వైయస్ఆర్ కాంగ్రెస్ 'సమైక్య' నిరసనలు

హైదరాబాద్ 08 ఆగస్టు 2013:

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.
అనంతపురంలో పార్టీ నేతలు సోనియాగాంధీకి పిండ ప్రదానం చేసి, నిరసన తెలిపారు. సప్తగిరి సర్కిల్ నుంచి సుభాష్‌రోడ్డు మీదుగా టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లి, తిరిగి సప్తగిరి సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీ సందర్భంగా సోనియాగాంధీ వ్యతిరేక నినాదాలు చేశారు. పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ... సోనియాగాంధీ తన ఇష్టమొచ్చిన రీతిలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే నష్ట పోయేది రాయలసీమ వాసులేనని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు నీకు పట్టవా? అంటూ ప్రశ్నించారు. విభజనపై వెనక్కు తగ్గక పోతే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి పరశురాం, షెక్షావలి, మైనూద్దీన్, మహానందరెడ్డి, మారుతీనాయుడు, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.

తిరుపతిలో భూమన బైక్ ర్యాలీ: రాష్ట్ర విభజన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాలకు సమ న్యాయం పాటించడంలో విఫలమైందని తిరుపతి పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో 1500 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 50 కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీ తిరుపతి పురవీధుల గుండా వెళ్లింది. దివంగత మహానేత డాక్టర్  వైయస్  రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ,  సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, సోనియాగాంధీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు.

చిత్తూరులోనూ బైక్ ర్యాలీ: చిత్తూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏయస్ మనోహర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.  గిరింపేటలోని పార్టీ కార్యాలయం వద్ద  ర్యాలీని  మనోహర్ ర్యాలీని ప్రారంభించారు. గుడిపాల, చిత్తూరు రూరల్ మండలం, చిత్తూరు నగరం నుంచి  పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో సీబీ రోడ్డు, అంబేద్కర్ సర్కిల్, పలమనేరు రోడ్డు, గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. అక్కడి నుంచి హైరోడ్డు, బజారువీధి, చర్చివీధి, గాంధీ రోడ్డు, తిరుపతి రోడ్డు, ఆర్టీసీ డిపో రోడ్డు, ఆఫీసర్సు లైన్, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల గుండా ర్యాలీ సాగింది. ఒక వాహనంలో తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థిని కూర్చోపెట్టారు.

ఉద్యమానికి మంత్రుల సహకారం కరవు: సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశించిన స్థాయిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించడం లేదని పార్టీ  సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ విమర్శించారు. మాచవరంలో ఉప సర్పంచ్ సబ్బెళ్ల కాశీ ఈశ్వరరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తలెత్తే సమస్యలను అంచనా వేయకుండా కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరితంగా నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ సహకరించడం వల్లే కాంగ్రెస్ ఇలా వ్యవహరించిందన్నారు.  కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కొందరి స్వార్థ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని ముక్కలుగా చేశారన్నారు.

సమైక్యాంధ్రాను పరిరక్షించుకుందాం: సమైక్యాంధ్రాను సాధించుకోవడం కాదు.. పరి రక్షించుకుందామని పార్టీ  సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో అంధ్రప్రదేశ్ ముందడుగులో ఉందనీ, విభజన జరిగితే ఆంధ్రా ప్రాంతం నీటి కరవుతో అల్లాడుతుందనీ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ దురుద్దేశంతో విభజన చేయడం దారుణమని నెహ్రూ విమర్శించారు. హైలెవల్ కమిటీలో అన్ని పార్టీల నేతలకూ భాగస్వామ్యం కల్పించాలని ఆయన సూచించారు.  అంశాలపై చర్చలు జరగాలని పేర్కొన్నారు.

మహానేత బతికుంటే విభజన ఉత్పన్నమయ్యేదే కాదు:
దివంగత మహానేత డాక్టర్  రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని  పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో పిడుగురాళ్ళ పట్టణంలోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన పబ్బం కడుపుకోవడం కోసం రాష్ట్ర విభజన చేస్తుందన్నారు.

Back to Top