హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైనందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనతను దిగ్విజయంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ వాణిజ్య ప్రయోగం ద్వారా దేశానికి సంపదను అందివ్వడమే కాకుండా అంతరిక్ష సాంకేతిక పరిశోధనలో మరో మైలురాయిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిగమించిందని ఆయన ప్రశంసించారు. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి నింగికి ఎగిరిన పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్ సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.