- వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి- వ్యవసాయం దండగన్న పెద్ద మనిషి చంద్రబాబు- కరువుతో అల్లాడుతుంటే భూములను వ్యాపారులకు కట్టబెడుతున్నారువిజయనగరం: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం కరువు మండలాలను కుదించడం దారుణమని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాల పరిస్థితి నాలుగేళ్లుగా సరిగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వానలు లేక పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయన్నారు. చక్రవడ్డీలతో రైతులు రుణ ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సగటున 19.1 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. రాయలసీమలో సాధారణం కంటే 36 శాతానికి పైగా తక్కువ వర్షం కురిసిందన్నారు. రాయలసీమలో 390 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి 94 మండలాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
2016 ఖరీఫ్‌లో కూడా 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని తెలిపారు. 2017 ఖరీఫ్‌లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఆగస్టు, సెప్టెంబరులో అల్పపీడనాలవల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కి తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకుండా రైతులకు ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఖరీఫ్‌లో ఐదేళ్లుగా పంటల సాగు తగ్గడం దుర్భిక్షం పెరుగుదలను సూచిస్తోందన్నారు. 2014 ఖరీఫ్‌లో 40.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది ఇదే సీజన్‌లో 35.75 లక్షల హెక్టార్లకు పడిపోవడం గమనార్హం అన్నారు. 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది మూడు లక్షల హెక్టార్లలో సాగు తగ్గినా కరువు మండలాలను మాత్రం కుదించడం దారుణమన్నారు. వ్యవసాయం దండగ అన్న పెద్ద మనిషి చంద్రబాబు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. కరువు మండలాలుగా ప్రకటించకపోతే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.