బాబు నంది అంటే నంది..పంది అంటే పంది


– నకిలీ విత్తనాలకు. నకిలీ పురుగు మందులకు జిల్లాను అడ్డగా మార్చారు
– అధికార పార్టీ నేతలే నకిలీ దందా నడిపిస్తున్నారు
– పేదల జీవితాలతో చంద్రబాబు చెలగాటం
– బ్యాంకు గడప తొక్కలేని స్థితిలో రైతులు ఉన్నారు
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?
– చంద్రబాబుకు మంత్రి పుల్లారావు బినామీ
– పుల్లారావు, లోకేష్‌ నీకింతా, నాకింత అని పంచుకుంటున్నారు.
–విద్యార్థులు, నిరుద్యోగులను కూడా బాబు మోసం చేశారు
– చంద్రబాబు కనిపిస్తే రూ.94 వేల బాకీ గురించి నిలదీయండి
– పొదుపు సంఘాలకు ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?
– చంద్రబాబు రుణ మాఫీ రైతులకు వడ్డీలకు సరిపోవడం లేదు
– పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారు.
– చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయలేకపోయారు?
– సెప్టెంబర్‌ 8, 2016న అరుణ్‌జైట్లీ చెప్పిందే ఇటీవల కూడా చెప్పారు
– ఎల్లో మీడియాపై అంతటా చర్చ జరగాలి
- చిలకలూరిపేట సభలో వైయస్‌ జగన్‌
 
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరును వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు దగ్గరుండి నీరుగార్చారని, నాడు యూపీఏ ప్రభుత్వం ప్లానింగ్‌ కమిషన్‌కు పంపించినా ప్రత్యేక హోదా తీర్మానంపై ఎందుకు మాట్లాడలేదని, గాడిదలు కాశావా అని చంద్రబాబును వైయస్‌ జగన్‌ నిలదీశారు. చంద్రబాబు ఏం చేసినా..ఎన్ని మాటలు మార్చినా ఎల్లో మీడియా ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 117వ రోజు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఎండలు తీక్షణంగా ఉన్నప్పటికీ వేల సంఖ్యలో అడుగులో అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కష్టాలు చెబుతున్నారు..బాధలు చెబుతున్నారు. అర్జీలు ఇస్తున్నారు. మరో వైపు నా భుజాన్ని తడుతూ..అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఏ ఒక్కరికి నాతో పాటు ఈ ఎండలో నడవాల్సిన అవసరం లేదు. ఈ నడిరోడ్డుపై దుమ్ములో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా మండుతున్న ఎండను ఖాతర్‌ చేయడం లేదు. నడిరోడ్డు అన్న సంగతి ఖాతర్‌ చేయడం లేదు. చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు..
– చిలకలూరిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతూనే ఆశ్చర్యం కలిగించే మాటలు ప్రతి ఒక్కరి నుంచి వినిపించాయి. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, హత్యలు, అవినీతికి అంతు లేదు. ఇక్కడికి వస్తున్నప్పుడు వెల్లువలా విన్నపాలు ఇస్తున్నారు. అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. రైతులు వచ్చి..అన్నా నాలుగేళ్ల చంద్రబాబు పాలన దారుణంగా ఉందని చెబుతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని చెబుతున్నారు.
– ఈ నాలుగేళ్ల పాలనలో కనీసం ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? వరి చూస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉత్పత్తి ఖర్చు ఎకరాకు రూ.19000 వేలు ఉంది, క్వింటాల్‌ మద్దతు ధర రూ.1400 కూడా లేదు. పత్తి పరిస్థితి అంతే.. రైతుల వద్ద దళారులు ఏ రకంగా కొనుగోలు చేశారు. ఆ తరువాత దళారుల నుంచి ప్రభుత్వం ఎలా కొనుగోలు చేసిందో అందరం చూశాం. రూ.650 కోట్ల స్కాం జరిగింది. మిర్చి ఉత్పత్తి వ్యయం రూ.8 వేలు ఉంది. మిర్చి రైతు పరిస్థితి దారుణంగా ఉంది. మినుము, పెసలు, కంది పంటలకు గిట్టుబాటు ధర లేదు. రైతుల ముఖంలో కన్నీరే కనిపిస్తోంది.
