'సమైక్యాంధ్ర వీరుడు' జగన్‌ ఒక్కరే!

గుంటూరు, 19 ఆగస్టు 2013:

సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులో ప్లకార్డు పట్టుకుని వెళ్ళిన మొనగాడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే అని పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అభివర్ణించారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేసిన కరుడుగట్టిన సమైక్యవాది‌ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అన్నారు. సీమాంధ్రుల విద్యా సంస్థలను తగలబెట్టాలన్న కేసీఆర్‌కు ఆ దమ్ములేదని, వరంగల్‌ నీ అబ్బ సొత్తా అని అడిగిన ఏకైక వీరుడు, ధీరుడు, ధీశాలి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి అని అన్నారు. అదే స్ఫూర్తితో శ్రీమతి విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ సోమవారం గుంటూరులో ప్రారంభించిన 'సమరదీక్ష' వేదికపై మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడారు.

ఈ రాష్ట్ర ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవడానికి, రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి ముఖ్య కారకుడు పాపిష్టి చంద్రబాబు నాయుడని రమేష్‌ నిప్పులు చెరిగారు. నిరాహార దీక్షలు చేయడానికి టిడిపి ఎమ్మెల్యేలకు సిగ్గుందా? అని సూటిగా ప్రశ్నించారు. సమైక్యవాదం మీద నిజంగా ప్రేమ ఉందా అని టిడిపి దౌర్భాగ్యులను తాను ప్రశ్నిస్తున్నానన్నారు. తెలుగుతల్లి గుండెను రెండు ముక్కలు చేయడానికి సోనియా, చంద్రబాబే కారణం అని నిందించారు. సోనియా గాంధీ చెవులు దద్దరిల్లేలా, తెలంగాణ ప్రక్రియ ఆగిపోయేలా శ్రీమతి విజయమ్మ దీక్షను విజయవంతం చేయాలని జోగి రమేష్‌ పిలుపునిచ్చారు.

‌మేకతోటి సుచరిత: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయిందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. రాజధాని హైదరాబాద్‌ తెలంగాణదే అని చెప్పిన కేంద్రం సీమాంధ్ర రాజధాని విషయం గాని, నీళ్ళ పంపకాల అంశంపైన గాని ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా ఓట్లు, సీట్ల ప్రాతిపదికగా రాష్ట్రాన్ని ముక్కలు చేయటమిటని ప్రశ్నించారు. ఒక ప్రాంతానికి అన్యాయం జరిగేలా విభజన నిర్ణయం తీసుకోవడమేమిటని సుచరిత నిలదీశారు.

ప్రజల అభీష్టం ప్రకారం వ్యవహరించకపోగా.. రాష్ట్ర విభజన విషయంలో టిడిపి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ ఉద్యమించడానికి ముందుకు వచ్చిన పార్టీ కేవలం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రమే అని సుచరిత పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపిలంతా రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తే తెలంగాణ బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉండదని ఆమె అన్నారు.

తెల్లం బాలరాజు : తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు వారి ఆత్మాభిమానిన్ని రక్షించడానికే శ్రీమతి విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కన్వీనర్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ ఉండి ఉంటే రాష్ట్రంలో ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు వచ్చేవి కావన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని మహానేత కోరుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే.. సీమాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని బాలరాజు హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ నిర్ణయం మార్చుకోవాలని శ్రీమతి విజయమ్మ సాహసోపేతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం రెండు కళ్ళ సిద్ధాంతం కారణంగానే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ పూనుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి విభజనను ఉపసంహరించుకోవాలని బాలరాజు డిమాండ్‌ చేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి : సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే ధ్యేయంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేయడాన్ని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వాగతించారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవాలన్న స్వార్థంతోనే సోనియా గాంధీ మన రాష్ట్ర ప్రజలను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు ప్రజలను విడదీస్తున్న కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబునాయుడి దుష్ట పన్నాగాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు.

మన రాజధాని అని సీమాంధ్రలోని అనేక మంది తమ ఆస్తులను అమ్ముకుని హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. తెలంగాణలో ఉంటున్న లక్షలాది మంది సీమాంధ్రులకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ విభజనపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకున్నదన్ని పిన్నెల్లి విమర్శించారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను అక్కడి వారు బెదరిస్తుండడంతో రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.

టిడిపి నాయకుల దొంగ నాటకాలు, దొంగ ఉద్యమాలను ప్రజలు నమ్మడంలేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబు నాయుడి చేత ప్రకటన చేయించాలని టిడిపి నాయకులకు పిన్నెల్లి డిమాండ్‌ చేశారు.

Back to Top