ఆరోగ్యశ్రీకి పునర్‌వైభవం తేవాలన్న నా సంకల్పం మరింత బలపడింది



 
26–07–2018, గురువారం
కట్టమూరు క్రాస్, తూర్పుగోదావరి జిల్లా


ఒక నాయకుడు ఇచ్చిన మోసపూరిత హామీ.. ప్రజల జీవితాలపై ఎంతటి తీవ్రమైన దుష్ఫ్రభావం చూపుతుందనడానికి నిదర్శనం.. ఈ రోజు కలిసిన రైతన్నలు వినిపించిన ఉదంతం. బాబుగారి రుణమాఫీ హామీ అటు రైతన్నలనే కాదు.. ఇటు కౌలు రైతులనూ కోలుకోలేని దెబ్బతీసింది. పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన వీర విష్ణుచక్రం, గన్ని రాజు, ఏసుబాబు తదితర కౌలు రైతులు కలిశారు. వారికి బ్యాంకు రుణాలు రావు. అధిక వడ్డీకి ప్రయివేటు అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తే.. గిట్టుబాటు ధరల్లేవు. దళారుల చేతుల్లో దగాపడుతున్న దుర్గతి. ఆరుగాలం కష్టపడ్డా.. ఉత్పత్తి వ్యయం కూడా రాక, తెచ్చిన అప్పులు తీర్చలేక, కౌలు కూడా కట్టలేక.. వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యవసాయాన్నే వదిలేయక తప్పని పరిస్థితి తలెత్తిందన్నది వారి వేదన.

భూమి సొంతదారులైన నర్సారావు, వీర్రాజు, వెంకటేశ్వరరావు తదితర రైతన్నలదీ దయనీయ స్థితే. వీరంతా గత ఎన్నికలకు ముందు ‘పంట రుణాలు కట్టొద్దు.. మాఫీ చేస్తా’ అన్న చంద్రబాబును నమ్మి మోసపోయిన వారే. రుణమాఫీ కాకపోగా వడ్డీలు పెరిగిపోయి అప్పులు కట్టలేని దుస్థితి. బ్యాంకు మెట్లెక్కలేని స్థితి. వ్యవసాయం చేసుకోలేక, కౌలుకు ఇవ్వాలనుకుంటే.. కౌలుదారులు ముందుకు రాని పరిస్థితి. కౌలు ధరలు పూర్తిగా తగ్గించేసినా ఫలితం లేదట. ఇవే పరిస్థితులు కొనసాగితే.. సాగు విస్తీర్ణం ఇంకా తగ్గిపోయి భవిష్యత్తులో బీడు భూములుగా మారే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. అత్యధిక కౌలు రైతులున్న జిల్లా ఇది. మన రాష్ట్ర రైతాంగంలో అధిక శాతం కౌలు రైతులే. వారిలో ఎక్కువ మంది వెనుకబడ్డ వర్గాల వారే. ఈ సమస్యపై చిత్తశుద్ధితో సునిశిత దృష్టిపెట్టి రైతన్నలకు అండగా నిలిచి, సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

నిరుపేదలకు పెద్ద జబ్బు చేస్తే ఆ జీవితాలు ఎంతలా అతలాకుతలమవుతాయో.. నన్ను కలిసిన రెండు కుటుంబాలను చూస్తే అవగతమవుతోంది. పదో తరగతి పూర్తయిన నీరజ్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌. పరీక్షలకు వారం ముందు బయటపడిందా భయంకర నిజం. అంతటి విషాదాన్ని సైతం దిగమింగుకుని పరీక్షలు రాసి.. 9.5 గ్రేడ్‌ సాధించాడు నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బీసీ సోదరుడు. తండ్రి మూటలు మోసే కూలీ. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కిందామీదా పడి, అయినకాడికి అప్పులుచేసి వైద్యానికి లక్షలు ఖర్చుచేశాడు.

కీమోథెరపీలు పూర్తికాకుండానే ఆరోగ్యశ్రీ పరిమితి అయిపోయిందంటున్నాయి ఆస్పత్రి వర్గాలు. బిడ్డకు వైద్యం కోసం నానాయాతన పడుతున్నాడా తండ్రి. కూలి పనికెళ్లే మరో సోదరుడు ప్రకాశ్‌దీ అదే కష్టం. భార్య లక్ష్మికి బ్లడ్‌ క్యాన్సర్‌. చికిత్స కొనసాగుతుండగానే ఆరోగ్యశ్రీ అయిపోవచ్చిందంటున్నారు. తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఆ సోదరునిది. ఇప్పటికే వేలకు వేలు పెట్టి రక్తాన్ని, రక్త కణాల్ని కొని భార్యకు ఎక్కించడానికి అష్టకష్టలు పడుతున్నాడు. ఇటువంటి నిరుపేద కుటుంబాల కన్నీరు చూస్తుంటే.. ఆరోగ్యశ్రీకి పునర్‌వైభవం తేవాలన్న నా సంకల్పం మరింత బలపడింది.


ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉండగా ఈ 13 జిల్లాల్లో ఖరీఫ్, రబీ రెండు పంటలూ కలిపి 71.12 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. మీరు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలో 63.05 లక్షల హెక్టార్లు, గతేడాది 59.03 లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం పడిపోయిన మాట వాస్తవం కాదా? ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం, ఉత్పత్తులు తగ్గుతూ.. ఉత్పత్తి వ్యయం కూడా రాకుండా కుప్పకూలిన ధరలకు రైతులు పంటల్ని అమ్ముకుని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతూ ఉంటే.. రెండంకెల వృద్ధిరేటు సాధించామనడం ఎవర్ని మోసం చేయడానికి? రైతు ఇంటికి తీసుకెళ్లే నికర ఆదాయ వృద్ధినే వ్యవసాయ వృద్ధిరేటుగా పరిగణించాలని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. ఏ ఒక్క రైతు కుటుంబ ఆదాయంలోనైనా మీరంటున్న రెండంకెల వృద్ధిరేటు కనిపిస్తోందా?

-వైయ‌స్‌ జగన్‌      


Back to Top