అఫిడవిట్లిచ్చి చిత్తశుద్ధి కనబరచండి: అంబటి

హైదరాబాద్, డిసెంబర్ 27, 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ, రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యాంధ్రపై తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని ముఖ్యమంత్రికీ, పీసీసీ అధ్యక్షునికీ, టీడీపీ అధ్యక్షునికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఇతర రాష్ర్టాల విభజన ప్రక్రియను పరిశీలించడానికి ఉత్తర ప్రదేశ్ కు వెళ్ళిన అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంది.
డ్రాఫ్టు బిల్లుపై చర్చను ప్రారంభించడమంటే రాష్ట్ర విభజనకు సభ్యులు అంగీకరించినట్లే అవుతుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమైక్య ఛాంపియన్ కావాలని ఆశిస్తున్న కిరణ్, బొత్స, చంద్రబాబు తొలుత ఆమేరకు రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని హితవు పలికారు.
పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతున్నారనీ, హైకమండ్ రాష్ట్రాన్ని విభజించడానికి నిర్ణయించుకుందనీ ఈ క్రమంలో బొత్స పార్టీ విధేయుడా లేక సమైక్యవాదా అనే విషయం స్పష్టంచేయాలని అంబటి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ గీతను దాటి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖలు ఇవ్వాలని కోరారు.
నాదెండ్ల మనోహర్ పై శ్రీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా సంబంధిత అసెంబ్లీల తీర్మానంతో విడిపోయిన రాష్ట్రాలలో స్పీకర్ పర్యటిస్తున్నారన్నారు. ఫలానా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ అసెంబ్లీకి ముసాయిదా బిల్లును పంపిందన్నారు. దానిపై చర్చించిన తరవాత ఆ రాష్ట్ర విభజన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలలో విభజనకు ఎక్కడా వ్యతిరేకత ఎదురుకాలేదని చెప్పారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయం ఇలా లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే ముసాయిదా బిల్లును ఏకపక్షంగా  అసెంబ్లీకి పంపారని తెలిపారు. ఇటువంటి సందర్భంలో సభ్యుల అభిప్రాయాలను తెలుసుకుని విభజన ప్రక్రియ పరిశీలన అనే అంశమే తలెత్తదని అంబటి స్పష్టంచేశారు.
ఇటువంటి సందర్భంలో రాష్ట్ర విభజనపై పర్యటన చేపట్టిన స్పీకర్ అధికారాన్ని ప్రశ్నించడంలో ఎటువంటి తప్పూ లేదని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన పరిశీలనకు వెళ్ళిన రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఏకపక్షంగా విభజించడానికి ప్రయత్నించలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మన రాష్ట్ర స్పీకర్ కార్యాలయ అధికారాన్ని దుర్వినియోగపరుస్తోందన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించి ఓటు వేసినప్పటికీ వారిపై స్పీకర్ చర్య తీసుకోని విషయాన్ని ఆయన ఉదహరించారు. ఎమ్మెల్యేల వ్యతిరేకత అసెంబ్లీలోనే వెల్లడైనప్పటికీ జూలై 8వ తేదీ వరకూ వారిపై చర్యలను తీసుకోవడంలో జాప్యం చేశారనీ, మళ్ళీ ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధంగా లేకపోవడమే దీనికి కారణమనీ అంబటి వివరించారు.
ఇది స్పీకర్ కార్యాలయ అధికారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దుర్వినియోగం చేయడం కాక మరేమిటని నిలదీశారు. కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందనడానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలని ప్రశ్నించారు. మార్చిలోనే ఆ ఎమ్మెల్యేలను అనర్హులను చేసి ఉంటే మరో ఉప ఎన్నిక వచ్చి ఉండేదనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ బలం పెరిగిఉండేదనీ ఆయన వివరించారు.
కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక వర్గం మీడియా శ్రీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారనీ, కానీ శ్రీ జగన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమనీ అంబటి బల్లగుద్ది చెప్పారు.

Back to Top