జూట్‌ మిల్లులు, సహకార చక్కెర కర్మాగారాలు మీ పాలనలోనే మూతబడటం వాస్తవం కాదా బాబూ?

 

01–10–2018, సోమవారం 
కొత్తపేట, విజయనగరం జిల్లా 

ఈ రోజు ఉదయం వై.జంక్షన్‌ వద్ద సున్నంబట్టీ వీధి ప్రజలు కలిశారు. వారంతా బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు. ఎక్కువమంది జూట్‌మిల్లు కార్మికులే. ఓ వైపు.. మిల్లులు మూతబడి ఉపాధి కోల్పోయారు. మరోవైపు.. హుద్‌హుద్‌ తుపాను దెబ్బకు ఇళ్లూ పోయాయి. మూడేళ్లు దాటినా తుపాను బాధితులకు ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్‌నగర్‌ వద్ద అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ కాలనీలో తాగునీటి కొళాయిలే లేవట. నిరంతరం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే రహదారి దాటి నీరు తెచ్చుకోవడం ప్రమాదకరంగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు, అధికార పార్టీ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఫలితం లేదన్నారు. వారెవ్వరికీ మరుగుదొడ్లు కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఆత్మగౌరవాన్ని చంపుకుని.. అవసరం తీర్చుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో మరుగును వెతుక్కోవాల్సి వస్తోందని చెబుతుంటే.. మనసంతా కలచివేసినట్లయింది.  

దారిపొడవునా జూట్‌ మిల్లు కార్మికులు కలుస్తూనే ఉన్నారు. ఉపాధి లేక.. కూలి పనులు దొరక్క.. వారు పడుతున్న వేదన వర్ణనాతీతం. జూట్‌ మిల్లులకు చేయూతనిస్తానని.. కార్మికుల జీతభత్యాలు పెరిగేట్లు ఒప్పందం చేయిస్తానని.. ఎన్నికలకు ముందు బాబుగారు హామీ ఇచ్చారు. జీతం పెరగడం మాట దేవుడెరుగు.. మిల్లులు మూతబడి ఉన్న ఉద్యోగాలు పోయాయని బావురుమన్నారు. అశోక్‌గజపతిరాజుగారి దత్తత గ్రామం ద్వారపూడిలో జరిగిన బహిరంగ సభలో.. జూట్‌ మిల్లులన్నీ తెరిపిస్తానని ముఖ్యమంత్రిగారు ప్రకటించారు. ఆయన హామీకే దిక్కు లేకుండా పోయింది. కేంద్రమంత్రిగా చేసిన వ్యక్తి.. ఆ మిల్లుల గురించి పెద్దగా తెలియదంటాడు. ఉత్తరాంధ్రకే చెందిన అప్పటి కార్మిక మంత్రికి కనికరమే ఉండదు. ప్రజాసేవ సాకుతో పార్టీ మారిన మరో మంత్రి ఉలకడు పలకడు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువై.. కరెంటు చార్జీలు భారమై.. మిల్లులు మూతబడ్డాయి. జూట్‌ మిల్లు కార్మికుల ఈతి బాధలకు పాలక నేతలే ప్రధాన కారణం.  

 పట్టణాల్లోని పేదల కోసం ఏర్పాటుచేసిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా పేరు మార్చారు. వాటికి ఇస్తున్న బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచి.. కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టారు. సిబ్బంది వేతనాల్లో మార్పు లేదు.. ఆస్పత్రుల్లో అందుతున్న సేవలూ పెరగలేదు.. మరి పెంచిన బడ్జెట్‌ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతున్నట్టు!.. నన్ను కలిసిన వైద్య సిబ్బంది ఆవేదన ఇది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, జూట్‌ మిల్లులు మొదలుకుని.. సహకార చక్కెర కర్మాగారాల వరకూ మీ పాలనలోనే మూతబడటం వాస్తవం కాదా? ఉన్నవాటిని ఆదుకోవడం మాని.. కొత్తవాటి కోసం అంటూ విదేశీ పర్యటనలు చేయడం.. ఎవర్ని మోసం చేయడానికి? 
-వైఎస్‌ జగన్‌  


తాజా వీడియోలు

Back to Top