విజయమ్మ దీక్షకు వివేకా సంఘీభావం

గుంటూరు, 22 ఆగస్టు 2013:

ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి లేదంటే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మకు మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి మద్దతు ప్రకటించారు. సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమాలు నిర్వహిస్తున్న ఉద్యమకారులందరికీ కూడా ఆయన సంఘాభావం తెలిపారు. సమరదీక్ష పేరుతో గుంటూరులో శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరశన దీక్షా శిబిరానికి వివేకా గురువారం వచ్చారు.

రాష్ట్రంలో వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలని, అందరూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అహరహం శ్రమించారని వివేకానందరెడ్డి గుర్తుచేశారు. ప్రతి ఎకరాకూ సాగునీటిని అందించాలని, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని భావించిన వైయస్ఆర్‌ ఆశయాలు మనందరికీ తెలిసిందే అన్నారు. ఆ మహానేత ఆశయాలను సాధించడానికే శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందన్నారు. శ్రీ జగన్‌కు ప్రజల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా జైలులో పెట్టి దాదాపు 14 నెలలు దాటిందని తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ఆర్‌ తలపెట్టిన పథకాలన్నింటికీ తూట్లు పొడిచారని, రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని వివేకానందరెడ్డి ఆరోపించారు. అన్ని ప్రాంతాల సమస్యల గురించి పూర్తిగా విచారించిన తరువాతే రాష్ట్ర విభజన జోలికి వెళ్ళమని శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. తెలంగాణ కన్నా అత్యంత దారుణంగా వెనుకబడిన ప్రాంతాలున్నాయని ఆ కమిటీ చెప్పిన విషయాన్ని వివేకా ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాటిని అభివృద్ధి చేసేంత వరకూ రాష్ట్ర విభజన ఆమోదయోగ్యం కాదని చెప్పినప్పటికీ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ గాని, సిడబ్ల్యుసి గాని ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top