రెండు పడవలపై ప్రయాణం చంద్రబాబు తత్వంవైయస్ఆర్ సీపీకి ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంబాబు ఊసరవెల్లి మాటలు నమ్మి మోసపోవద్దుకేసీఆర్తో మొదటి నుంచి సంబంధాలు కొనసాగించింది బాబేఓటుకు కోట్ల కేసులో బాబుకు శిక్షపడి ఉంటే దోపిడీ జరిగేది కాదువైయస్ఆర్సీపీకి కొత్తగా టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటగడుతున్నారుమూడు రాష్ట్రాల ఫలితాలపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ, ఒంగోలు సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటుందన్న చంద్రబాబు.. ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు ఏ విధంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ను అడిగారని ప్రశ్నించారు. టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయడం ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదా..? అని నిలదీశారు. చంద్రబాబుది తన స్వార్థ ప్రయోజనాల కోసం రెండు పడవలపై ప్రయాణం చేసే తత్వం అన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైయస్‌ఆర్ సీపీ దృష్టి, ఆలోచన విధానాలన్నీ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగిస్తామన్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై రాజీపడే ప్రసక్తే లేదని, తెలుగుదేశం పార్టీ మాయమాటలు నమ్మొద్దన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలను ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా గమనించాలని బొత్స సత్యనారాయణ కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో అన్ని విషయాల్లో రాజీపడింది చంద్రబాబేనన్నారు. పండుగలు, పబ్బాలకు తెలంగాణ నుంచి కేసీఆర్‌ను చంద్రబాబు పిలవడం. కేసీఆర్ యాగం చేస్తే చంద్రబాబు వెళ్లడం ఇది నిజం కాదా..? బాబు, కేసీఆర్‌ల మధ్య సత్సంబంధాలు కొనసాగాయన్నారు. దుర్గమ్మ సన్నిధికి వస్తే మంత్రులు ఎందుకు వెళ్లారని అడిగితే ప్రొటోకాల్ అంటున్నారని, 2017లో యాగం చేస్తే చంద్రబాబు వెళ్లారని, పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్ రాకకు భారీ స్వాగత తోరణాలను కట్టారన్నారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగయడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి వారి పార్టీకి నష్టం చేకూర్చే ప్రయత్నం చేశారని, కేసీఆర్ కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తానని మాట్లాడారన్నారు. గతంలో బీజేపీతో, జనసేనతో వైయస్‌ఆర్‌సీపీ కలిసిపోయిందని మాట్లాడిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు కొత్తగా టీఆర్‌ఎస్‌తో కూడా సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబుకు శిక్షపడి ఉంటే ఏపీలో ఇంత దోపిడీ జరిగి ఉండేది కాదని బొత్స అన్నారు. కేసీఆర్, చంద్రబాబు కలిసి నష్టం చేశారని వైయస్‌ఆర్ సీపీ అభిప్రాయమన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతటి కుట్రలైనా చేస్తాడన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి పార్టీ కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదన్నారు. లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుతో చేతులు కలిపి ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. మనిషి బలహీనతలతో ఆడుకోవడం లగడపాటికి అలవాటన్నారు. లోకేష్‌తో కలిసి బెట్టింగ్‌ల డబ్బు కోసం తప్పుడు సర్వే చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో కలిసి ఆంధ్రరాష్ట్రంలో వైయస్‌ఆర్ సీపీ ఉనికి లేకుండా చేద్దామనుకున్నారని బొత్స మండిపడ్డారు. తెలుగుదేశం ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఓటమిని కోరుకుంటామని, ఏపీని నాశనం చేసిన పార్టీ ఓడిపోవాలని కోరుకుంటామన్నారు. మజ్లిస్ పార్టీతో కూడా వైయస్‌ఆర్ సీపీని అండగడుతున్నారన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తెలుగుదేశం కృషి ఉందని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఆ రాష్ట్రాలకు వెళ్లి మాతృభాష హిందీలో మాట్లాడి ప్రభావితం చేశాడు కానీ.. తెలంగాణలో మన మాతృభాష తెలుగులో మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోలేక ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఫలితాలు వెలువడిన వెంటనే ట్విట్టర్‌లో లోకేష్, చంద్రబాబు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారని, సాయంత్రం 6 గంటలకు వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ విషెస్ చెబితే దాన్ని కూడా తప్పుబడుతున్నారని మండిపడ్డారు. విజయనగరం సభలో కూటమికి కర్త, కర్మ, క్రియ నేనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి, ఆ తరువాత టీఆర్‌ఎస్‌ను కాపురానికి పిలిచాడని, ఆ తరువాత ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడన్నారు. వీరిద్దరి అనైతిక పొత్తును ప్రజలు చీదరించుకున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలీ బాబా 40 దొంగల్లా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలు ఏమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. బాబు ఏ పనిచేసినా రాజకీయ స్వార్థం కోసమే అని, సీఎం కూర్చి కోసం ఎన్ని కుట్రలైనా చేస్తాడన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండడం, ఏపీ ప్రయోజనాలు వైయస్‌ఆర్‌సీపీకి ముఖ్యమన్నారు. ఏ అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని, జిమ్మిక్కులు కట్టిపెట్టి, చిల్లర రాజకీయాలు చేయకుండా ఎప్పుడు పరిపక్వత వస్తుందో అర్థం కావడం లేదన్నారు. లగడపాటి రాజగోపాల్‌ను చరిత్ర క్షమించదని, స్వార్థ ప్రయోజనాల కోసం సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయొద్దన్నారు. వైయస్‌ఆర్ సీపీ ముస్లింలు, మైనార్టీలకు వ్యతిరేకం కాదని, చంద్రబాబు చేసిన మోసాన్ని ఏపీలో చెప్పడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వస్తున్నారేమోనన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలన్నారు.