‌సిఎం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ

హైదరాబాద్, 10 జూలై 2013:

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఆ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లన్నీ గల్లంతయ్యాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకులు బి. జనక్‌ప్రసాద్, శివకుమా‌ర్‌ ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రే తన నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ ఫిర్యాదుపై త్వరగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వారు కోరారు.

రెండున్నర సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదని, దానితో కేంద్రం నుంచి మనకు రావాల్సిన రూ 3 వేల కోట్లు రాలేదని జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. సిఎం సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఎక్కిడికి పోయిందని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిచే పరిస్థితి లేదనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగించారా? అని ప్రశ్నించారు.‌ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు జూలై 6వ తేదీన జాబితాలో ఉన్న పేర్లు 9న నోటిఫికేషన్‌ వచ్చాక ఎందుకు మాయమయ్యాయని నిలదీశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున సర్పంచ్‌లుగా పోటీచేసే పేర్లను కూడా తీసేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు. కొన్ని గ్రామాల్లోని ఓటర్ల జాబితాలో పీలేరు పట్టణం లోని ఓటర్లను చేర్చారని ఆరోపించారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వైనాన్ని ఆయన నిలదీశారు. ఓటర్ల జాబితాలో ఓటరు ఫోటో ఉంటుంది, వయస్సు కూడా ఉంటుంది కానీ ఓటరు పేరు మాత్రం ఉండదని ఆరోపించారు. ఫోటో, వయస్సు ఉన్నా, పేరు తొలగించిన కారణంగా ఆ వ్యక్తి ఓటు వేయడానికి గాని, పోటీ చేయడానికి గాని అవకాశం ఉండదన్నారు. ముఖ్యంగా ఎర్రగుంట గ్రామంలో ఇలాంటి దుశ్చర్య చోటు చేసుకుందన్నారు.

‌విజయవాడలో మహానేత వైయస్ఆర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులను కోడ్‌ ఉల్లంఘన కింద అరెస్టు చేయడాన్ని జనక్‌ప్రసాద్‌ ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆగస్టు 15 వరకూ నీళ్ళు ఇస్తామని ముఖ్యమంత్రి చెబితే అది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి రాదా? అని ఆయన నిలదీశారు. ఈ విషయం పోలీసులు, ఎన్నికల సంఘానికీ అర్థం కాలేదా అన్నారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం పైన ఉందన్నారు. పీలేరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్లను నామినేషన్లు ముగిసే 13వ తేదీ లోగా పునరుద్దరించి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పోటీచేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో కాంగ్రెస్‌ పార్టీ తన అధికార బలంతో సిఎం సొంత నియోజకవర్గం పీలేరులో ఎంతో మంది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని శివకుమార్‌ తప్పు పట్టారు. ముఖ్యంగా గతంలో పోటీ చేసిన మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం కాంగ్రెస్‌ పార్టీ అక్రమాలకు నిదర్శనం అని శివకుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన పీలేరు నియోజకవర్గం నుంచి కొందరు నాయకులు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top