వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చలో ఢిల్లీ నేడు

హైదరాబాద్:

వైయస్ఆర్‌‌ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘సమైక్య ధర్నా’ నిర్వహించను‌న్నది. ‌రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైయస్ఆర్‌ సీపీ విభజనకు వ్యతిరేకంగా తన నిరసన వాణిని దేశ రాజధాని ఢిల్లీలో బలంగా వినిపించే క్రమంలో ఢిల్లీలో సమైక్య ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తద్వారా అడ్డగోలుగా విభజిస్తున్న యూపీఏ ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా చేయాలని వైయస్ఆర్‌సీపీ భావిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ ధర్నాలో భారీ ఎత్తున పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదులుతున్నాయి.

రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్ళు శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరాయి. ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు శుక్రవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ధర్నా ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలిపారు. ఢిల్లీ నడిబొడ్డున సమైక్య ధర్నా ద్వారా యూపీఏ పెద్దలకు తెలుగు ప్రజల మనోభావాలను తెలియజేస్తామని చెప్పారు. రెండు రోజులుగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమైక్యబంద్ విజయవంతమైందని తెలిపారు.

‌ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇప్పటికే 8 పార్టీలు గళం విప్పాయని‌ పద్మ వివరించారు. ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముందుకు రావాలని పద్మ విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు తన వాదనను స్పష్టం చేయాలి. అటు ఇటు కాని వాదనతో కొబ్బరిచిప్పల సిద్ధాంతం ద్వారా తెలుగు ప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారు. కాంగ్రెస్ ఒకరకంగా నష్టం కలిగిస్తే, ‌చంద్రబాబు తాను ఇచ్చిన విభజన లేఖను ఉపసంహరించుకోకుండా ఇక్కడిదాకా తెచ్చారు. తెలుగు జాతికి మద్దతుగా బాబు సమైక్య జెండా పట్టుకోవాలి. చివరిక్షణంలోనైనా బాధ్యత తీసుకుని మాతో పాటు ధర్నాకు కూర్చొని తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి’ అని వాసిరెడ్డి పద్మ సూచించారు.

Back to Top