వ్యవసాయం దండగగా భావించే పాలకులకు రైతన్నల కష్టాలెలా కనిపిస్తాయి?!

 

ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,238.2 కి.మీ 
14–11–2018, బుధవారం, చిన్నారాయుడుపేట, విజయనగరం జిల్లా 

ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే చేతుల్లో పూలు పట్టుకుని చిన్నారి చిట్టెమ్మలు స్వాగతం పలికారు. బాలల దినోత్సవం రోజు ఎదురైన ఆ బంగారు తల్లులను చూడగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ రోజు పాదయాత్ర అంతా సీతానగరం మండలంలోనే సాగింది. గెడ్డలుప్పి గ్రామానికి చెందిన అక్కచెల్లెమ్మలు.. ఆ ఊరిలో జన్మభూమి కమిటీల దాష్టీకాల గురించి చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇళ్లుగానీ, పింఛన్లుగానీ అడపాదడపా అరకొరగానే ఇచ్చారట. ఇస్తున్న ఆ మూడునాలుగింటిలోనూ ఇంటికి రూ.25 వేలు, పింఛన్‌కు రూ.5 వేలు లంచాలుగా తీసుకుంటున్నారని ఆ అక్కచెల్లెమ్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోకిశీల గ్రామానికి చెందిన శాంతకుమార్‌ అనే దళిత సోదరుడూ జన్మభూమి కమిటీ బాధితుడే.

ఆ ఊరి పీహెచ్‌సీలో అవుట్‌ సోర్సింగ్‌ కింద అటెండర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడట. లంచమిస్తేనే ఉద్యోగమని.. జన్మభూమి కమిటీ సభ్యుడు చెబితే అధిక వడ్డీకి అప్పు తెచ్చిమరీ ఒకటిన్నర లక్ష అప్పజెప్పాడు. కానీ ఎక్కువ లంచం ఇచ్చారని ఆ ఉద్యోగాన్ని మరొకరికి కట్టబెట్టేశారట. డబ్బు పోయే.. ఉద్యోగమూ రాకపోయే.. అంటూ ఆ సోదరుడు కన్నీటిపర్యంతమయ్యాడు. దోచుకోడానికే జన్మభూమి కమిటీలు.. అంటున్న జనం మాటలు ముమ్మాటికీ వాస్తవమనిపించింది. 

చిన్నభోగిలి దాటాక సువర్ణముఖి నదిమీద ఉన్న వంతెనపై పాదయాత్ర సాగింది. దాదాపు 90 ఏళ్ల నాటి ఆ పురాతన బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది. సువర్ణముఖి నది.. ఇసుక మాఫియా దురాగతాలకు నిదర్శనంగా కనిపించింది. పూర్తిగా గోతులమయమైపోయింది. ఇసుక కోసం మీటర్ల కొద్దీలోతుకు తవ్వేశారు. బ్రిడ్జి పిల్లర్ల దగ్గర కూడా ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో.. వంతెన మనుగడకే ప్రమాదం ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకాసురుల ధనదాహానికి నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికలు సైతం మాయమైపోయాయట. చిన్నభోగిలి, సీతానగరాలకు శ్మశానమే లేదని చెబుతుంటే విస్మయం కలిగింది. సంబంధితశాఖా మంత్రి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇసుక దోపిడీకి అడ్డూఅదుపూ లేకపోవడం దారుణమనిపించింది. 

అప్పయ్యపేట వద్ద మహిళా రైతులు కలిశారు. ఎండిన వరి పంటను చూపించి గోడు వెళ్లబోసుకున్నారు. ‘బాబొచ్చాడు.. కరువు తెచ్చాడు. వర్షాల్లేవు.. ఆయనగారు చెప్పినట్లు జంఝావతి నీరూ అందివ్వలేదు. పంట పూర్తిగా ఎండిపోయింది’అంటూ ఆ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగగా భావించే పాలకులకు రైతన్నల కష్టాలెలా కనిపిస్తాయి?! 

మధ్యాహ్న శిబిరం వద్ద మెట్టవలసకు చెందిన సింహాచలం అనే సోదరుడు కలిశాడు. నాన్నగారి పాదయాత్ర ప్రారంభం నుంచి తుదిశ్వాస విడిచే వరకు పత్రికలలో వచ్చిన ఫొటోలతో చేసిన ఆల్బమ్‌ను తెచ్చి చూపించాడు. ఆ అభిమానానికి చాలా సంతోషమేసింది. 

సాయంత్రం పెదపెంకి గ్రామం నుంచి చాలామంది బోదకాలు వ్యాధిగ్రస్తులు వచ్చి కలిశారు. ఆ ఒక్క ఊరిలోనే దాదాపు 300పైగా బోదకాలు బాధితులున్నారట. ఆ ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ శూన్యం. పారిశుద్ధ్యం పడకేసింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే వారి జీవితాలకు శాపమైంది. దోమలు విజృంభించి బోదకాలుబారిన పడేస్తున్నాయంటూ ఆ గ్రామస్తులు ఆవేదన చెందారు. ఓ వైపు వారు రోగాలబారిన పడి తల్లడిల్లుతుంటే.. వైద్య సదుపాయాల మాట దేవుడెరుగు, బెల్టుషాపులకు మాత్రం కొదవే లేదట. ఆ ఒక్క ఊరిలోనే 22 బెల్టుషాపులున్నాయని అక్కచెల్లెమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దోమల ద్వారా సంక్రమించే డెంగీ, మలేరియా, బోదకాలు తదితర విషజ్వరాలు రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఏమైంది మీ దోమలపై దండయాత్ర? 


Back to Top