మేరికోమ్‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు అమ‌రావ‌తి:  ఆరు స్వర్ణాలతో ప్రపంచ రికార్టు సృష్టించిన మేరికోమ్‌కు ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్ శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మట్టి కరిపించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. దీంతో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది. తాజా స్వర్ణంతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్‌ దిగ్గజం ఫెలిక్స్‌ సవాన్‌ సరసన చేరింది. మేరీ 2002, 2005, 2006, 2008, 2010 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలతో పాటు.. అరంగేట్ర 2001 చాంపియన్‌ షిప్‌లో రజతం సాధించింది.  


Back to Top