-నాలుగు రోజుల పాటు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర పూర్తి చేశారు. నాలుగు రోజుల పాటు నల్గొండ జిల్లాలో ఈ యాత్ర సాగింది. మంగళవారం నాడు ప్రారంభమైన ఈ యాత్ర ఆరు నియోజక వర్గాల పరిధిలో సాగి, శుక్రవారం నాడు ముగిసింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో యాత్రను పూర్తి చేసిన షర్మిల తాజాగా అదే నల్లగొండ జిల్లాలో యాత్ర ను పూర్తి చేశారు.
మొదట బీబీ నగర్ టోల్ ప్లాజా దగ్గర దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణించి ఐదేళ్లయినా కోట్లాదిమంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారని ఆమె అన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో కనీ వినీ ఎరుగని పథకాలకు రూపకల్పన చేసి, వాటిని అమలు చేశారని గుర్తు చేశారు. పేదల గురించి కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ఆలోచించే వారని ఆమె అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం, 108 వాహనాలు వంటి పథకాల ద్వారా లక్షలాది ప్రజలకు పునర్జన్మ ప్రసాదించారని షర్మిల అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మహానుభావుడు మరణిస్తే, కొన్ని వందల గుండెలు ఆగిపోయాయని ఆమె తెలిపారు.
బీబీ నగర్ మండలంలోని పడమటి సోమారం లోని బలరాం గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. చెరకు కిష్టయ్య గౌడ్ కుటుంబాన్ని కలుసుకొన్నారు. కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, అనంతరం ముస్తాలపల్లిలో క ళ్లెం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఆలేరు నియోజక వర్గంలోని దాతరుపల్లిలో సుంచు చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలోని చింతల కృష్ణ కుటుంబాన్ని పలకరించారు.ఇక, రెండో రోజు షర్మిల ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజక వర్గాల్లో ఆరు కుటుంబాల్ని పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆత్మ సై్థర్యాన్ని నింపారు. వైఎస్సార్ కోసం చనిపోయిన వారి కుటుంబాలు..తమ కుటుంబంతో సమానమని, ఆయా కుటుంబాల సభ్యులకు తాము అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. రామన్న పేట మండలం సిరిపురం గ్రామంలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకొన్నారు.
ఆలేరు మండలం శారాజీపేట లో ఎదుళ్ల శ్రీనివాస్ కుటుబాన్ని, పొడిచేడు లో బీతి గౌరమ్మ కుటుంబసభ్యుల్ని పలకరించారు. ఈ సందర్భంగా జోహార్వైఎస్సార్ అన్న నినాదాలు మిన్నంటాయి. వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా నినాదాలు చేశారు. అనంతరం అమ్మనబోలు గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిరిపురంలో పున్న వీరయ్య కుటుంబాన్ని , కట్టంగోలులో గాదగోని రాములు కుటుంబాన్ని, మరూరు లో పుట్ట సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. బీమారం గ్రామంలో నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని పరామర్శించాక రాత్రి నకిరేకల్ లో బస చేశారు.
ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ మూడో రోజు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగించారు. నల్లగొండ, మునుగోడు నియోజక వర్గాల్లో పర్యటించారు. మొదట ఇందుగుల లో రాయించు నర్సింహ కుటుంబాన్ని పలకరించి ధైర్యం చెప్పారు. అక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అన ంతరం సిలార్మియాగూడెంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తిప్పర్తి మండలకేంద్రంలోని గుంటి వెంకటేశం కుటుంబ సభ్యుల్ని కలిసి కష్ట సుఖాలు అడిగి తెలుసుకొన్నారు. చందన పల్లిలో భిక్షమయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పలకరించారు. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రం చేరుకొని అక్క డసిమెంట్రోడ్డులోని పాండేకర్దయానంద్ కుటుంబాన్ని పరామర్శించారు. నాంపల్లి కి వెళ్లి అస్తర్ బీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తర్వాత మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
నాలుగోరోజైన శుక్రవారం అంకిరెడ్డి గూడెంలోని బి. వసంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబాన్ని పలకరించటంతో రెండో విడత పరామర్శ యాత్ర ముగిసింది. తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకొన్న కుటుంబాల్ని ఆదుకొంటామని, కష్టాల్లో అండగా ఉంటామని వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఆమె వెంట పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర సీనియర్నాయకులు పాల్గొన్నారు.