– ఇదే నియోజకవర్గంలో సాగునీటి పరిస్థితి గురించి రైతులు నాతో చెప్పారు. సాగర్‌ కుడికాల్వ ద్వారా నీరు రావాలంటే తుర్లపాటు, పసుపాడు కెనాల్‌ను పొడిగిస్తే తప్ప నీరు రావని చెబుతున్నారు. ఈ కాల్వలు పొడిగిస్తే 20 వేల ఎకరాలకు నీరు వస్తుంది. ఈ కెనాల్‌ పొడిగించే ఆలోచన ఈ ప్రభుత్వానికి రావడం లేదు.
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గురించి రైతులు గొప్పగా చెబుతున్నారు. అన్నా..ఆ రోజుల్లో పొగాకు పంటలు గొప్పగా వేసుకున్నామని చెబుతున్నారు. అడిగిన వెంటనే నాన్నగారు లిప్ట్‌పెట్టి నీరు ఇచ్చారని గొప్పగా చెబుతున్నారు. అడిగినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– ఇదే నియోజకవర్గం నకిలీ విత్తనాలు, పురుగు మందులకు అడ్డగా మారింది. సాక్ష్యాత్తు ఈ జిల్లాకు సంబంధించిన ప్రముఖ నాయకుల హస్తం ఉంది. వారిని ఏమనాలి. 
– ఇదే నియోజకవర్గంలో నాన్నగారి పాలనలో 1200 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇవాళ ఆ స్థలాలను అధికార పార్టీ లాక్కొని ప్లాంట్లు కట్టిస్తామని నాటకాలు ఆడుతున్నారు. పేదవారికి 300 అడుగుల ప్లాంట్‌ రూ.6 లక్షలకు ఇస్తారట. ఇందులో లిప్టులు కూడా లేవట. అడుగుకు వెయ్యి కూడా మంచిదని ప్లాంట్లు కట్టేవారు చెబుతున్నారు. రూ.3 లక్షలకు ప్లాంట్‌ కట్టవచ్చు. అయితే చంద్రబాబు లంచాలు తీసుకొని పేదవారికి రూ.6లక్షలకు అమ్ముతారట. ఇందులో మూడు లక్షలు ప్రభుత్వం అప్పు ఇస్తుందట..23 ఏళ్ల పాటు ఆ పేదవాడు అప్పులు కట్టాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..అప్పులు కట్టాల్సింది పేదవారా?
–ఎంతటి దారుణమైన పాలన జరుగుతుందని ఇక్కడికి వచ్చిన వారు చెబుతున్నారు. యడవల్లిలో భూములకు పట్టాలిచ్చారని, వాటిని సాగు చేసుకునేందుకు సొసైటీ ఏర్పాటు చేశారట. ఇందుకోసం నాన్నగారి హయాంలో లిప్ట్‌ కూడా సాయం చేశారని చెబుతున్నారు. మా ఖర్మ కొద్ది చంద్రబాబు పాలన రావడం..ఇక్కడి అధికార పార్టీ నేతల కన్ను పడిందట అని చెబుతున్నారు. మంత్రి గారి కన్ను పడటంతో ఆ పట్టాలు రద్దు చేశారట. మంత్రికి ఇంత..చంద్రబాబు కొడుకుకు ఇంత అట. పేదవాళ్లకు ఇచ్చిన భూములను బలవంతంగా ఆక్రమించి, నీరు– చెట్టు పేరుతో మట్టి అమ్ముకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం టీడీపీ నేతలు మట్టిని అమ్ముకుంటున్నారు.
– అగ్రిగోల్డు బాధితులకు డబ్బులు ఇవ్వరట. వారి భూములు తక్కువ రేటుకు కాజేసే ఈ నియోజకవర్గ మంత్రి, చంద్రబాబు బినామీలే. ఇందులో చంద్రబాబు కొడుకుకు భాగమట. అగ్రిగోల్డు బాధితులకు మాత్రం టోపీ పెడుతున్నారు. 
– ఇదే నియోజకవర్గంలో బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని ఆంధ్రప్రభ విలేకరి శంకర్‌ వార్తలు రాస్తే..ఆయన్ను కొట్టి చంపిన దారుణమైన సంఘటనలు చూశాం. 
