అఖిలపక్ష సమావేశానికి దూరంగా వైయ‌స్ఆర్‌సీపీ


 

- హోదా ఉద్య‌మాన్ని నీరు గార్చేందుకు చంద్ర‌బాబు మ‌రో కుట్ర‌
- బాబు కుట్ర‌లో భాగ‌స్వాములం కాద‌ల్చుకోలేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్ప‌ష్టం

 అమరావతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట, రోజుకో వేషం వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు  కుట్రలో తాము భాగస్వాములం కాదల్చుకోలేదని, మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ‘ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉసురు తీయడానికి శతవిధాల ప్రయత్నించిన ముఖ్యమంత్రి ఇప్పుడు హోదా ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏమిటి? పెద్దమనిషిగా వ్యవహరించడం ఏమిటి? చంద్రబాబు పన్నిన మరో కుట్ర ఇది. అందులో మేం భాగస్వాములం కాదల్చుకోలేదు’అని స్పష్టం చేసింది. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి సోమవారం రాత్రి పార్టీ సీనియర్‌ నేతలతో అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది.
 
ఏ నైతికతా లేని సీఎంను ఎలా నమ్మాలి? 
‘‘ఏ నైతికతాలేని ముఖ్యమంత్రి పిలవడం ఏమిటి, ఆయన మీద ఎలా నమ్మకం పెట్టుకుంటాం? చంద్రబాబు చేసే మరో కుట్రలో మేం భాగస్వాములం కాదల్చుకోలేదు. సెప్టెంబర్‌ 8, 2016లో ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేశారు. మళ్లీ మొన్న కేంద్ర క్యాబినెట్‌ నుంచి టీడీపీ మంత్రులు వైదొలగుతున్నప్పుడు మళ్లీ అదే ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. రెండూ ఒకే రకమైన ప్రకటనలు అయినప్పుడు గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదు? మొదటిసారి జైట్లీ ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఉందని పొగడలేదా? అసెంబ్లీలో ధన్యావాదాల తీర్మానం పెట్టి కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపించలేదా? అంతెందుకు గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై ఏ పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని చంద్రబాబు నీరుగార్చలేదా? బంద్‌లు, ధర్నాలు అడ్డుకోలేదా? ఈ ఆందోళనలను దగ్గరుండి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించలేదా? చివరకు విద్యార్థుల్లో చైతన్యం తీసుకు రావడానికి యువభేరీలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్టులు పెడతామని బెదిరించలేదా? నిరాహారదీక్షలు చేస్తే శిబిరాలు ఎత్తివేయలేదా?  

క్రెడిట్‌ కోసం ప్లేటు ఫిరాయించారు.. 
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చే రోజు కంటే ముందు.. అంటే ఈనెల 15న చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సంఖ్యాబలం ఉంటే.. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. ఆ తర్వాత రోజే .. అంటే ఈనెల 16న ఉదయం 9 గంటల వరకు ఎన్డీయేలో కొనసాగి.. ఆ తర్వాతే.. వెంటనే తమకు తాముగా అవిశ్వాసం పెడతామని చెప్పలేదా? మా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి అవిశ్వాసానికి మద్దతు కూడగడుతూ దేశంలోని ప్రతీ పార్టీకి లేఖలు రాసి కార్యాచరణలోకి దించారు. ఆ విషయం తెలిశాక అప్పుడు బాబు.. కెడిట్‌ కోసం తనకు తానుగా అవిశ్వాసం పెడతామని ప్లేటు ఫిరాయించారు. ముందురోజు మద్దతు ఇస్తామన్నారు. రెండో రోజు మాట మార్చారు. ఈ రకంగా పూటకో మాట, రోజుకో స్టేట్‌మెంట్‌ ఇచ్చే చంద్రబాబు ఇప్పుడు పెద్దరికం వహించడం ఏమిటి? పార్టీలను పిలిచినంత మాత్రాన, ఇప్పుడు మంచోడివి అయిపోయావని మేము కానీ, ప్రజలు కానీ ఎందుకు నమ్మాలి? బాబు పన్నుతున్న మరో కుట్రలో మేం భాగస్వాములం కాలేం. ఆయన చిత్తశుద్ధిపై మాకు నమ్మకం లేదు.  


రాజీనామాలు చేసి సరైన సంకేతం ఇద్దాం.. 
హోదా సాధన పోరాటానికి  ఇప్పటికే మేం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాం. మా ఎంపీలు రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. టీడీపీకి చెందిన ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించండి. ఎంపీలంతా ఒక్కతాటిపైకి వచ్చి రాజీనామాలు చేస్తే దేశానికి సరైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. ఎంపీల రాజీనామాలకు సంబంధించి ఇప్పటికే మేం పిలుపునిచ్చాం. ఆ కార్యక్రమంలో చంద్రబాబు, ఆయన పార్టీ ఎంపీలు భాగస్వాములయ్యే విధంగా అడుగులు ముందుకు వేయాలి. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ’’అని లేఖలో స్పష్టం చేసింది.  


Back to Top