ప్రజా శ్రేయస్సే ఊపిరిగా సంకల్పయాత్ర

  • వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ పాదయాత్ర
  • జననేత రాకకోసం ఆతృతతో ఎదరు చేస్తున్న విజయనగరం
  • చంద్రబాబు చేతగాని తనంతో విజయనగరం వెనుకబడింది
  • ఏ కార్యక్రమం చేపట్టినా విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల దోపిడీ
  • 2004 చరిత్ర మళ్లీ పునరావృతం కాబోతుంది
  • చంద్రబాబు దుష్టపాలనకు రోజులు దగ్గరపడ్డాయి
  • దేశపాత్రునిపాలెంలో 3 వేల కిలోమీటర్లు మైలురాయి చేరనున్న పాదయాత్ర
  • పైలాన్, భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
విజయనగరం: ప్రజల శ్రేయస్సే ఊపిరిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలకు అద్భుతమైన పరిపాలనను అందించారని, అదే స్ఫూర్తితో ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేపట్టారన్నారని, అశేష జనవాహిన జననేత అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర 11 జిల్లాల్లో 2900 వందల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర పూర్తి చేసుకుందని 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుందని చెప్పారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా దేశపాత్రునిపాలెంలో పైలాన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా కొత్తవలసలో భారీ బహిరంగ ఉంటుందని చెప్పారు. దేశపాత్రునిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే...

ఆనాడు ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్‌ఆర్‌ ప్రజలకు భరోసా కల్పిస్తూ మోసకారి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోసి సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వేలాది మందిని కలుస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 2004 చరిత్ర మళ్లీ పునరావృతం కాబోతుంది. చంద్రబాబు చేసిన పాదయాత్రలా మార్నింగ్‌ వాక్, ఈవ్‌నింగ్‌ హైటెక్‌ పాదయాత్ర కాదు. ఎండా, వాన లెక్క చేయకుండా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలంతా పాదయాత్రకు తరలివస్తున్నారు. వైయస్‌ జగన్‌ ఎప్పుడు వస్తారు. ఆయన్ను ఎప్పుడు కలుద్దాం.. ఎప్పుడు చూద్దామనే ఆత్రుతతో విజయనగరం జిల్లా ప్రజలు ఉన్నారు. కొత్తవలసలో భారీ బహిరంగ కూడా ఏర్పాటు చేశాం. 

జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని విభజన చట్టంలో పెట్టిన అంశాలను నెరవేర్చకుండా చంద్రబాబు  ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. విద్యార్థుల, రైతుల ఆత్మహత్యలు, వైద్యం అందక విష జ్వరాలతో ప్రజలు చనిపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైయస్‌ జగన్‌ ప్రజానీకానికి భరోసా కల్పిస్తూ రాబోయే రోజుల్లో అండదండగా ఉంటా ఆశీర్వదించండి అంటూ ముందుకు సాగుతున్నారు. వైయస్‌ జగన్‌ ఆయన తండ్రి వైయస్‌ఆర్‌ కంటే మంచి పాలన అందిస్తారనే నమ్మకం ఉంది. ప్రజలంతా ఆయన పాదయాత్రకు మద్దతు ఇవ్వండి.

విజయనగరం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ చంద్రబాబు నెరవేర్చలేదు. గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్లు గడిచింది ఇప్పటి వరకు అతీగతి లేదు. నాలుగు సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా గురించి ఏం ఆలోచన చేశారు.  విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని శ్రీకృష్ణ కమిషన్‌ చెప్పింది.. విభజన చట్టంలో పెట్టారు. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ఏమైంది? సంవత్సరానికి రూ. 50 కోట్లు జిల్లాకు ఇస్తూ అదే మహాభాగ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు చేతగాని తనం, అలసత్వంతో జిల్లా ఎంత నష్టపోతుందో ప్రజలు ఆలోచన చేయాలి. రూ. 500 కోట్లు ఏడాదికి ఎందుకు ఇవ్వలేదు. ఎన్నోసార్లు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్‌ ఎన్నోసార్లు ప్రస్తావించారు. దానికి సమాధానం చెప్పకుండా రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షం బురదజల్లుతుందని మాట్లాడిన పెద్ద మనుషులు కనీసం రూ.50 కోట్లు కూడా రాకుండా చేశారు. 
వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలియదు. 