– చివరకు జాతీయ రహదారి కోసం పనులు ప్రారంభిస్తే..లంచాల కోసం రూట్‌ మార్చి వారి బినామీలకు మేలు చేసేందుకు రూట్‌ మార్చారు. అక్షరాల రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందట. నిసిగ్గుగా లంచాలు తీసుకుంటున్నారు.
– నాలుగేళ్లుగా మీ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, రాక్షస పాలన గురించి చెప్పాను. ఒక్కసారి రాష్ట్రం వైపు చూడండి. నాలుగేళ్లలో చంద్రబాబు పాలన చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని చెబుతున్నారు. మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మనకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. 
– చంద్రబాబు పాలనలో మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? రైతుల ముఖంలో కన్నీరు కనిపిస్తుంది. ఇవాళ బ్యాంకు గడప ఎక్కలేని స్థితిలో రైతు ఉన్నాడు. రుణాలన్నీ మాఫీ కావాలన్నా..బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. రుణమాఫీ అన్న పథకం రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. రైతులు లబోదిబో అంటూ మొత్తుకుంటున్నారు. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ప్రతి ఏటా పంట సాగు తగ్గిపోతోంది.
– నాలుగేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి అన్న మాట మీరంతా విన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల గురించి చంద్రబాబు ఏమన్నారు. పొదుపు రుణాలన్నీ కూడా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? కానీ నోట్లో నుంచి మాత్రం అబద్ధాలు, మోసాలు వస్తున్నాయి. 
– ఎన్నికల సమయంలో చంద్రబాబు చిన్న పిల్లలను కూడా మోసం చేశారు. ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని తన మనుషులను ఇంటింటికి పంపించారు. ఇప్పటికీ బాబు ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు అవుతుంది. ప్రతి ఇంటికి రూ.94 వేలు బాకీ పడ్డారు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే రూ.94 వేలు ఏమయ్యాయని నిలదీయండి
– పిల్లలు తాగి చెడిపోతున్నారని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు తగ్గిస్తా అన్నారు. మందు లేకుండా చేస్తానన్నాడు. చంద్రబాబు పాలనలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తాగడానికి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో కానీ, తాగడానికి మందు కొదువ లేదు. బాబు హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే ఇంటికి మందు బాటీల్‌ తీసుకొస్తున్నారు.
– పెట్రోల్, డీజిల్‌ ధరలు రాష్ట్రంలో మండిపోతున్నాయి. పక్కన ఉన్న రాష్ట్రాల్లో లీటర్‌కు రూ.7 తక్కువకు మన కంటే తక్కువకు పోస్తున్నారు. నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్‌పై చంద్రబాబు బాదుడే బాదుడు. చంద్రబాబు పుణ్యమా అని నాలుగేళ్లుగా విఫరీతంగా ధరలు పెంచారు.
– చంద్రబాబు సీఎం కాకముందు రేషన్‌ షాపుల్లో బియ్యం, కందిబ్యాల్లు, చక్కెర, చింతపండు, కిరోసిన, గోదుమలు ఇలా 9 రకాల సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. అదే కూడా కొందరికి అందడం లేదు. వేలిముద్రలు పడటం లేదని  కోతలు విధిస్తున్నారు. 
– ఎన్నికలప్పుడు చంద్రబాబు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు చార్జీలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వస్తోంది..రూ.500, రూ.1000 వస్తోంది. గతంలో రూ.50, 70, 100 లోపు కరెంటు బిల్లులు వచ్చేవి. గతంలో రెండు నెలలకు ఒకసారి బిల్లులు వసూలు చేసేవారు. ఇ ప్పుడు నెల నెల బిల్లులు కట్టాల్సి వస్తోంది.
– ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను చేయలేనిది ఏంటో తెలుసా? ప్రత్యేక హోదాను చంద్రబాబు సీఎం హోదాలో కేంద్రాన్ని అడిగి ఉంటే వచ్చేది. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని దగ్గరుండి నీరుగార్చారు. నాడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. ఆ రోజుల్లో హోదా సంజీవని అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లాల్సి వస్తోంది. అవస్థలు పడుతున్న పరిస్థితిలో హోదా పై చంద్రబాబు ఎన్నికల సమయంలో అన్న మాటలేంటి..ఆ తరువాత అన్న మాటలు ఏంటీ? 
– రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్‌ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్లానింగ్‌ కమిషన్‌లో ఉన్న ప్రత్యేక హోదా ఫైల్‌ను అమలు చేయమని ఎందుకు చంద్రబాబు అడగలేకపోయారు? ఆ 7 నెలల పాటు చంద్రబాబు ఏం చేశారు. అన్నాళ్లు గాడిదలు కాశారా అని అడుగుతున్నాను. ప్లానింగ్‌ కమిషన్‌ను 2015 జనవరిలో రద్దు చేశారు. ఆ తరువాత కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. 2016 సెప్టెంబర్‌ 8న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్టేట్‌మెంట్‌  ఇచ్చారు. ప్రత్యేకహోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తున్నామని అర్ధరాత్రి చెబితే..మనందరికి రక్తం మరిగిపోయింది. అదే రోజు అర్ధరాత్రి చంద్రబాబు నిద్రమేల్కొని కృతజ్ఞతలు చెప్పారు. ఆ మరుసటి రోజు అసెంబ్లీలో కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. ఢిల్లీ వెళ్లి అరుణ్‌ౖజౌట్లీకి శాలువాలు కప్పారు. మొన్న అరుణ్‌జైట్లీ మళ్లీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మొదటి దానికి, ఇప్పటి స్టేట్‌మెంట్‌కు ఉన్న తేడా ఏంటి చంద్రబాబు?అప్పుడే నీ మంత్రులు రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక హోదా ఇ ప్పటికే వచ్చి ఉండేది కదా?అప్పటి నుంచి గాడిదలు కాస్తున్నావా?
– ఇదే పెద్ద మనిషి కేంద్రం చెప్పకపోయినా కూడా రాష్ట్ర ప్రజలను కన్వీన్స్‌ చేసేందుకు ప్యాకేజీ గొప్పగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏమన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అదేదో ఆడబిడ్డలను కనడం తప్పు అన్నట్లుగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నాడు జైట్లీ స్టేట్‌మెంట్‌ను స్వాగతించి, ఇప్పుడు మాత్రం తన మంత్రులను రాజీనామా చేయించారు. ఎన్నికలు వస్తున్నాయని, ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు తాను చేసిన తప్పును ఇంకొకరిపై నెపాన్ని నెట్టుతున్నారు. ఇంతటి దారుణంగా పరిస్థితి ఉన్నా ఏ పేపర్, ఏ టీవీలో రాయరు, చూపించరు. ఇదే చంద్రబాబు ఆస్కార్‌ కంటే గొప్పగా నటిస్తున్నారని ఏ మీడియా ప్రశ్నించడం లేదు. 
– అనగనగా ఒక అన్యాయమైన రాజు ఉండేవాడట. ఆ రాజు ప్రజలను బాదుడే బాదుడు బాదేవాడట. ఎప్పుడు అబద్దాలు చెప్పేవాడట. ఆయనకు దేవతా వస్త్రాలు కావాలని ఆర్డర్‌ ఇచ్చారట. ప్రజలకు అప్పటికే ఈ రాజుతో విసుగు చెందారట. మన చేనేతలు రాజుగారికి బుద్ధి చెప్పేందుకు బయలుదేరాట. అయ్యా రాజు గారు మాకు మూడు నెలల టైం ఇవ్వండి..దేవతా వస్త్రాలు తెస్తామని టైం అడిగారట. మూడు నెలల తరువాత పెద్ద పెద్ద పెట్టెలు తెచ్చారట. అయ్యా రాజుగారు..మేం తెచ్చిన ఈ దేవతా వస్త్రాలు మూర్ఖులకు ఈ వస్త్రాలు కనిపించవట. మంచి వారికి మాత్రమే ఈ వస్త్రాలు కనిపిస్తాయట అని చెప్పారు. అయ్యా రాజు గారు పక్క  గదిలోకి వెళ్దాం పదండి అని తీసుకెళ్లి బట్టలు విప్పారట. ఆ చేనేతలు రాజు గారికి బట్టలు వేస్తున్నారట. రాజు గారు ఇక్కడ బ్లూ కలర్‌ బాగా ఉంది కదా అంటే రాజు గారు బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారట. రాజు గారు సభలోకి వచ్చే సరికి రాజు గారికి బట్టలు లేవు. కానీ సభలో ఉన్న రాజుగారికి సంబంధించి వంధిమాగదులు ఉన్నారు కదా? వాళ్లందరూ రాజుగారు బ్రహ్మాండంగా ఉన్నాయి మీ వస్త్రాలు అని పొగడ్తలతో ముంచుతున్నారట. రాజు గారు ఆ బట్టలు వేసుకొని ఏనుగు మీద ఊరెగించడానికి బయలుదేరారట. అప్పుడు ఊర్లో నుంచి ఒక చిన్నపిల్లాడు వచ్చి రాజు గారికి బట్టలు లేవని సేమ్‌..