వరద బాధితులకు వైఎస్ జగన్ భరోసా

రెండ్రోజులుగా చిత్తూరు,వైఎస్సార్ ,నెల్లూరు జిల్లాల్లో పర్యటన
తమ గోడును జననేతకు చెప్పుకున్న బాధితులు
అధైర్య పడొద్దని ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ భరోసా
 
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని ధైర్యం నింపుతున్నారు. మోకాల్లోతు నీటిలో కాలినడకతో పర్యటిస్తూ వైఎస్ జగన్ బాధితులను పరామర్శిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలు పరిశీలించి..రైతులు, ఇతర బాధితులను పరామర్శిస్తున్నారు. వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాల్లో వైఎస్ జగన్ కలియ తిరుగుతున్నారు. వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ స్థానికుల్లో భరోసా కల్పించారు. 

రెండు వారాలుగా ఎదుర్కొంటున్న బాధలను ప్రజలు ఆయనకు చెప్పుకుంటున్నారు.  ఇళ్లు, పంటలు, సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదిరోజులుగా నీటిలోనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వం కనీస సహాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్న రోడ్డు మార్గం ద్వారా చిత్తూరుజిల్లాకు చేరుకున్న వైఎస్ జగన్  శ్రీకాళహస్తి, ఏర్పేడు నియోజకవర్గాల్లో వరదలవల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు.

అనంతరం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామ సమీపంలోని ఎస్టీ కాలనీల్లో వైఎస్ జగన్ పర్యటించారు. పడిపోయిన ఇళ్లకు ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? అని బాధితులను పలకరించారు. కొందరికి మాత్రమే బియ్యం, సరుకులు ఇచ్చారని, 15 రోజులుగా పనులు లే క ఇక్కట్లు పడుతున్నామని కుంభా పార్వతి అనే మహిళ తెలిపారు. ‘ఉన్న ఇల్లు కూలిపోయింది. మళ్లీ కట్టించుకునే శక్తి లేదు. కుటుంబ పెద్ద లేడు. ఇద్దరు పిల్లలున్నారు. నేనెట్టా బతకాల సామీ?’ అంటూ లక్షుమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అండగా ఉంటానని,  జగన్ ఆమె కు ధైర్యం చెప్పారు.

నష్టపోయిన వారికందరికీ నష్టపరిహారం అందేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తానని వివరించారు. ‘గుండెకు రంధ్రం పడింది.. ఆపరేషన్‌కు రూ.3 లక్షలు ముందుగా పెట్టుకోమంటున్నారు. అంత భరించే శక్తి మాకు లేదు’ అంటూ సరోజమ్మ అనే యువతి వాపోయింది. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా? అని జగన్ ఆరా తీశారు. ‘ముందుగా మేం డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారట సార్’ అని సరోజమ్మ తల్లి వాపోయింది. ఆ కుటుంబానికి అండగా నిలవాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ సూచించారు. 

అక్కడి నుంచి జగన్ జ్యోతినగర్ కాలనీకి చేరుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారమంతా కుష్ఠురోగులమని, తమకు వికలాంగ పెన్షన్లు అందడం లేదని తెలిపారు. కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కొందరికి ఇస్తున్నారని వివరించారు. పక్కా గృహాలు అవసరమున్నా మంజూరు చేయలేదని వాపోయారు. అందరి గురించి ప్రభుత్వంతో పోరాడతాను. త్వరలోనే మంచి రోజులు వస్తాయి..’ అని వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. 

అనంతరం శెట్టిగుంట ఎస్టీ కాలనీని పరిశీలించారు. కాలనీ అవతల భూములున్నాయని, శెట్టిగుంట చెరువు అలుగుతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని, వంతెన నిర్మించాలని వారు కోరారు.  శెట్టిగుంట ఎస్సీ కాలనీ నుంచి లక్ష్మిగారిపల్లెకు  జగన్ చేరుకున్నారు. ఇటీవల గోడకూలి మృతి చెందిన హర్షవర్ధన్ (5) అనే చిన్నారి కుటుంబీకులను  పరామర్శించారు. తమను బీసీ జాబితాలో చేర్చాలని గ్రామానికి చెందిన కొయ్య బొమ్మల తయారీదారులు కోరారు. గవర్నర్‌కు లేఖ రాస్తానని, వారి తరఫున కోర్టుకు వెళతామని జగన్ చెప్పారు.
Back to Top