న్యాయానికి..అన్యాయానికి మధ్య ధర్మయుద్ధం

  • నంద్యాల రోడ్లపై బాబు బ్యాచ్
  • అబద్ధపు వాగ్ధానాలు, మోసపూరిత జీవోలు
  • ఈఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర
  • ఆయుధం పట్టి యుద్ధం చేయక్కర్లేదు
  • ఈవీయం బటన్ తో బాబు స్రామ్రాజ్యాన్ని పెకిలించేద్దాం
  • ఎస్పీజీ గ్రౌండ్ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగం
నంద్యాలః రాష్ట్రంలో దొంగల పాలన కొనసాగుతోందని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో జననేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే....బాబు క్యాబినెట్ అంతా నంద్యాల నడిరోడ్లపైనే తిరుగుతోంది. ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులంతా నంద్యాలలోనే తిష్ట వేశారు.  మోసపూరితంగా జీవోలిస్తూ బాబు నంద్యాల ఎన్నికల్లో అబద్ధపు వాగ్ధానాలు  మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్సీపీ పోటీ పెట్టింది  కాబట్టే బాబు, ఆయన కేబినెట్ అంతా నడిరోడ్డున నంద్యాలలో కనిపిస్తున్నారు. అదే మనం నంద్యాల ఎన్నిక ఏకగ్రీవమని అనుంటే, నంద్యాలకు బాబు ఒక్క రూపాయైనా విదిల్చేవాడా..? ఒక్క పథకాన్నైనా ప్రకటించి ఉండేవాడా..? ఇంతమంది మంత్రులు నడిరోడ్డున కనిపించేవాళ్లా అని నేనడుగుతున్నా.  ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. నంద్యాల ప్రజలకే కాదు చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల నియోజకవర్గానికి చెందిన ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యే పోయి  బై ఎలక్షన్స్ వస్తేనే, వైయస్సార్సీపీ పోటీ పెడితేనే చంద్రబాబు నిద్ర లేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. నంద్యాలలో జరుగుతున్నది ఉపఎన్నిక మాత్రమే కాదు.  ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధం. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం. విశ్వసనీయ రాజకీయాలకు, వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం. 

మూడున్నర సంవత్సరాలుగా బాబు చేసిన మోసపూరిత పాలన మీద..... బాబు నడిపిన కుట్రా రాజకీయాల మీద ....చంద్రబాబు అవినీతి, అసమర్థ పాలన మీద ప్రజలు ఇచ్చే తీర్పుగా నంద్యాల ఎన్నిక జరుగుతోంది.  మూడేళ్లలో దోచుకున్న మూడున్నర లక్షల కోట్లలో కొద్దిగా వెదజల్లి పోలీసుల్ని నమ్ముకొని, అధికారాన్ని నమ్ముకొని..... ఆ అధికారాన్ని దుర్వనియోగం చేస్తూ మనుషుల్ని కొనుగోలు చేస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్న బాబు మీద జరుగుతున్న యుద్ధం ఈ బై ఎలక్షన్స్. 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నంద్యాల నాంది పలుకుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ఈఎన్నికల్లో ప్రజలు ఆయుధం పట్టక్కర్లేదు. యుద్ధం చేయక్కర్లేదు. వారి చూపుడు వేలుతో ఈవీయం అనే బటన్ నొక్కుతూ, ఈవీయం అనే విష్ణు చక్రం తిప్పుతూ బాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఏమతాన్ని చూసుకున్నా భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా అన్నీ చెప్పేటివి ఒకటే ధర్మం, న్యాయం గొప్పవి అని చెబుతాయి. 

