నారా వారి నోటి మాటకు ఉన్న విలువ అంతేనేమో!

 

26–09–2018, బుధవారం
కొట్యాడ, విజయనగరం జిల్లా

ఈ రోజంతా లక్కవరపుకోట మండలంలో పాదయాత్ర సాగింది. ఉదయం అరకు దారిలో నడిచాను. దారంతా ఇరుకుగా.. గతుకులమయంగా ఉంది. ఆ రోడ్డును నాలుగులేన్ల రహదారిగా మారుస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాంతోపాటే అరకును దత్తత తీసుకుని టూరిజం హబ్‌గా మారుస్తానని వాగ్దానం చేశారు. అలా చెప్పి రెండేళ్లు గడిచిపోయినా.. ఆ మాటలకు అతీ గతీ లేదు. మెడికల్‌ హబ్, టూరిజమ్‌ హబ్, ఎడ్యుకేషన్‌ హబ్‌.. ఇలా ఎక్కడికెళితే అక్కడ ఏదో ఒకటి చెప్పేస్తూ ‘ఆ విధంగా ముందుకు’పోతూనే ఉన్నారు బాబుగారు. ఆ మాటలన్నీ గాలి మాటలుగానే తేలిపోయాయి.  

దారిలో జమ్మాదేవిపేట గ్రామస్తులు కలిశారు. ఆ గ్రామాన్ని ఎనిమిది నెలల వ్యవధిలో చంద్రబాబు, లోకేశ్‌లు సందర్శించారట. ఇంటింటికీ కొళాయి ఇస్తామని తండ్రీకొడుకులిద్దరు హామీ ఇచ్చారు. తండ్రిగారైతే అక్కడికక్కడే కోటి రూపాయలకు పైగా అభివృద్ధి పనులను ప్రకటించేశారు. కానీ ఇప్పటివరకు కొళాయి వచ్చిందీ లేదు. అభివృద్ధి జాడే లేదు. ఆ మాటలన్నీ నీటి మూటలే అయ్యాయి.  

‘హుద్‌హుద్‌ తుపాను మా బతుకుల్లో కల్లోలం సృష్టించింది. నమ్ముకున్న తాటిచెట్లు కూలిపోయి బతుకుదెరువు కోల్పోయాం. అప్పుడు బాబుగారు ఒక్కొక్కరికి రూ.10,000 పరిహారం, రూ.2,00,000 లోను ఇస్తానన్నారు.. ద్విచక్రవాహనాలన్నారు. అన్నీ చెప్పడమే తప్ప చేసింది లేదు.. ఇచ్చింది లేదు’అంటూ నన్ను కలిసిన గీత కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సోదరులంతా ఆందోళన బాట పట్టారిప్పుడు. ఇచ్చిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చరు బాబుగారు. నారా వారి నోటి మాటకు ఉన్న విలువ అంతేనేమో!  

అదే జమ్మాదేవిపేటలో జూన్‌ నాలుగున గ్రామదర్శిని సభ జరిగింది. ముఖ్యమంత్రిగారే దానికి ముఖ్య అతిథి. టీడీపీకే చెందిన దళితుడైన సర్పంచ్‌ను జెండాలు కట్టడానికే పరిమితం చేశారు. స్టేజీ మీదకు కూడా ఎక్కనివ్వలేదట. ఇది దురహంకారం కాదా? సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్‌.. దళితుడైనంత మాత్రాన ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టరా? అయినా.. ‘దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’అని సెలవిచ్చిన బాబుగారి నుంచి అంతకన్నా ఏం ఆశించగలం? గ్రామదర్శిని కార్యక్రమంలో ఆ ఊరంతా తిరిగిన బాబుగారు.. దళితవాడలో మాత్రం అడుగు కూడా పెట్టలేదట. బాబుగారి ‘దళిత తేజం’అంటే ఇదేనేమో! 

గుండెనిండా అభిమానాన్ని నింపుకొని వచ్చింది పార్వతక్క. లక్కవరపుకోట దగ్గర కలిసిన ఆమె ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ ఇచ్చింది. ‘మీరు ఆరోగ్యంగా ఉండాలి. పాదయాత్ర బాగా జరగాలి. మీ నాన్నగారిలాగే అందరికీ ఉపా«ధి కల్పించాలి’అని చెప్పింది. గతంలో ఆమె కుటుంబం చాలా దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడేదట. 12 మంది ఉన్న ఆ కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఉపాధి ఆసరా లేక.. రోజు గడవటమే కష్టంగా ఉండేదట. పైగా ఆ ఇంట్లో ఇద్దరు దీర్ఘకాలిక రోగులున్నారు. వాళ్లకు మందూమాకులూ కొనడానికి కూడా లేని దీనస్థితి. అలాంటి సమయంలో కేవలం ఒకే ఒక అప్లికేషన్‌తో ఆమెకు ఏఎన్‌ఎం పోస్టు వచ్చిందట. ఏ సిఫార్సులు లేకుండా, లంచాలు లేకుండా వచ్చిన ఆ ఉద్యోగమే.. ఆ ఇంటిని అప్పట్నుంచీ నడిపిస్తోంది. అందుకే ఆమెకు నాన్నగారంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానాన్నే నా మీదా చూపింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు డప్పు కొట్టారు.. చెప్పు కుట్టారు. నేనే పెద్ద మాదిగనంటూ.. ఫోజులిచ్చారు. అధికారంలోకి వచ్చాక.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. గ్రామ దర్శిని సభలో దళిత సర్పంచ్‌ను కనీసం స్టేజ్‌పైకి పిలవను కూడా లేదు. ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’అంటే ఇదే కాదా? 
-వైఎస్‌ జగన్‌ 


Back to Top