<strong>- వైయస్ జగన్‌కు కర్నూలు జిల్లాలో అపూర్వ స్వాగతం </strong><strong>- ప్రజా సంకల్ప యాత్రలో సమస్యల వెల్లువ</strong><strong>- రాజన్న పాలన గుర్తు చేస్తూ..బాబు మోసాలను ఎండగడుతూ..</strong>కర్నూలు: ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేతకు కర్నూలు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర నిన్న కర్నూలు జిల్లాకు చేరింది. రాజన్న బిడ్డ రాకతో త్యాగాలమర్రి..చాగలమర్రి పులకించింది.. దైన్యం నిండిన గుండెలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో ఆత్మీయ భరోసా దొరికింది. ప్రజా సంకల్ప పాదయాత్ర ఎనిమిదో రోజు కర్నూలు జిల్లాలో అట్టహాసంగా సాగింది. జననేతకు అడుగడుగునా ప్రజలు హారతి పట్టారు. ఎదురెళ్లి మరి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని జిల్లా వాసులు గుర్తు చేసుకొని, మహానేత మళ్లీ మాకోసం ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో వచ్చారని ఉప్పొంగిపోయారు. తనకు స్వాగతం పలికిన వారికి, బాధలు చెప్పుకున్న ప్రజలకు వైయస్ జగన్ ఆత్మీయ భరోసా కల్పిస్తూ..మహానేత పాలనను గుర్తు చేసుకుంటూ.. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెబుతూ.. చంద్రబాబు పాలనను ఎండగడుతూ జననేత పాదయాత్రను కొనసాగించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని.. మ్యానిఫెస్టోలో చెప్పినవి తప్పకుండా అమలు చేస్తామని మాట ఇచ్చారు. 8వ రోజు చాగలమర్రి మండలంలో 16 కిలోమీటర్ల మేర వైయస్ జగన్ నడిచారు. ఉదయం చాగలమర్రి నుంచి ప్రారంభమైన పయనం..ముత్యాలపాడు బస్టాండు సెంటర్ మీదుగా శెట్టివీడు, గొడగనూరు, ముత్యాలపాడు, చక్రవర్తులపురం మీదుగా కృష్ణాపురానికి చేరుకుంది. తొమ్మిదో రోజు ఆర్.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. <br/>