మహ్మద్ ప్రవక్త సత్యసందేశాన్ని సహించని కుట్రదారులంతా ఆయన్ను హత్య చేసేందుకు ఒక్కచోట ఏకమవుతారు. అబూ జహల్ అనే కుట్రదారుడు చేసిన ప్రతిపాదన అందరికీ నచ్చుతుంది. అబు జహల్ అంటాడు. అన్ని తెగల నుంచి ఒక్కో గొప్ప పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి యువకుడిని ఎంపికచేసి వారందరికీ కత్తులిచ్చి ప్రవక్త మీద ఒక్కసారిగా దాడి చేస్తే నేరం అందరిమీద పడుతుందని చెబుతాడు. ప్రవక్త తెగ మిగిలిన తెగలతో పోరాటం చేయలేదు కాబట్టి హత్య పరిహారం ఇస్తే సరిపోతుందని ప్రతిపాదిస్తాడు. ప్రవక్త ఇంటిని చుట్టుముడితే దైవదూత ద్వార ముందుగానే తెలుసుకుంటాడు. చిరునవ్వుతో నవ్వుతూ గుప్పెడు ఇసుక తీసుకొని హత్య చేయడానికి వచ్చిన కుట్రదారుల దగ్గర నడుచుకుంటూ నవ్వుతూ వెళతాడు. దొంగ దెబ్బతీసేవాడు, వెన్నుపోటు పొడిచేవాడు ధర్మం ముందర తలవంచక తప్పదు. సత్యం ముందు అసత్యం, ధర్మం ముందు అధర్మం అణగాల్సిందేనని ఖురాన్ చెబుతోంది. అభాండాలువేయడం, మాయోపయాలు పన్నడం, పరువు ప్రతిష్టలను దెబ్బతీయడం లాంటి చౌకబారు రాజకీయాలు తాత్కాలికంగా విజయం సాధించినా సత్యవంతులదే చివరకు విజయమని ఖురాన్, భగవద్గీత, బైబిల్ ఏ మతమైనా తప్పును తప్పే అంటుంది. దొంగను దొంగే అంటుంది. మోసాన్ని మోసమనే చెబుతోంది. సీతమ్మ వారిని దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణాసురుడిని రాక్షసుడు అంటాం. మన ఇంట్లో ఆస్తులను ఎత్తుకుపోయిన వారిని దొంగ అంటాం. ఎవరినైనా ఎత్తుకుపోతే బూచాడు అంటాం. మన పార్టీ నుంచి గెలిచి అమ్ముడుపోయిన వారిని ఏమంటాం. వారిని ఎత్తుకుపోయిన బాబును దొంగ అంటామా..? సీఎం అంటామా ఇప్పుడు జరుగుతున్నది దొంగల పాలనా లేక ప్రజాపాలన అని అడుగుతున్నా. సొంత పార్టీనే చీల్చి పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి, ట్రస్ట్, పార్టీ గుర్తు అన్నీ లాగేసుకున్న వ్యక్తిని ఏమంటారు..? మిగతా పార్టీల్లో చిచ్చుపెట్టే వ్యక్తిని ఏమంటారు. ఎన్నికల్లో వాడుకొని  ఆతర్వాత వెన్నుపోటు పొడిచే ఇలాంటి వ్యక్తిని ఏమంటారు. బాబు గురించి అప్పట్లో నాన్న గారు కథ చెప్పేవాడు. ఆకథ ఏమిటో తెలుసా..? అనగఅనగా ఓ ముద్దాయి ఉండేవాడు. కోర్టుబోన్ లో నిలబెట్టారు. జడ్జి వచ్చి సీట్లో కూర్చోగానే బోన్ లోని ముద్దాయి బోరున ఏడవడం మొదలుపెట్టాడట. సార్ తల్లిదండ్రి లేని అనాథను నన్ను వదిలేయండి. మానవత్వం చూపండి..? అని మరింత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. జడ్జి బాధపడి లాయర్ లవైపు చూసి ఇతను చేసిన తప్పేమిటి అని అడిగాడు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాడు. తల్లిని, తండ్రిని చంపేసి వచ్చి బోన్ లో నిలబడ్డాడు సార్ అని చెప్పాడు. ఇది బాబు నైజం. మామను వెన్నుపోటు పొడిచి చంపుతాడు. ఎన్నికలొచ్చాక మామ ఫోటోను బయటకుతీసి దండలేసి ఎన్నికలకు పోతాడు. మూడున్నర ఏళ్లుగా మైనారిటీలకు వెన్నుపోటు పొడుస్తడు. ఎన్నికలొచ్చేసరికి విపరీతమైన కపట ప్రేమ చూపిస్తడు. ఇది బాబు గారి నైజం. మూడున్నరేళ్లుగా రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తడు. ఎన్నికలొచ్చేసరికి అదే రైతుల మీద లేని ప్రేమను నటిస్తడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మెల రుణాలను మాఫీ చేయకుండా వెన్నుపోటు పొడుస్తడు. ఎన్నికలొచ్చేసరికి మరో స్కీమ్ తో మోసం చేసేందుకు  రెడీగా ఉంటాడు. ఇది బాబు నైజం

