ఆగష్టు 2న ఏపీ బంద్

  • హోదాపై టీడీపీ, బీజేపీ దుర్మార్గ వైఖరికి నిరసనగా బంద్
  • ముఖ్యమంత్రి అసమర్థత వల్లే బీజేపీ హోదా ఇవ్వడం లేదు
  • ఓటుకు నోటు కేసు, అవినీతి కేసుల భయంతోనే బాబు నోరుమెదపడం లేదు
  • హోదాపై దొంగాట ఆడుతున్న టీడీపీపై వైయస్సార్సీపీ ఆగ్రహం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగష్టు 2న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదలచేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంతో రూఢీ అయింది. అయినప్పటికీ నిర్లజ్జగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టు కూడా స్పష్టమైంది.

బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదు. టీడీపీ పట్టుబట్టదు. ఆ రెండు పార్టీల దుర్మార్గ వైఖరికి నిరసనగా, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని... ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునిస్తోంది. ప్రతీ ఒక్కరూ ఈ బంద్‌లో పాల్గొని  విజయవంతం చేయాలని  విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక హోదా సంజీవని కాదని, సాక్షాత్తూ  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నందువల్లే బీజేపీ ఈ నిర్ణయానికి రాగలిగిందని పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రే చెలగాటం ఆడారని మండిపడ్డారు.

తన మీద కేసులు లేకుండా చూసుకుంటే చాలు, ఏపీ ప్రజలకు ఎంత అన్యాయం చేసినా నోరుమెదపబోమన్న వైఖరి వల్లే బీజేపీ ఈ దుస్సాహసానికి ఒడిగట్టిందన్నారు.  రాజ్యసభలో చర్చ జరిగిన తీరు, టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకత్వం ఈ సందర్భంగా చేసిన ప్రకటనలు, రెండేళ్లుగా ఆడుతున్న డ్రామాలు మొత్తం.. ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని తెలిపారు. ఈ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అధ్యక్షులు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
 కేసుల భయంతోనే...
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్న సంకల్పమే చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి బాధ కలిగించిందని చంద్రబాబు బేలగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా కేంద్రంపై పోరాడాలనే ఆలోచన టీడీపీ అధినేతకు రాకపోవడం గమనార్హం. హోదా కోసం తెలుగుదేశం గట్టిగా పట్టుబట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.

కానీ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభలో చేసిన ప్రసంగాలు హోదా సాధనపై వారికి చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశాయి. జైట్లీ ప్రకటన బాధ కలిగించిందని మాత్రమే చంద్రబాబు అన్నారు కానీ.. కేంద్రం నుంచి వైదొలగుతామనో, మంత్రులతో రాజీనామా చేయిస్తామనో కనీసం హెచ్చరికగా కూడా ఆయన మాట్లాడలేకపోయారని వైయస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోవడం, రాష్ట్రంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో.. హోదా కోసం ఒత్తిడి చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Back to Top