నంద్యాల (కర్నూలు జిల్లా), సెప్టెంబర్ 2 : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని.. వాటిపై విచారణ చేయిం చాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహానేత వైయస్‌ఆర్ మూడవ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆత్మకూరు సమీపంలోని స్మృతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో వైయస్ సతీమణి విజయమ్మ కూడా ప్రభుత్వాన్ని ఇదే కోరారని ఆయన గుర్తు చేశారు.‘వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి, తట్టుకోలేని ప్రభుత్వం సీబీఐని అడ్డం పెట్టుకొని అన్యాయంగా జైల్లో ఉంచింది. కనీసం తండ్రి వర్ధంతి వేడుకలకు హాజరు కాకుండా చేసింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయితేనే మహానేత పథకాలు తిరిగి అమలవుతాయన్నారు. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావిస్తూ.. సుబ్బారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.