బాబూ..మీకు మానవత్వం ఉందా?

అమరావతి: గుంటూరు మీటింగ్‌కు రమ్మని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిచింది మీరు కాదా చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవ హక్కులు లేవా? చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. నారా హమారా మీటింగ్‌లో ప్రశ్నించిన ముస్లిం యువకులను దారుణంగా చిత్రహింసలు పెట్టడంపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. సీఎం మీటింగ్‌కు వచ్చిన వారు చంద్రబాబు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యయుతంగా అడిగితే, ఫ్లకార్డులు ప్రదర్శిస్తే వారిపట్ల పాశవికంగా వ్యవహరిస్తారా? వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడని అడగడం తప్పా  అని నిలదీశారు. మదర్సా విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు, స్కూల్‌ యూనిఫామ్స్‌ ఎక్కడిచ్చారని ప్రశ్నించడం పాపమా? అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఎప్పుడూ లేని విధంగా ముస్లింలకు  రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని లెవనెత్తుతూ మీరు చేసిన అన్యాయాన్ని గుర్తు చేయడం నేరమా? 30 గంటల పాటు ఎక్కడ ఉంచారో కూడా తెలియనీయకుండా వారిని పోలీసులతో నిర్బంధించి, హింసించి, తరువాత కేసులు బనాయించి, జైల్లో పెట్టడం న్యాయమేనా? ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేవా? మానవత్వం ఉందా మీకు? ముఖ్యమంత్రిగారూ తక్షణమే ఆ యువకులపై పెట్టిన తప్పుడు కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని వారికి క్షమాపణ చెప్పాలని వైయస్‌ జగన్‌ డిమాండు చేశారు.
 
Back to Top