ప‌వ‌న్‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవు

ఖాళీ సమయాల్లో మైకులు పట్టుకోవడం కాదు
ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పోరాటం చేయాలి
కులాల ప్రస్తావన వద్దంటూనే కుల రాజకీయాలు చేస్తున్న పవన్‌
అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి అందించిన ఏకైక నాయకుడు వైయస్‌ఆర్‌
వైయస్‌ఆర్‌ను ఎదిరించానని మాట్లాడడం విడ్డూరంగా ఉంది
పూటకో మాట మాట్లాడే పవన్‌ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే మేలు
అధికారం ఉంటేనే వ్యవస్థలను మార్చగలం అని తెలియకపోతే ఎలా?
వైయస్‌ జగన్‌ పోరాటాలతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి
హైదరాబాద్‌: రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లో కనిపించడం లేదని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై బొత్స విరుచుకుపడ్డారు. పూటకో మాట.. రోజుకో పార్టీతో జతకట్టే పవన్‌ వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించడం తగదన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజలు వింటున్నారు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.   మూడు రోజుల నుంచి పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరిలో పర్యటన చేస్తూ ఇష్టారీతిగా వ్యతిగత ఆరోపణలు చేస్తున్నారని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఎదిరించానని మాట్లాడుతున్నాడని, ఆయన పక్కన ఉన్న మనోహర్‌ చెప్పారో లేదో.. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్‌ రాజకీయాల్లో లేడన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పరిచయమయ్యాడన్నారు. ఇడుపులపాయలో పేదల భూములు వైయస్‌ఆర్‌ దోచేశారని మాట్లాడుతున్నాడని, అసైన్డ్‌ భూములు తన ఆధీనంలో ఉన్నాయని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన ఏకైక నాయకుడు వైయస్‌ఆర్‌ అని పవన్‌ తెలుసుకోవాలని సూచించారు. 

చనిపోయిన వ్యక్తి మీద, ప్రజాదరణ కలిగిన నాయకుడిపై పవన్‌ కల్యాణ్‌ ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు. ఏ రోజు ఏం మాట్లాడుతాడో.. ఏ రోజు ఎవరితో ఉంటాడో పవన్‌ కల్యాణ్‌కే తెలియదన్నారు. కులాల గురించి సంబంధం లేదంటూనే మళ్లీ కుల ప్రస్తావన తీసుకొచ్చి కుల రాజకీయాలు చేస్తున్నాడన్నారు. పుట్టిన ప్రతి మనిషికి ఒక కులం ఉంటుందని, కులాలకు అతీతంగా ఉన్నామని ప్రపంచానికి తెలియాలంటే మన ప్రవర్తన, బంధాలు, స్నేహాలు, భాష చాటి చెబుతాయన్నారు. 2014లో పవన్‌ తెలుగుదేశం, బీజేపీతో ఎందుకు వెళ్లారో పాలు తాగే పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడని, సినీ పాపులారిటీతో మేలు జరుగుతుందనే అతన్ని ఆ పార్టీలు కలిశాయన్నారు. అంతెందుకు రోజు మీ పక్కన కూర్చున్న వారు ఎవరని ప్రశ్నించారు. కులంతో సంబందం లేదని ఇంటి పేరు మార్చుకున్నావా అని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. 

పెద్ద పెద్ద సమరయోధుల పేర్లు చెబుతూ.. వైయస్‌ జగన్‌ రెడ్డి అంటు కుల ప్రస్తావన తీసుకువస్తున్నారని, వైయస్‌ జగన్‌ రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారని, మీరు కాపుల్లో, చంద్రబాబు కమ్మ కుల సామాజిక వర్గంలో పుట్టారని చెప్పారు. కులాల గురించి మాట్లాడుతూ కుల రాజకీయాలు చేస్తూ పైకి ప్రవచనాలు వల్లిస్తూ డాంబికాలు మాట్లాడుతున్నాడన్నారు. 

