వంగి దండాలు పెట్టడం తప్ప.. ఒరిగిందేమీలేదు


చంద్రబాబు పాలనలో అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి
ఢిల్లీకి వెళ్లి పులిలా కాదు.. పిల్లికంటే ఘోరంగా వచ్చాడు
బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ప్రతిపక్షంపై బురద
కర్ణాటక ఎన్నికల తరువాత కేసులు ఏమయ్యాయి?
చిట్‌ఫండ్‌ కంపెనీ ఆస్తులు వెనక్కు ఇస్తూ చంద్రబాబు చీకటి జీఓ
టీడీపీ వారిని కాపాడుతూ ఖాతాదారులను రోడ్డున పడేసిన ప్రభుత్వం
అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు ఇదో కుట్ర
హైదరాబాద్‌: ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి వంగి వంగి మోడీకి దండాలు పెట్టడం తప్ప నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి ముందు మూడు రోజులు వరుసగా పచ్చమీడియాలో ప్రధానిని నిలదీస్తారు.. సమస్య తీరే వరకు నిరసన తెలుపుతారు అని ఎన్నో రకాల లీకులు ఇచ్చారన్నారు. 30వ సారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు మళ్లీ వంగి వంగి దండాలు పెట్టారన్నారు. పులిలా వస్తారని ప్రచారం చేసుకొని పిల్లికంటే ఘోరంగా వచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీతిఆయోగ్‌ సమావేశం జరిగి ఇవాల్టికి తొమ్మిది రోజులు గడుస్తున్నా.. ఈరోజుకి సమావేశంలో ఏఏ అంశాలపై చర్చించారో ప్రజలకు స్పష్టత ఇవ్వలేదన్నారు. సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చిన వాస్తవాలు చెబుతానన్న ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్‌మీట్‌ రద్దు చేశారో చెప్పాలన్నారు. 

బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదరడంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని బొత్స విమర్శించారు. నీతిఆయోగ్‌ సమావేశం తరువాత చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎక్కడైనా ప్రధాని గురించి కానీ, విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చని వైనం, రాష్ట్ర పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారని తేటతెల్లమవుతుందన్నారు. ఇది వాస్తవమా.. కాదా.. దీనిపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పైపుచ్చు వైయస్‌ జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని టీడీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రతీ రోజు పబ్లిక్‌ మీటింగ్‌లలో వైయస్‌ జగన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను నిలదీస్తూనే ఉన్నారన్నారు. 

కర్ణాటక ఎన్నికల తరువాత తనపై తప్పుడు కేసులు పెడతారు.. చర్యలు తీసుకుంటారు.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నా చుట్టూ వలయంగా ఉండాలని చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా.. ఎందుకు కేసులు పెట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలిసిపోతాయనే కుట్రతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మభ్యపెడుతున్నారన్నారు. 
ఎన్నికల కోసం చంద్రబాబు కొత్తగా ఇంకో డ్రామాకు తెరలేపారని బొత్స అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష అంటూ మరో వంచనకు పూనుకున్నారన్నారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబుకు ఉక్కు ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఏ ఒక్కరోజైనా పార్లమెంట్‌లో ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని ప్రశ్నించారా.. అంటే దానికి సమాధానం ఉండదన్నారు. సీఎం రమేష్‌ చేసే చిత్తశుద్ధి లేని దీక్షకు విద్యార్థులను తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 

ఒకపక్క చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. మరోపక్క వంగి వంగి దండాలు పెడుతూ.. ఇంకోపక్క బీజేపీ మంత్రుల భర్త, భార్యలకు రాష్ట్రంలో పదవులు కల్పిస్తూ పోరాటాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. నిర్మలాసీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను మీడియా అడ్వైజర్‌గా.. మహారాష్ట్ర మంత్రి భార్యను టీటీడీలో మెంబర్‌గా నియమించారన్నారు. మరో 15 రోజుల్లో పదవికాలం ముగుస్తుందనగా పరకాల రాజీనామా చేయడం.. దాన్ని చంద్రబాబు ఆమోదించడం.. ఆయనేదో రాష్ట్రానికి మేలు చేస్తున్నానని చెప్పడం ఇదంతా కొత్త డ్రామా అన్నారు. నీతిఆయోగ్‌ సమావేశానికి ముందు ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలికి ఉత్తరాల కుమారుడిగా చంద్రబాబు తయారయ్యారన్నారు. ప్రజలు పాలించమని అవకాశం కల్పిస్తే.. ఈ రకమైన మోసాలు చేస్తారా అని విరుచుకుపడ్డారు. 

తెలుగుదేశం పార్టీకి చెందిన వారి చిట్‌ఫండ్స్‌ ఆస్తులు వెనక్కి ఇస్తూ చంద్రబాబు జీఓ జారీ చేయడంలో అర్థం ఏంటని బొత్స ప్రశ్నించారు. చిట్‌ఫండ్‌లో డబ్బులు జమ చేసుకున్న ఖాతాదారులను రోడ్డున పడేస్తారా.. అని నిలదీశారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ కుటుంబీలకు చెందిన వెంకట్రాయ ఎంటర్‌ ప్రైజెస్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ 2011లో ఎత్తేశారని, ఖాతాదారులంతా తమకు న్యాయం చేయాలని అప్పటి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే.. ఎంక్వైరీ వేసి ఆస్తులను జప్తు చేసుకునేందుకు జీఓ జారీ చేసందన్నారు. కానీ చంద్రబాబు ఆ జీఓను రద్దు చేసి వారి ఆస్తులను చిట్‌ఫండ్‌ కంపెనీకి అందజేశారన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను లాక్కునే మార్గాన్ని సులువు చేసుకునేందుకు జీఓ విడుదల చేశారన్నారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో కూడా చిట్‌ఫండ్‌ కంపెనీ కోణంలోనే లక్షలాది మంది డిపాజిటర్లు ఉన్నారన్నారు. ఆ సంస్థ ఆస్తులపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కన్నుపడిందని, అగ్రి ఆస్తులను కాజేసే కుట్రలో భాగంగానే ముందుకు ఈ జీఓ జారీ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. 

నిజాయతీ గల వ్యక్తిని కూడా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు. రాష్ట్ర డీజీపీ జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగినట్లు.. పిట్‌ కేసు కదా అపీల్‌కు వెళ్లాల్సిన వీలు లేదని చెబితే.. ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు దాంట్లో పెట్టారన్నారు. మరి డిపాజిట్‌ దారులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. మీకు సంబంధించిన వ్యక్తులు అయితే ఖాతాదారులను నాశనం చేస్తూ జీఓలు విడుదల చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులంతా ఆలోచన చేయాలన్నారు. జీఓను రద్దు చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. నాలుగేళ్లుగా హింసించి, ఇప్పుడు జీతాలు పెంచి అంగన్‌వాడీ మహిళలను ఓట్లేయమంటే ఎలా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత చంద్రబాబుదని, 104, 108 ఏ వ్యవస్థ పనిచేయడం లేదన్నారు. అందుకే దివంగత మ హానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రామరాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top