టీడీపీ నేతలు ఇసుక..మట్టినీ వదలడం లేదు




– బాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?
– సెల్‌ఫోన్, కంప్యూటర్‌ బాబే కనిపెట్టారట
– నాలుగేళ్ల పాలనలో ఇసుకపై రూ.34 వేల కోట్ల దోపిడీ
– బాబు పాలనలో ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం బాటిల్‌
– పంటలకే కాదు, రొయ్యలు, చేపలకు కూడా మద్దతు ధర లేదు
– హెరిటేజ్‌లో లాభాల కోసం రైతుల పొట్టగొడుతున్నారు.
– అన్ని స్థానాల్లో గెలిపిస్తే ఈ జిల్లాకు బాబు చేసిందేటి?
– పోలీసులు దగ్గరుండి ఇసుక దోపిడీ చేయిస్తున్నారు
– ఫ్రీ ఇసుక జనాలకు కాదు..టీడీపీ ఎమ్మెల్యేలకు, బినామీ కాంట్రాక్టర్లే
– కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, చిన్నబాబు, పెద్దబాబు వరకు కమీషన్లే
– చంద్రబాబు రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోలేదు
– 10 లక్షల మందికి నాలుగు నెలల పాటు నిరుద్యోగ భృతి ఇస్తారట
– రేపు పొద్దు ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు అంటారు
– అబద్దాలు చెప్పే వారిని బంగాళఖాతంలో కలిపేయండి
– మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి
– వర్షంలోనే కొనసాగిన వైయస్‌ జగన్‌ ప్రసంగం


పశ్చిమ గోదావరి: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ఇసుక, మట్టినీ కూడా వదలడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఫ్రీ ఇసుక జనానికి కాదని, టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు బినామీ కాంట్రాక్టర్లకే అన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బహిరంగ సభ జరుగుతుండగా వర్షం కురవడంతో ‘‘ చిన్నపాటి వర్షానికే బయపడితే ఎలా..నాలుగేళ్లుగా చంద్రబాబు అవినీతిపై పోరాటం చేస్తున్నామని ఉత్సాహపరిచారు. వర్షం లోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షం అధికం కావడంతో జనం తడవడం తనకు బాధగా ఉందంటూ ప్రసంగాన్ని ఆపివేశారు. బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

ఈ రోజు పొద్దునుంచి ఎండలు తీక్షణంగా ఉన్నా కూడా ఏమాత్రం కూడా ఖతరు చేయకుండా నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కష్టాలు చెబుతూ..అర్జీలు ఇస్తున్నారు. మరోవైపు నాభుజాన్ని తడుతూ అన్నా..మేమంతా నీకు తోడుగా ఉన్నామని చెబుతున్నారు. నాతో పాటు ఈ ఎండలో అడుగులు వేయాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. ఈ దుమ్ములో, ధూలిలో, చివరకు వర్షం పడేలా ఉంది. అయినా కూడా ఖాతరు చేయకుండా చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.

– నిడదవోలు..తెలుగు వారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతికగా నిలిచే రాణి రుద్రమదేవి కోడలిగా అడుగుపెట్టిన నేల. ఆయన భర్త వీరభద్రుడు గొప్ప పరిపాలన అందించారని తెలుసు. అలాంటి నేల మీద కనిపిస్తున్నది అన్యాయం, అక్రమం, అవినీతి కనిపిస్తోంది. పక్షపాతం కనిపిస్తోంది. ఇసుక, మట్టి దోపిడీ తప్ప పాలకులకు ఏమీ పట్టడం లేదు. ఇదే జిల్లా చంద్రబాబుకు నిరుడు ఎన్నికల్లో 15కు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన జిల్లా. మా జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని ఇవాళ జిల్లా ప్రజలు నిలదీయమని చెబుతున్నారు. మా నియోజకవర్గానికి ఏం చేశారో అడగండన్నా..అని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
– నాకు ప్రజలు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యమనిపించింది. ఇక్కడ ఇసుక దోపిడీ ఆశ్చర్యకరంగా సాగుతుంది. ఇసుక ర్యాంపుల నుంచి నాలుగేళ్లుగా జరుగుతున్న అవినీతి చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. కళ్లేదుటే లారీల్లో  ఇసుక తరలివెళ్తున్నా..కలెక్టర్లు, పోలీసులు పట్టించుకోవడం లేదు. దగ్గరుండి చేయిస్తున్నారు. 
