వైయస్ జగన్ హీరో..బాబు విలన్

ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతాం..కాలర్ పట్టుకొని నిలదీస్తాం
గడపగడపకు వెళతాం..మోసాలను ఎండగడుతాం
మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి
ప్రజల గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం
ఐదు సంతకాల సంగతేమైంది బాబుః జోగిరమేష్ 

విజయవాడః ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి, మంత్రులను కాలర్ పట్టుకొని నిలదీసే హక్కు...ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షానికి ఉందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ప్రమాణస్వీకారం రోజున బాబు చేసిన ఐదు సంతకాలకే దిక్కులేకుండా పోయిందని జోగిరమేష్ మండిపడ్డారు. ప్రజల భావాల్ని, బాధల్ని వారి తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ వ్యక్తపరుస్తున్నారని రమేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు ప్రతిపక్షానికి ఇచ్చారని ఆవిషయం మరవద్దని టీడీపీ సర్కార్ ను హెచ్చరించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో జోగిరమేష్ మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ పార్టీ తరపున ధన్యవాదములు తెలిపారు. 

విజయవాడలో ఒక్కసారి వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైతేనే ప్రభుత్వానికి ఉలుకు పుడుతుందని రమేష్ ఎద్దేవా చేశారు. ఇకనుంచి పార్టీ యావత్తు విజయవాడ నుంచే  కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతుందని జోగిరమేష్ తేల్చిచెప్పారు. ప్రజల కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని, స్పందించకపోతే చొక్కా పట్టుకొని నిలదీస్తామని రమేష్ అన్నారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రతిపక్ష నేతపై నోరుపారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజాబలంతో తాము బయటకొస్తే ఏ ఒక్క మంత్రి బయట తిరిగే పరిస్థితి ఉండదన్నారు. 
 
రైతులకు బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారా లేదో బాబు గుండెల మీద చేయివేసుకొని చెప్పాలన్నారు. లక్షన్నర రుణాలు మాఫీ అన్నారు. ఏం చేశారు. 4,500 కోట్లు రైతులపై  వడ్డీభారం పడింది. రుణమాఫీ చేయకుండానే చేశామని చెప్పుకుంటున్నారు.  సిగ్గుగా లేదా బాబు. మాట నిలబెట్టుకొమ్మని ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతుంటే కళ్లు కనబడడం లేదా...? బాబు అబద్ధపు హామీలిచ్చి అవి నెరవేర్చలేక ప్రజల్లో విలన్ గా మారిపోయారని, అబద్ధాలు చెప్పలేదు కాబట్టే వైయస్ జగన్ ప్రజల గుండెల్లో  హీరో అయ్యారని రమేష్ పేర్కొన్నారు. ఎవరు హీరో, ఎవరు విలనో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని బాబుకు సూచించారు. 

రుణమాఫీ చేయలేనని వైయస్ జగన్  నిజం చెప్పారు కాబట్టే రైతులంతా హీరో అని ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడంతో డ్వాక్రామహిళలు బాబుకు ఓటేసినందుకు బాధపడుతున్నారన్నారు. వైయస్ జగన్ గెలిస్తేనే ప్రత్యేకహోదాను పోరాడి సాధిస్తారని, ఆసత్తా ఒక్క జననేతకే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని రమేష్ చెప్పారు. వైయస్ జగన్ జైలుకు వెళతాడంటూ మంత్రి దేవినేని చేసిన వ్యాఖ్యలపై జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ప్రజలను మోసం చేసిన బాబును,మంత్రులను  2019 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలే జైలుకు పంపిస్తారని తెలియజేశారు.

ప్రభుత్వంపై పోరాడే శక్తి , ప్రజల కోసం ప్రశ్నించే హక్కు ఒక్క వైయస్ జగన్ కు మాత్రమే ఉందన్నారు. పక్కరాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడే నాథుడే లేకుండా పోయాడు. ప్రశ్నించే నాథుడే కరువయ్యాడన్నారు. ప్రతిపక్ష నేతగా వీరుడిగా, ధీరుడిగా వైయస్ జగన్  దీక్ష చేశారు కాబట్టే అక్రమ ప్రాజెక్ట్ లపై ఇవాళ చర్చ జరుగుతుందని రమేష్ తెలిపారు. వైయస్ జగన్ దీక్ష చేసేవరకు కూడా  ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పాత్ర పోషించామని రమేష్ పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజైన జూలే 8నుంచి ప్రతి గడపకు వెళతామన్నారు.  మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటీ అమలు చేయకుండా, అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోయారని రమేష్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా ప్రజలతో మార్కులు వేయిస్తామన్నారు. అధికారం కోసం బాబు ఎన్ని అబద్ధాలు చెప్పారో ప్రజలు, పాత్రికేయుల ముందు పెడతామని స్పష్టం చేశారు. ముద్రగడ ఆమరణ దీక్ష విషయంలో సున్నితమైన సమస్యను జఠిలం చేసి బాబు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని రమేష్ ఆగ్రహంచారు. 

కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడనే ముద్రగడపై వ్యక్తిగత ద్వేషంతో .... బాబు ఆయన దీక్షను అణగదొక్కేందుకు మంత్రులతో తిట్టించి వైయస్ జగన్ హస్తం ఉందని చెప్పి నిర్వీర్యం చేయడానికి పన్నాగం పన్నాడన్నారు. బెడిసికొట్టి అది చివరకు బాబు మెడకే చుట్టుకుందన్నారు. మేనిఫెస్టోలో పెట్టినవాటిని అమలు చేయాలని ముద్రగడ అడుగుతుంటే ఆయన దీక్షపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమన్నారు. బాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ ఆస్పత్రిలో , ఆయన భార్య ఇంటి దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉన్నారు. ఎవరికేమైందోఅర్థం కాని పరిస్థితి. చివరకు వారి కుటుంబాన్ని సైతం బాబు ఛిన్నాభిన్నం చేశారని ఫైర్ అయ్యారు. ఇంత ఎమర్జెన్సీ అవసరమా బాబు. ఆయనకు ఏం జరుగుతుందో తెలియనీయకుండా మీడియాపై ఆంక్షలు  పెట్టారు. సాక్షి ప్రసారాలు నిలిపేశారు. మనం పాకిస్తాన్ లో ఉన్నామా...?రాష్ట్రంలో పాలన ఏవిధంగాసాగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని జోగిరమేష్ సూచించారు. Back to Top