ఎవరూ ఆందోళన చెందొద్దు

 హైదరాబాద్‌ : తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నానని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలన్న తన సంకల్పం మరింత బలపడుతుందని స్పష్టం చేశారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం వైయ‌స్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనపై వైయ‌స్‌ జగన్‌ భుజానికి గాయమైంది. ఆయనకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరగడంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాడి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top