– డ్వాక్రా సంఘాల పేరు చెప్పారు. సీసీ కెమెరాలు అన్నారు. తీరా చూస్తే డ్వాక్రా సంఘాలు లేవు..సీసీ కెమెరాలు లేవు. ఇసుకను దోచుకునేందుకు వీరు పెట్టిన పేరేంటో తెలుసా..ఇసుక ఫ్రీ..మీకు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక ఫ్రీగా వస్తుందా? ఎవరికి అందడం లేదు. తన ఎమ్మెల్యేలకు, బినామీ కాంట్రాక్లర్లకు  ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. చంద్రబాబు సీఎం కాగానే బినామీ కాంట్రాక్టర్లకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. స్టీల్, ఇతర సామాగ్రి ధరలు తగ్గినా కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చే రేట్లు మాత్రం రెండింతలు పెంచుతున్నారు. 
– ఇసుక మాఫియా గురించి అధికారులకు ఆధారాలతో సహా దొరికిపోయినా కూడా ఇదే జిల్లాలో ఏం జరిగింది. ఇసుక అన్నది ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుంటే..ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు, చిన్నబాబు, పెద్దబాబుకు భాగాలు పంచుకుంటున్నారు. ఇసుక, మట్టిని వదిలిపెట్టడం లేదు. పోరుమామిడి, తాడిమల్లలో ఒక్కో చెరువును 20, 30 అడుగులు తవ్వుకుంటూ అమ్ముకుంటున్నారు. దేన్ని వదిలిపెట్టరు. మట్టి మీద నాలుగేళ్లలో 34 వేల కోట్ల దోపిడీ జరిగిందంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో ఆలోచన చేయండి.
– ఇదే నియోజకవర్గంలో నా వద్దకు చాలా మంది వచ్చారు. చంద్రబాబు మొదలు మా ఎమ్మెల్యే కూడా బ్రిడ్జి కడతామని హామీ ఇచ్చారన్నా..ఈ బ్రిడ్జి మీదా రోజుకో సినిమా చూపిస్తున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పుడు  ఒక్క బ్రిడ్జి కూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలిపోతుందని తెలిసినా ఎవరు పట్టించుకోరు. పుష్కరాల్లో జరిగిన అవినీతి ఏవిధంగా జరిగిందన్నదానికి ఈ బ్రిడ్జి సజీవసాక్ష్యం. నిడదవోలుకు సంబంధించి 30 పడకల ఏరియా ఆసుపత్రి ఉంది. ప్రతి రోజు 300 మంది రోగులు వస్తారు.ఈ ఆసుప్రతిలో 8 మంది డాక్టర్లకు గాను ఇద్దరే ఉన్నారని, 6 మంది నర్సులు ఉన్నారు. ఇక్కడ కనీసం ఎక్స్‌రే మిషన్‌ లేదు. దీనిబట్టి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆలోచించండి
– ఇదే నియోజకవర్గంలో రోయ్యల పరిశ్రమల వ్యర్థల కారణంగా నష్టపోతున్నామని రైతులు మొత్తుకుంటున్నా..పట్టించుకోవడం లేదు. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కరికైనా మేలు జరిగిందా?. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని, మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రజలంతా కూడా నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి 15 వేల ఇల్లు కట్టారని చెప్పుకుంటున్నారు. నాన్నగారి పాలన ఎక్కడా? చంద్రబాబు పాలనెక్కడా?
– అన్నా..మాకు ఆటో నగర్‌ కావాలని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. ఎన్నికల్లో ఆటోనగర్‌ నిర్మిస్తామన్న చంద్రబాబు పట్టించుకోవడం లేదు.