వైయస్‌ జగన్‌ కుర్చీ కోసమే పోరాడుతున్నారని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ నిన్నటి సభలో ప్రజలను ఉద్దేశించి మీ ముందు ముగ్గురే అభ్యర్థులు వైయస్‌ జగన్, పవన్, చంద్రబాబు ఉన్నారని, వారిలో ఎవరు కావాలో ఎంచుకోండి అని ఎందుకు మాట్లాడరన్నారు. పదవి వద్దని మాట్లాడిన వ్యక్తి ఎందుకు మళ్లీ అభ్యర్థుల ప్రస్తావన తీసుకువచ్చారని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు చేయాలన్నారు. వ్యవస్థలో మార్పులు రావాలంటే ప్రజాస్వామ్యంలో అధికారం అవసరమని బొత్స సత్యనారాయణ పవన్‌ కల్యాణ్‌కు సూచించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ మంచి ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుందన్నారు. ప్రజల అభివృద్ధికి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. 

ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై పవన్‌ కల్యాణ్‌ అవహేళనగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది హత్యాయత్నం కాదా..? హత్య చేసేందుకు ప్రయత్నం జరగలేదా..? కాదని చెప్పండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతపై దాడికి వెనుక నుంచి కుట్ర పన్నిన తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రికి పవన్‌ వంతపాడుతున్నారు. రాజకీయ పార్టీలకు విధి విధానాలు ఉండాలన్నారు. పూట పూటకో మాట మార్చడం రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ముందుండి పోరాడాలని, ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఎవరో ఒకరిపై రాయి విసిరేస్తే అయిపోతుందనుకుంటే తప్పు అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతి సమస్యపై, ప్రభుత్వ అరాచకాలపై వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తూనే ఉన్నారని, ఆయన పోరాటంతోనే ప్రభుత్వంలో వణుకుపుట్టిందన్నారు. పోరాటాలతో ఎన్ని సమస్యలు పరిష్కరించారో చెప్పమంటారా అని పవన్‌ను నిలదీశారు. 
 
రైతుల సమస్యలపై వైయస్‌ జగన్‌ మార్కెట్‌ యార్డుకు వెళ్లి కూర్చుంటే తప్ప ప్రభుత్వానికి ఆలోచన రాలేదన్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేశారా.. అని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. రైతు సమస్యలపై ఎప్పుడైనా పోరాడారా..? ఎంతసేపటికీ ప్రజారాజ్యం పార్టీని మోసం చేశారని మాట్లాడుతున్నారని, అందరికంటే ముందుగా ఆ పార్టీని వదిలేసింది పవన్‌ అని బొత్స గుర్తు చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా రాజకీయ నేతగా ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని సూచించారు. వైయస్‌ జగన్‌ అసెంబ్లీకి వెళ్లడం లేదని మాట్లాడుతున్నారని, ఎందుకు వెళ్లడం లేదో మీకు తెలుసా అని ప్రశ్నించారు. 

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌కు అక్కడి సమస్యలపై ఏమాత్రమైనా అవగాహన ఉందా అని బొత్స ప్రశ్నించారు. ఉంటే వాటిపై ప్రస్తావించి రైతులు, మహిళలు, కూలీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రతిపక్షంగా వైయస్‌ఆర్‌ సీపీ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే ఎగతాళి చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. సుజల స్రవంతికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు.. ఆ ప్రాజెక్టుకు 2009లో మహానేత చేసిన శంకుస్థాపనను, ఆ రోజు ఉన్న డీపీఆర్‌ను నాలుగేళ్లుగా మూలబెట్టి దోపిడీ చేస్తుంటే దీనిపై ఆలోచన ఉందా..? ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌ల రూపంలో దోపిడీ చేస్తుందో.. ఆ డబ్బును ఎన్నికలల్లో ఖర్చు చేసేందుకు చూస్తుందో దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా..? 
ఎవరు ఏమనుకున్నా వైయస్‌ఆర్‌ సీపీ పార్టీ చంద్రబాబు దుర్మార్గానికి, ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు అండగా ఉంటూ మహానేత వైయస్‌ఆర్‌ పాలనలో జరిగిన సంక్షేమాలను మళ్లీ ప్రజలకు అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. ఎవరు ఏమనుకున్నా.. అది వారి విజ్ఞతకే వదిలి ప్రజల తీర్పే కోరుతామన్నారు. 
 
Back to Top