తెలుగుదేశం పార్టీ చేసే అరాచకాలు, దోపిడీని వైయస్‌ జగన్‌ ప్రజలకు వివరిస్తారు. వెనుకబడి ఏడు జిల్లాల అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో పర్యటించి వరాలు ఇచ్చారు. అలాగే విజయనగరం జిల్లాకు కూడా ఇచ్చారు. విజయనగరం పట్టణాన్ని స్మార్ట్‌ సిటీ, గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, పారిశ్రామిక నగరం, తోటపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటు, సంగీత అకాడమీ, మెడికల్‌ కాలేజీలు అని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎక్కడుంది గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, గిరిజన యూనివర్సిటీ, స్మార్ట్‌ సిటీ, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు, మెడికల్‌ కళాశాల ఎక్కడుంది దీనికి అధికారంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు చేతగాని తనంతో స్వార్థం కోసం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ముడుపుల కోసం టెండర్లు కూడా రద్దు చేశారు. 

తోటపల్లిలో రాత్రులు పడుకొని ప్రాజెక్టును కట్టించానని చెబుతున్నాడు. 89 శాతం వైయస్‌ఆర్‌ పూర్తి చేస్తే మిగిలిన 11 శాతం పూర్తి చేయలేని చవటలు మాయమాటలు చెబుతున్నారు. పిల్ల కాల్వలు కట్టలేని చంద్రబాబు ప్రాజెక్టులు కట్టారని చెబితే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు. జిల్లా పర్యటనలో బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో 8 మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ఆధునీకరణకు రూ. 30 కోట్లు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా? రూ. 30 కోట్లు ఎక్కడున్నాయి.. ఎవరికి ఇచ్చారు. 2016 జనవరి 2న మండపల్లిలో జన్మభూమి కార్యక్రమానికి వచ్చినప్పుడు నదులను అనుసంధానం చేస్తానన్నారు. ఏమైంది ఆ హామీ. అంతేకాకుండా గరికెపల్లి మండలం ఉల్లిపొదరులో తాగునీటి కోసం పైలెట్‌ ప్రాజెక్టు నిర్మిస్తామని 2017 మే 6వ తేదీన చెప్పిన మాట వాస్తవం కాదా..? కనీసం దానికి శంకుస్థాపన చేశారా..? విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు 30 పడకల ఆస్పత్రి అన్నారు. ఏమైంది ఆ ఆస్పత్రి నిర్మాణం. మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేసే ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదు. పెందుర్తి నుంచి అరకు వరకు నాలుగు లైన్ల రోడ్డు అన్నారు. కనీసం దాని గురించి ఆలోచన చేశారా..?

పోలవరం, పట్టిసీమలో విపరీతమైన అవినీతి జరిగిందని కాగ్‌ బయటపెట్టింది. పరిపాలన మొత్తం గాలికి వదిలేశారు. ఎవరికి వారు దోచుకుంటూ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. అనంతపురంలో ఆశ్రమంలో సంఘటన జరిగితే స్థానిక ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్‌ వ్యవస్థను ఏ విధంగా దుర్భాషలాడారో.. పోలీస్‌ సంఘాలు ఆగ్రహం చెందితే మళ్లీ ఏ విధంగా మాట్లాడారో అందరూ చూశారు. బిహార్‌ కంటే ఘోరంగా ఆంధ్రరాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో తయారవుతోంది. రెండంకెలు వృద్ధిరేటు అంటూ పబ్బం గడుపుకుంటున్నారు. 
ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఎక్కడకు వెళ్లినా వేలాది మంది ప్రజానీకం వచ్చి స్వాగతం పలుకుతున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయస్‌ఆర్‌ తనయుడిగా ఆయన హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను మళ్లీ వస్తాయనే ఆశతో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు ఎన్నికల విజయానికి నాంది. కొత్తవలసలో జరిగే బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలపై ప్రస్తావించి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరించి ప్రజలను చైతన్యం చేస్తారు. 
 
Back to Top