నాటకాలాపండి... లేఖ ఉపసంహరింపజేయండి

హైదరాబాద్ 22 ఆగస్టు 2013:

పార్లమెంటులో కాంగ్రెస్, టీడీపీల చేష్టలు సినిమాని తలపించాయని వైయస్ఆర్ కాంగ్రస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. చేయాల్సిందంతా చేసేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, ప్రజల మనోభావాలను దెబ్బదీసి ఆ పార్టీలు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన లేఖ వల్లే తెలంగాణ సాధ్యపడిందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ వైఖరిని విడనాడి పార్లమెంటులో తన సభ్యులతో డ్రామాలాడించడాన్ని ఆయన ప్రశ్నించారు. రెండు ప్రాంతాల్లో రెండు నాటకాలాడిస్తున్న చంద్రబాబు రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారని నిలదీశారు. వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. ఏపీ ఎన్జీఓలు వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ మీద లేఖ ఇచ్చేశాను.. వెనక్కి తీసుకునేది లేదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు పార్లమెంటులో తమ పార్టీ సభ్యులతో నాటకాలాడించడాన్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. తెలంగాణకు అనుకూల లేఖ ఇచ్చేసిన తర్వాత ఈ అంశంపై రాజకీయాలు చేయాల్సిన అవసరమేమిటన్నారు. చంద్రబాబు మనసులో ఒకటి పెట్టుకుని, బయటకు ఒకటి చెప్పి.. ఒక స్టాండ్ లేకుండా వ్యవహరించడం ఎందుకన్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న తమ నేత చంద్రబాబు నుంచి పార్లమెంటులో రోజుకో డ్రామా ఆడుతున్న టీడీపీ సభ్యులు తెలంగాణపై ఇచ్చిన లేఖను ఉపసంహరింపజేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కనీసం అలా అడిగే ధైర్యం కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు.

మైలేజీ వస్తుందనే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు

మైలేజీ వస్తుందని పార్లమెంటులో అలా ప్రవర్తిస్తున్నారు తప్ప... వారి చేష్టలలో చిత్తశుద్ధి లేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ఇంటిముందు కూర్చుంటే వారికి చిత్తశుద్ధి ఉన్నట్లు తేలుతుందన్నారు. కాంగ్రెస్ సభ్యులు కూడా సోనియాను పార్లమెంటులోనో.. లోపలికి వస్తుండగానో తెలంగాణపై ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనీ, ఆంధ్ర ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేశారనీ నిలదీసి ఉంటే సార్థకత ఉండేదనీ, అలా చేయడం మాని ఎవరిని సంతృప్తిపరచాలనీ, లేదా ఏం సాధించాలనీ ఈ నాటకాలాడుతున్నాని నిలదీశారు.

తపన తప్ప కిరణ్ చేస్తున్నదేమిటి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోవైపు తానో సమైక్యవాదిలా నిరూపించుకోవడానికి తపన పడడం తప్ప మరేమీ చేయడం లేదన్నారు. ఢిల్లీలో సోనియా తదితరులను కలిసి ఏం మాట్లాడతారో తెలీదు గానీ, తదుపరి మాత్రం తాను వారిని నిలదీశానని మీడియాకు చెబుతుంటారని ఎద్దేవా చేశారు. ఇలా మాట్లాడుతున్న వ్యక్తి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వీరికి ప్రజలు గుడ్డివారిలా కనిపిస్తున్నట్లు తోస్తోందన్నారు. ప్రజలు అన్ని అంశాలనూ గమనిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్న తీరు రాష్ట్రాన్ని కాపాడడానికి ఎంత తపన పడుతున్నారో అర్థమవుతోందన్నారు. అలాంటి వారిని చూసి పార్లమెంటు సభ్యులు కూడా రోడ్లపైకి రావాలనీ, ప్రజలను మభ్యపెట్టే చర్యలను నిలుపుచేయాలనీ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనలో ఉద్యమాన్ని బలహీనపరచాలనే ఉద్దేశం కనిపిస్తోందని ఆరోపించారు.

అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసిన తర్వాత విభజనపై నిర్ణయం తీసుకోవాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అభిలషించారనీ, గట్టిగా కోరిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం లీకులు ఇచ్చుకుంటూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనకు తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికి చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిపారు. స్పీకరు ఫార్మాట్లో రాజీనామాలు చేయలేదని టీడీపీ ఎంపీలు బుధవారం పార్లమెంటు బయట చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి వైఖరితో వీళ్ల చిత్తశుద్ధి వెల్లడవుతోందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే తమ పదవులను ఇప్పుడే వీడాలని సూచించారు.

స్పీకర్ ఫార్మాట్లో టీడీపీ ఎంపీ హరికృష్ణ రాజ్యసభలో రాజీనామా పత్రాన్ని ఉదయాన్ని సమర్పిస్తే... మధ్యాహ్నానికి ఆమోదించారనీ, అలాగే మిగిలిన ఎంపీలు కూడా నిర్ణీత ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించాలి తప్ప డ్రామాలాడడం కాదని శ్రీకాంత్ రెరడ్డి డిమాండ్ చేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి ఆడుతున్న డ్రామాలు హాలివుడ్ సినిమాను మించిపోయాయని ఎద్దేవా చేశారు. ఎందుకిలా చేస్తున్నారు.. మీ రాజీనామాలు ఎందుకు ఉద్దేశించారన్నారు.

తాము కూడా స్పీకరుగారిని రెండు చేతులతో నమస్కరించి తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కలుద్దామని అసెంబ్లీలోని కార్యాలయానికి వెడితే ఆయన అందుబాటులో ఉండరని చెప్పారు. తాము స్పీకరు ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించామన్నారు. తెలుగు ప్రజలు పదేళ్ళుగా పూర్తిగా మద్దతు పలుకుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరచిపోకూడదన్నారు. దానిని మరిచి రాష్ట్రంలో అనిశ్చితిని పెంచి, అగ్నిగుండంగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top