తొలుత కాంగ్రెస్ అభిప్రాయం వెల్లడించాలి

హైదరాబాద్ 17 జూలై 2013:

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ మొదట తన అభిప్రాయాన్ని వెల్లడించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచరీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి పార్టీ ఓ లేఖ రాసింది. ఈ అంశంపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. నిర్ణయం తీసుకోవడమే తరువాయనీ, చర్చలన్నీ ముగిశాయనీ కాంగ్రెస్ పార్టీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజన అంశంపై  నిర్ణయాధికారాన్ని సీడబ్ల్యూసీకి కట్టబెట్టడం చూస్తే, ఇదేదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంగా పరిగణిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీన్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన ప్రక్రియగా మార్చుకుంటున్నట్లుందన్నారు. ఈ వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండింస్తోందన్నారు.

ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా తన అభిప్రాయాన్ని తెలియజెప్పాలని కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. ఇంతవరకూ ఆ పార్టీ ఆ పనిచేయలేదన్నారు. ఇరుప్రాంతాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొడుతోందనీ, తద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రగులుస్తోందనీ ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పకుండా నిర్ణయమొక్కటే తరువాయని ప్రకటించడం సమంజసం కాదన్నారు. ఇరుప్రాంతాల ప్రజలను అవమాన పరచడం తప్ప మరొకటి కాదని స్పష్టంచేశారు. ఏకపక్ష నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా అంగీకరించవని భూమన పేర్కొన్నారు. విభజన అనివార్యమైనప్పుడు కాంగ్రెస్ తొలుత తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు. కేంద్రం అందరితో చర్చించి, సంబంధిత ప్రతిపాదనలను ప్రజల ముందుంచిన తర్వాత ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదేదో కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారంలా పరిగణించరాదన్నారు. ఆ రకంగా భావించి ఏదో నిర్ణయాన్ని ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని కేంద్రంలో నిక్కచ్చిగా ప్రకటించాలని సూచించారు. ఇరుప్రాంతాలను రెచ్చగొట్టే చర్యలు చేపట్టరాదన్నారు. కేంద్రం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తొలుత రాష్ట్రంలో తదుపరి, యూపీయే ప్రభుత్వంలో తన అభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. ఈ అంశంపైనే కేంద్ర హోం మంత్రి షిండేకు బహిరంగ లేఖను రాశామన్నారు. అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ నాయకులు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, కె.కె. మహేందర్ రెడ్డి పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top