శిశుమరణాలపై ఆందోళన..బాధిత కుటుంబాలకు పరామర్శ

రంపచోడవరం: రాజవొమ్మంగి మండలంలో పోలవరం నిర్వాసితుల బాధిత కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించారు. కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో శిశు మరణాలు సంభవించడంపై  వైయస్‌ జగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో వైయస్‌ జగన్‌ బుధవారం నుంచి రెండురోజుల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, పౌష్టికాహారం అందకపోవడం వల్ల ఒక్క రాజవొమ్మంగిలోనే వారం నుంచి రెండు నెలల వయస్సులోపు 15 మంది చిన్నారులు చనిపోయారని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 రాజవొమ్మంగి మండలంలోపరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఇక్కడ నిరుపేదలు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే కేవలం రూ. 780 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబట్టారు. తాను ఇటీవల చంద్రబాబుకు లేఖ రాశాక ఆరోగ్యశ్రీకి రూ. 262 కోట్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ అమలు తీరుకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు, తాను ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వైయస్‌ జగన్‌ తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి శిశు మరణాలను ఆపుతామని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
 
Back to Top