అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటా

 
 
విజ‌య‌న‌గ‌రం:  అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ ప్రాంతానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌ను రైతులు అధిక సంఖ్య‌లో క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ఆదివారం మ‌ధువాడ‌ అన్న‌దాత‌లు జ‌న‌నేత‌ను క‌లిశారు. ఆండ్ర రిజర్వాయర్‌ నుంచి మా గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సాగు భారంగా మారింది. పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. పాతబగ్గాం గ్రామం నుంచి 10 చెరువులకు పారే సాగునీటి కాలువ కూడా లీకులకు గురికావడంతో పొలాలకు నీరు చేరడం లేదు. మా గ్రామం తర్వాత మరో పది గ్రామాలకు కూడా ఆండ్ర కెనాల్‌ కాలువ  నుంచి సాగునీరు అందడం లేదు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేయడానికి వచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించారు.  

కాలువలు కూడా కూలిపోతున్నాయి
మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ వద్ద రూ.4.18 కోట్లతో నిర్మించిన గుర్ల గెడ్డ ప్రాజెక్టు నుంచి ఏళ్లు గడుస్తున్నా సాగునీరు రావడం లేదు సార్‌! మెంటాడ, గజపతినగరం, గంట్యాడ మండలాల్లోని సుమారు మూడు వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో నిర్మించిన కాలువలు కూడా కూలిపోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టు  వినియోగించకుండానే మరమ్మతులకు గురవుతున్నా అటు అధికారులు, అధికార పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేద‌ని పల్లె కన్నమ్మ, సర్పంచ్‌ గుర్ల,  అప్పలనాయుడు ఉప సర్పంచ్, రెడ్డి రాజపు నాయుడు పేర్కొన్నారు. మరో పక్క జలాశయం పరిధిని 200 మీటర్లు పెంచాల్సి ఉంది. దీనిని పునరుద్ధరించడానికి రూ.5కోట్లు అవసరమవుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు చెప్పినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా రైతుల కష్టాలు గట్టెక్కించాల‌ని కోరారు. 

Back to Top