చంబల్‌ బందిపోట్ల కంటే దారుణంగా దోపిడీ

అమరావతి పేరుతో లక్ష కోట్లకుపైగా అవినీతి
జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
టీడీపీపై కసితీర్చుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు
శ్రీకాకుళం: చంబల్‌ బందిపోట్ల కంటే దారుణంగా చంద్రబాబు కోటరీ ఆంధ్రప్రదేశ్‌ను దోచుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వ మాజీ అధికారులు, మేధావులే చెబుతున్నారన్నారు. శ్రీకాకుళంలోని ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద భూమన మీడియాతో మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత కలిగి ప్రజలకు మేలు జరగాలని ఆలోచించే అధికారులు కొందరు చంద్రబాబు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పారని గుర్తు చేశారు. తన పాలనలో జరుగుతున్న అవినీతిని నియత్నించే ప్రయత్నం చేయకుండా అవినీతి జరుగుతుందని చెబుతున్న అధికారులపై అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. నిన్న విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో రిటైర్డ్‌ జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి రాజధాని పేరుతో లక్ష కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారని గుర్తు చేశారు. గతంలో అందరూ మాట్లాడుతుంటే అతిశయోక్తి అనుకున్నానని, కానీ లోతైన పరిశీలన చేసిన తరువాత లక్షల కోట్ల కంటే ఎక్కవ అమరావతిలో దోపిడీ జరిగిందన్నారు. 

ఆర్బీఐ వారికి రూ. 4 కోట్లకు ఎకరా భూమి ఇచ్చిన చంద్రబాబు ప్రైవేట్‌ సంస్థలకు రూ. 50 లక్షలకు ఇస్తున్నారంటే మిగిలిన రూ. 3.5 కోట్లు ఎక్కడకు వెళ్తున్నాయన్న జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలని భూమన డిమాండ్‌ చేశారు. అమరావతి నగరం పేరుతో లక్ష కోట్లకుపైగా అవినీతి జరుగుతుందని నాలుగున్నరేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక సభలు, సమావేశాల్లో చెబుతుందన్నారు. జన్మభూమి కమిటీల నుంచి విశాఖపట్నం భూముల వరకు, భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి చిత్తూరు వరకు దోపిడీ జరుగుతుందని, చంద్రబాబు మోసాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాతో అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తున్నారని, మరోపక్క మేధావులు, ప్రభుత్వ మాజీ అధికారులు, న్యాయమూర్తులు బాబు అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని తుదముట్టించాలని కసితీర్చుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top