మూడున్నరేళ్లుగా కాపులను వెన్నుపోటు పొడుస్తడు. నంద్యాల ఎన్నికలొచ్చేసరికి పవన్ కళ్యాణ్ ను పిలిపించుకుంటడు. మూడున్నరేళ్లుగా పిల్లలు, నిరుద్యోగులను కూడ వదలకుండా అందరినీ వెన్నుపోటు పొడుస్తడు. ఎన్నికలొచ్చేసరికి ఇదిగో భృతి, అదిగో ఉద్యోగమంటాడు.కొత్త డ్రామాతో తెరపైకి వస్తాడు. మూడున్నరేళ్లుగా ఏదీ వదలకుండా ఇసుక నుంచి రాజధాని భూముల దాకా చేయని అవినీతి ఉండదు. ఎన్నికలొచ్చేసరికి నా అంత నిప్పు ఎవడుండడని ఫోజులు కొడతాడు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వోద్యోగులకు డీఏలివ్వడు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎన్నికల ముందు క్రమబద్దీకరిస్తానని చెప్పాడు. అది చేయలేదు. మూడున్నరేళ్లుగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ సమస్యను తీర్చడు. 50 ఏళ్లకే రిటైర్ అయ్యేలా జీవోలు విడుదల చేస్తూ వెన్నుపోటుకు సర్వం సిద్ధం చేసుకుంటడు. ఎన్నికలొచ్చేసరికి అవేమీ లేదని మరో అబద్ధం ఆడుతడు. చివరకు తల్లీతండ్రిని చంపేసి, లేనివాడినని ఏడుస్తూ నంద్యాల ఎన్నికల్లో సానుభూతి కోసం బాబు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు నడిరోడ్డునపెట్టి కాల్చినా తప్పు లేదనిపిస్తోంది. నంద్యాల ప్రజలంతా జడ్జి స్థానంలో ఉన్నారు. బాబు లాంటి అన్యాయస్తుడికి ఏశిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి. కన్నతల్లికి అన్నం పెట్టడానికి మనసురాదు కానీ, చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడన్నడట బాబు లాంటోడు. సొంత కుప్పంకు ఏమేలు చేయని వ్యక్తి ఉపఎన్నిక వచ్చేసరికి నంద్యాలకు అది చేస్తా, ఇది చేస్తానని బాబు చెబుతుంటే ఇదే సామెత గుర్తుకువస్తుంది. జీవితంలో ఒక్క అబద్ధం చెప్పనివాడిని సత్యహరిశ్చంధ్రుడు అంటాం. ఒక్క నిజం చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అంటాం. 

బాబు 2014 ఆగష్టు 15న ముఖ్యమంత్రి హోదాగా వచ్చి జాతీయ జెండా, మహాత్మాగాంధీ, కర్నూలు ప్రజల సాక్షిగాహామీలిచ్చాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా చేశాడా అని నేనడుగుతున్నా. కర్నూలుకు కొత్త ఎయిర్ పోర్టు, స్మార్ట్ సిటీగా కర్నూలు, ఉర్ధూ యూనివర్సిటీ, అవుకు దగ్గర ఇండస్ట్రియల్ సిటీ, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఆదోని-ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ క్లస్టర్లు, పార్కులు...కోయలకుంట్లలో సిమెట్ ఉత్పత్తుల హబ్. కర్నూలులో ట్రిపుల్ ఐటీ,  న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, స్విమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రైల్వే మరమ్మత్తుల కర్మాగారం, మైనింగ్ స్కూల్, పుడ్ పార్క్ ఇది జాబితా. ముఖ్యమంత్రిగా కర్నూలుకొచ్చి ప్రజల వద్ద చెప్పి మూడేళ్లయ్యింది. ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా ముఖ్య కంత్రి అంటామా..? బాబు పాలనలో మాట తప్పి మోసం చేస్తే కేసులుండవు. మాట మీద నిలబడమని నిలదీస్తే కేసులు పెడతరు. బాబును ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది చేయమని కాపులు మూడేళ్లుగా అడుగుతుంటే, కంచాలు మోగిస్తే కేసులు పెడతడు. అదే బాబు లంచాలు మింగుతూ ఆడియో, వీడియో టేపులతో దొరికినా కేసులుండవు.  మూడున్నరేళ్లయ్యింది. బాబు పాలనలో ఒక్క ముస్లింకు కూడ క్యాబినెట్ లో మంత్రి పదవి లేదు. ఉన్నట్టుండి నంద్యాలలో ఉపఎన్నిక లొచ్చేసరికి బాబు ముస్లింలు గుర్తుకువచ్చారు. బాబు ముస్లింల మీద ఎలాంటి ప్రేమ ఉందంటే...2014లో బాబు మైనారిటీలకు ఇచ్చింది ఒకే ఒక్క సీటు. అది కూడ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిని పీలేరులో గెలిపించేందుకు ముస్లిం ఓట్లను విడగొట్టేందుకు సీటు ఇచ్చి ముస్లింలను బలిపశువులను చేశాడు. ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్దుల్ ఘనీకి చెందిన హిందూపురం సీటును లాక్కొని బామ్మర్ది బాలకృష్ణకు ఇస్తడు. ఆ తర్వాత అబ్దుల్ ఘనీకి కాళ్లరిగేలా తిరిగినా అపాయింట్ మెంట్ కూడ ఇవ్వడం లేదు.  లాల్ జాన్ బాష కుటుంబం బాబుకు జీవితకాలం చాకిరీ చేశారు. ఆ  కుటుంబానికి బాబు ఎంత గొప్పగా న్యాయం చూశారో మనమంతా చూశాం. ఇది మైనారిటీలపై ఆయనకున్న ప్రేమ. బాబు క్యాబినెట్ లో ఒక్క ముస్లిం మంత్రి పదవిలో లేరు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ క్యాబి నెట్ లో కూడ ముస్లిం మంత్రి పదవిలో కొనసాగుతున్నాడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బాబు హయాంలో మాత్రమే చూస్తున్నాం. తన కొడుకును ఎమ్మెల్సీ చేసిన మూడోరోజే మంత్రిమండలిలోకి తీసుకుంటడు. ఎమ్మెల్సీగా ఉన్నముస్లింలను మంత్రిని చేయాలన్న ఆలోచన రాదు. బాబుకు ముస్లింలపై ఉన్న ప్రేమ ఏపాటిదో ఫరూక్ ను అడిగితే చెబుతాడు. ఉపఎన్నికల్లో వైయస్సార్సీపీ పోటీ పెట్టేదాక ఫరూక్ కు అపాయిట్ మెంట్ కూడ ఇవ్వలేదు. పోటీ పెట్టే సరికి బాబుకు ఫరూక్ గుర్తుకొచ్చాడు. ఎక్కడ ఆ వైయస్ఆర్ పాలన. ఎక్కడ ఈ దిక్కుమాలిన బాబు పాలన. ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన ముస్లిం సోదరుల కోసం  వైయస్ఆర్ పరితపించాడు. దేశంలో ఎక్కడ కనివినీ ఎరుగని విధంగా ముస్లిం సోదరులకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి లక్షల మందికి ఉద్యోగాలొచ్చేలా చేశారు నాన్నగారు. చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కావొద్దని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయి ప్రతి ఇంట్లో వైయస్ఆర్ ఫోటో పెట్టుకొని ఉన్నారు. బాబుకు ఎన్నికలుంటేనే ముస్లింలు గుర్తుకువస్తరు. అది కూడ బైఎలక్షన్లుంటేనే, అది కూడ వైయస్సార్సీపీ పోటీ పెడితేనే గుర్తుకువస్తారు. బాబును నంద్యాల రోడ్ల మీద కనిపిస్తే అడగండి. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పావ్, ఆతర్వాత ఏం చేశావని. మొట్టమొదటి సంతకాలకే దిక్కులేదు. కర్నూలులో ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన వాగ్ధానాలకే దిక్కులేదు. ఉపఎన్నికలొచ్చేసరికి నీవు నంద్యాలకు వచ్చి ఏవేవో చేస్తానంటే నమ్మేవారెవరైనా ఉన్నారా అని నేనడుగుతున్నా. బాబును నంద్యాలకు వచ్చినప్పుడు అడగండి. ఆయన