సేమ్‌ అన్నారట. ఈ కథంతా మీకు తెలిసిందే. ఆ అన్యాయపు రాజుగారు ఈ జన్మలో మన చంద్రబాబులా పుట్టారు. ఈ రాజుగారికి దేవతా వస్త్రాలు బంగారంలా దగదగాలా మెరుస్తున్నాయని చెప్పారో వాళ్లంతా ఈ జన్మలో మన పేపర్లు, మన టీవీలు, చంద్రబాబు ఎల్లో టీవీలు, పేపర్లు చంద్రబాబు ఏమంటే దానికి తందానా అంటారు. చంద్రబాబు హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అంటే ఆ పేపర్లు అబ్బబ్బ అంటూ కథనాలు రాస్తాయి. హోదా కోసం చంద్రబాబు చిట్ట చివరిగా చెబితే వెంటనే చంద్రబాబును తానా తందానా అని మోసేస్తున్నారు. విక్రమార్కుడు, బ్రçహ్మాండం అంటూ విచ్చలవిడిగా చంద్రబాబును మోస్తున్నారు. 
– చంద్రబాబు హోదా సంజీవని అంటే పొద్దునే ఈ పేపర్లంతా కూడా సంజీవని అంటాయి. మధ్యాహ్నం చంద్రబాబు హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అంటే..వీళ్లంతా నిజమే అంటారు. రాత్రికి బాబు మాట మార్చితే ఎల్లో మీడియా మాట మార్చుతారు. ఈ ఎల్లో మీడియా చంద్రబాబు ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చితే అడగనే అడగరు. చంద్రబాబు పందిని చూపించి నంది అంటే వీళ్లంతా కూడా నంది నంది అంటారు. వీళ్లు ఎవరికి కూడా రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకోవడం తప్పుగా అనిపించదు. ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఎవరికి కనిపించదు. మట్టి, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధాని భూములు, గుడి భూములు దొచేస్తున్నా వీళ్లకు కనిపించదు. వీరిలో ఎవరికి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేది కనిపించదు. చంద్రబాబు ఎన్‌డీఏకు జై అంటే..వీళ్లు జై అంటారు. చంద్రబాబు కాంగ్రెస్‌కు జై అంటే వీళ్లు జై అంటారు. నాలుగేళ్లుగా ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఎల్లో మీడియాను గమనించమని అడుగుతున్నాను. వందసార్లు చెప్పిందే చెప్పి వాళ్లు పడుతున్నది ఆలోచించమని చెబుతున్నాను. ఈ ఎల్లో మీడియా ఎలా పనిచేస్తోంది. వీరి వెనుకాలా ఎవరు ఉన్నారో ఆలోచించండి.
– ఇంత దారుణంగా చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే ఒక్క జగన్‌ వల్ల సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయతీ అన్న పదాలకు అర్థం వస్తుంది. ఎదైనా రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే మార్పు వస్తుంది.
– చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున ఇదే పెద్దమనిషి మీ వద్దకు వచ్చి చిన్న చిన్న అబద్ధాలకు మీరు నమ్మరని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు. నమ్ముతారా అన్నా..అవ్వా..నమ్మరు కాబట్టికి దానికి బోనస్‌గా బెంజికారు ఇస్తానంటారు. అప్పటికీ నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి తన మనిషిని పంపించి రూ.3 వేలు చేతిలో పెడతారు. రూ. 5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బు మనదే..మన జేబులో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓటు  వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను.అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే వారిని బంళాⶠఖాతంలో కలపాలి. నవరత్నాలపై ఎవరైనా మీ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

 
Back to Top