రాయదుర్గం సీఐ తీరుపై డీజీపీకి ఫిర్యాదు

హైదరాబాద్ :

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అక్కడి ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి కక్షకట్టి తప్పుడు కేసు నమోదు చేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసింది. గతంలో ఆ ఇన్‌స్పెక్టర్ కొందరు అమాయకు‌లను పోలీసుస్టేషన్‌కు పిలిపించి దౌర్జన్యం చేశారని, ఆ సందర్భంలో రామచంద్రారెడ్డి పోలీసు దౌర్జన్యాన్ని ప్రశ్నించడంతో పాటు దానికి నిరసనగా పోలీసుస్టేషన్‌ వద్దే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.

‌దీనితో కక్షకట్టిన ఇన్‌స్పెక్టర్ ఎన్నికల సందర్భంలో రామచంద్రారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  ఇప్పటికీ ఎలాంటి నామినేషన్ దాఖలు చేయని నేపథ్యంలో ఎఫ్‌ఐఆ‌ర్‌లో పేర్కొన్న సెక్షన్లు వర్తించవని తెలి పారు. వైయస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అనంతపురం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Back to Top