– పక్కనే గోదావరి కనిపిస్తోంది. దాల్వా సమయంలో మాత్రం నీరు రావడం లేదు. డెల్టా మాడరేషన్‌ పనులు జరగడం లేదు. ఎలా బతుకుతున్నామన్న ఆలోచన కూడా పట్టడం లేదు. తాగడానికి నీరు లేదు. ప్రజలు నాకు బాటిల్స్‌ ఇచ్చి అన్నా..ఇది చెరుకు రసం కాదన్నా..చంద్రబాబుకు చూపించండి అన్నా అంటున్నారు. చంద్రబాబు కనీసం ప్రజలకు తాగడానికి నీరివ్వలేని  అధ్వాన్నమైన పరిస్థితి చూశాం.
– రేపు పొద్దున చంద్రబాబు మీ వ ద్దకు వచ్చి ప్రజలకు నీరివ్వడం లేదు..పైపుల్లో చెరుకురసం ఇస్తున్నానని అంత దారుణంగా అబద్ధాలు చెబుతారు.
– కూర అరటి గెల వంద రూపాయలకు అడుగుతున్నారు. అదే హెరిటేజ్‌ షాపుల్లో రెండు కాయలు వంద రూపాయలకు అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సి ఉండగా, తానే దళారీలకు నాయకుడై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు. అన్నా..మా ఖర్మ ఏంటో కానీ చంద్రబాబు పాలనలో భూమి మీద పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదు. నీళ్లలో పండించిన పంటలకు అంతే పరిస్థితి అంటున్నారు. ఏం పంట చూసినా ఇదే పరిస్థితి.
– ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. చంద్రబాబు పాలనలో మీకు మంచి జరిగిందా? ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? 
– నాలుగేళ్ల క్రితం పెద్ద మనిషి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి. మైక్‌ పట్టుకొని పిల్లలు తాగి చెడిపోతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని తగ్గిస్తామన్నారు. బెల్టు షాపులుమూత వేస్తామన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. ఇవాళ ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందో లేదో తెలియదు కానీ. మందు షాపు లేని గ్రామం లేదు. మైక్రోసాఫ్ట్‌ అంటారు, సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని అంటారు. ఈయన గారి హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే నేరుగా మందు బాటిల్‌ ఇంటికి తీసుకువస్తున్నారు.
– నాలుగేళ్లలో రాష్ట్రంలో పెట్రోలు ధరల బాదుడే బాదుడు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటర్‌కు రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. గతంలో రేషన్‌షాపుల్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. అది కూడా వేలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు.
– రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారంఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. అప్పట్లో టీవీ ఆన్‌ చేస్తే చాలు..ఒక అక్క ఉంటుంది..ఒక చెయ్యి వచ్చి మంగళసూత్రాన్ని లాక్కుంటుంది. వెంటనే ఇంకో చేయ్యి వచ్చి పట్టుకుంటుంది. వెంటనే ఆయనొస్తున్నాడు..నాలుగేళ్ల తరువాత అడుగుతున్నా..బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా? కానీ బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయి. ఈయన చేసిన రుణమాఫీ పథకం రైతులకు కనీసంవడ్డీలకు కూడా సరిపోవడం లేదు. అక్కచెల్లెమ్మలను మోసం చేయడం అన్యాయమని ఎవరైనా అనుకుంటారు. పొదుపు సంఘాలు తానే కనిపెట్టానని బాబు చెప్పుకుంటున్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. లేదంటి నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారు. చంద్రబాబు సీఎం అయ్యి నాలుగేళ్లు అయ్యింది. అక్షరాల ప్రతి ఇంటికి రూ.96 వేలు బాకీ పడ్డారు. 
– ఈ పెద్ద మనిషిని పొరపాటున క్షమిస్తే.. రేపొద్దున ఈయన మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్ధాలు, మోసాలు చెబుతారు. ఎన్నికల హామీల్లో ఆయన చెప్పినవన్నీ 90 శాతం పూర్తి చేశానని చెబుతారు. ఆ తరువాత ఏమంటారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి..బోనస్‌గా ఇంటికో బెంజికారు అంటారు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు.  కానీ డబ్బు ఇస్తే మాత్రం వద్దనకండి . రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా? కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారిని , మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపేయండి.
– రేపుపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోండి. వర్షానికి నేను బయపడను. నాతో పాటు మీ అందరు తడవడం బాధనిపిప్తోంది. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top