త గురవాచారి లోకాయుక్తాకు ఫిర్యాదు చేయడంతో గురజాలలో అక్రమ మైనింగ్‌ జరిగిందని క్లీయర్‌గా రిపోర్టు ఇచ్చారన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కృష్ణారెడ్డి, గురువాచారి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారన్నారు. హైకోర్టును ఆశ్రయించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గురువాచారిని పోలీసులు అక్రమంగా స్టేషన్‌లో నిర్బంధించి బలవంతంగా టీడీపీ కండువా కప్పించారని గుర్తు చేశారు. 2016లో 12 లక్షల టన్నులు అక్రమంగా సున్నపు గనుల తవ్వకాలు జరిగాయని పిల్‌ వేస్తే న్యాయమూర్తి విచారణ చేపట్టి దీనికి బాధ్యులను గుర్తించి జరిమానా విధించడమే కాకుండా.. దోచుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. ఆగస్టు 21వ తేదీలోగా ఎలాంటి యాక్షన్‌ తీసుకున్నారో చెప్పాలని సూచించిందన్నారు. 

మైనింగ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, కలెక్టర్‌ ఎటువంటి యాక్షన్‌ తీసుకోలేదని, ఆర్టీఏ చట్టం కింద వైయస్‌ఆర్‌ సీపీ నేత కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ప్రభుత్వంపై సీరియస్‌ అయ్యిందన్నారు. చీకటి గదిలో నల్లపిల్లి కోసం వెతుకుతున్నారా.. కోట్ల రూపాయల అవినీతి జరిగితే.. ముగ్గురు కూలీలు, ఒక్క ట్రాక్టర్‌ సీజ్‌ చేయడం ఏంటని అక్షింతలు వేసిందన్నారు. తక్షణమే సీబీఐ, కాగ్, సెంట్రల్‌ మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను విచారణ జరిపించాలని ఆదేశించిందన్నారు. యరపతినేని శ్రీనివాసరావు ప్రజాధనాన్ని దోచుకోవడమే కాకుండా.. డబ్బును పార్టీకి ఖర్చు చేస్తున్నానని, చంద్రబాబు, లోకేష్‌ అవసరాలకు కూడా డబ్బులు పంపిస్తున్నానని దురుసుగా మాట్లాడుతున్నారన్నారు. దీంతో అధికారులు ముఖ్యమంత్రి స్థాయి నుంచే సపోర్టు ఉందని ఎలాంటి యాక్షన్‌ తీసుకోవడం లేదన్నారు. కానీ ధర్మం ఏదో రోజు గెలుస్తుందని ఆశించామని, కోర్టు తీర్పుతో న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. 
 
Back to Top