గెలుచుకున్న మంత్రుల నియోజకవర్గాల్లోగానీ లేక కుప్పం, బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట గానీ, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మూడేళ్లలో నీవు ఏం అభివృద్ధి చేశావని అడగండి. అడిగితే ఆయనేమంటరో తెలుసా..? అందుకేగా నంద్యాలలో అబద్ధాల బ్యాచ్ ను దించేశాం. ప్రతి వీధి సెంటర్, హోటళ్లలో అబద్ధాలు పుట్టిస్తున్నాం. అందుకేగా ఎస్ మోహన్ రెడ్డి పేరుతో పది నామినేషన్లు వేయించాం. మంత్రుల్ని వీధివీధి తిప్పుతున్నాం. లేనిది ఉన్నట్టుగా సృష్టించి జీవోలిస్తున్నామని బాబు చరిత్ర చెబుతోంది. ఆయన చరిత్ర ఎంత గొప్పదంటే...భూమా నాగిరెడ్డి బామ్మర్ది ఎస్వీ మోహన్ రెడ్డి ఈమధ్యనే అన్నాడు.  నంద్యాల చుట్టుపక్కల ఎమ్మెల్యేలు పైకి ఎప్పుడు పోతారా అని ఎదురుచూస్తున్నారు అని ఎస్వీ అన్నాడు. వాళ్లు పైకి పోయినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు,   వైయస్సార్సీపీ పోటీ పెట్టినప్పుడైనా ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని భూమా బామ్మర్ది అంటున్నారంటే అది బాబు చరిత్ర. నంద్యాలకు ఆయనిచ్చిన మాటలు, వాగ్ధానాలు ఒక్కసారి చూస్తే, ప్రతి పథకంలో ఓ లెక్క ఉంది. ప్రతి పథకంలో లంచాలున్నాయి. ఇదే నంద్యాలకొచ్చి ఇళ్ల పథకమన్నాడు. 13వేలమందికి ఇళ్లు కట్టిస్తున్నామన్నాడు. మూడున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా  కట్టినవి ముష్టివేసినట్టు అక్షరాల 35,497 కట్టాడు . బై ఎలక్షన్స్ వచ్చే సరికి ఇక్కడ 13వేల ఇళ్లు కడతానని చెబుతున్నాడు. పేదలపై ప్రేమతో కాదు నంద్యాలపై ప్రేమతో అంతకన్నా కాదు. తనకొడుకు లోకేష్ స్కెచ్ గీశాడు. దాంట్లోంచి ఓ స్కాం బయటకు తీశారు. దాట్లోంచి ఇళ్ల పథకం పుట్టింది. ప్లాట్లు కట్టేవాళ్లను అడిగితే చదరపు అడుగుకు వేయి, 1200 అవుతుందని చెబుతారు. బాబు  పేదలకు ఎంతకు ఇస్తున్నారో తెలుసా? ఓ బినామీ కాంట్రాక్టర్ ను తీసుకొచ్చి అడుగుకు రూ. 2,078 కట్టబెట్టాడు. ఎక్కడ వేయి, ఎక్కడ రూ.2వేలు.  ప్రతి పేదవాడికి 300 అడుగుల ప్లాట్ ఇస్తాడట. దీంట్లో ఇళ్లు కట్టడానికి 3 లక్షలు అవుతుంది. కానీ, బాబు పేదవాడికి  ఆరు లక్షలకు ఇస్తా ఉన్నాడు. ఆరులక్షల్లో లక్షన్నర కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అట. లక్షన్నర రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ అట. మిగిలిన 3 లక్షలకు బాబు లంచాలు తీసుకుంటడట. పేదవాడి పేరుతో బ్యాంకుల్లో అప్పుగా రాస్తారట. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలనెల మూడు వేలు కడుతూ పోవాలట బాబు  లంచాలు తీసుకున్న దానికి అంటూ ప్రభుత్వ అవినీతిని వైయస్ జగన్ ఎండగట్టారు. 

Back to Top