మీరు చేసిన తొలి సంతకాలను సైతం నిలబెట్టుకోకపోవడం.. ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేయడం కాదా?

11–07–2018, బుధవారం
ఊలపల్లి, తూర్పుగోదావరి జిల్లా 

నిన్న రోజంతా కురిసిన వర్షంతో చిత్తడిగా మారి.. బురదమయమైన రహదారులపైనే నేటి పాదయాత్ర సాగింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలని.. సంస్కృతీ సాహిత్యాలతో విరాజిల్లాలన్న లక్ష్యంతో పాలన చేసిన రాజు.. అనపోతారెడ్డి పేరు మీద వెలసిందీ అనపర్తి నియోజకవర్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ఆస్థాన కవి.. భారత, భాగవత, రామాయణాలను సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదించిన కళాప్రపూర్ణుడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు.. ఇక్కడి వారే. ఈ అనపర్తిలో ఆర్థిక పరిపుష్టి ఎంత ఉందో.. ఈ నాలుగేళ్ల కాలంలో ముసురుకున్న సమస్యలు అంతకన్నా ఎక్కువగానిన్న రోజంతా కురిసిన వర్షంతో చిత్తడిగా మారి.. బురదమయమైన రహదారులపైనే నేటి పాదయాత్ర సాగింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలని.. సంస్కృతీ సాహిత్యాలతో విరాజిల్లాలన్న లక్ష్యంతో పాలన చేసిన రాజు.. అనపోతారెడ్డి పేరు నే ఉన్నాయి.
 
సీఎంగా చంద్రబాబుగారు చేసిన తొలి సంతకాల్లో బెల్టు షాపుల రద్దు ఒకటి. తొలి సంతకాల పవిత్రతను దెబ్బతీసి, ప్రజల దృష్టిలో తొలి సంతకాలకు విలువే లేకుండా చేసిన ఫలితం.. పేదల బతుకుల్ని ఎలా ఛిద్రం చేస్తోందో తెలియడానికి పందలపాక గ్రామమే ఉదాహరణ. ఇక్కడ వేర్వేరుగా నన్ను కలిసిన ముగ్గురు స్త్రీమూర్తుల దయనీయ గాథలు.. ఏరులై పారుతున్న మద్యం మహమ్మారి పేదల జీవితాలను ఎలా కబళించివేస్తోందో కళ్లకు కట్టాయి.  

పసిబిడ్డను చంకనేసుకుని వచ్చిన సోదరి లక్ష్మి ఓ వైపు కన్నీటి పర్యంతమవుతూ తన బతుకు కష్టాన్ని చెప్పుకొంది. సంచులు కుట్టే ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న మొగుడు.. సంపాదించిన దాంట్లో అధిక భాగం తాగుడుకే తగలెట్టేస్తున్నాడట. ఇంట్లో రోజూ గొడవలే. పిల్లల స్కూలు ఫీజు సైతం.. మద్యానికే హారతైన దయనీయస్థితి. ‘అన్నా.. ఎన్నాళ్లీ నరకం.. బతుకంతా కష్టాలేనా.. బతకాలని లేదు’అంటూ బొటబొటా కన్నీళ్లు కార్చింది. చిన్న వయసుకే జీవితం మీద విరక్తి పుడుతోందని ఆ చెల్లెమ్మ చెబుతుంటే.. చాలా చాలా బాధనిపించింది. ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుంటే ఆ మాట అంటుంది! ‘అన్నా.. మద్యం షాపు ఉన్న వీధి మీదుగా నడవాల్సి వస్తే.. భయంతో వణుకొస్తోంది.

అసభ్యంగా విసిరే కామెంట్లు.. చేసే వెకిలి చేష్టలు.. భరించలేక బిక్కచచ్చిపోవాల్సి వస్తోంది. ఇది నా ఒక్కదాని బాధేకాదు.. నాలాంటి వారెందరిదో’అని దీనంగా ఆ చెల్లెమ్మ చెబుతుంటే గుండె బరువెక్కింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ.. జీరబోయిన గొంతుతో జయమ్మ అనే అక్క.. తన కడుపుకోత చెప్పుకొంది. కన్న కొడుకు చిన్న వయసులోనే మద్యానికి బానిసై.. అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉంటే.. కష్టపడి, స్థోమతకు మించి ఖర్చుపెట్టి బతికించుకున్నారట. అయినా మద్యం మానలేదు. ‘కన్న కొడుకు కళ్లముందే కృశించుకుపోతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం. యాక్సిడెంట్‌కు గురై భర్త ఏ పనీ చేయలేని స్థితిలో పడ్డాడు. మాకు అండగా ఉండాల్సిన బిడ్డ మా మీదే ఆధారపడి బతుకుతుంటే.. ఏ దేవుడికి మొరపెట్టుకోవాలి? నవ మాసాలు మోసి.. కని పెంచిన బిడ్డే భారమయ్యే దుస్థితి ఏ కన్న తల్లికీ రాకూడదయ్యా’అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది.  

ఇంటిల్లిపాదినీ పోషించాల్సిన భర్తే మద్యానికి బానిసై.. కళ్లెదుట జీవచ్ఛవంలా తిరుగుతూ కుటుంబానికి భారమవుతుంటే.. దిక్కుతోచడం లేదంటూ బావురుమంది వరలక్ష్మి అనే అక్క. ‘అయ్యా.. మా కొడుక్కి చిన్నప్పుడే గుండె జబ్బు వస్తే ఆశలు వదులుకున్నాం. వైద్యానికి రూ.5 లక్షలు అవుతుందంటే.. కళ్లముందే కన్నబిడ్డను పోగొట్టుకోవాల్సిన గుండెకోతను నాకే ఎందుకు పెట్టాడీ భగవంతుడు.. అనుకున్నా. అలాంటి సమయంలో దేవుడిలాంటి మీ నాన్నగారు ఉచితంగా వైద్యం చేయించి నా బిడ్డను బతికించి ఇచ్చాడు. ఆ బిడ్డే ఇప్పుడు కష్టపడి కూలీ పనులు చేస్తూ.. కుటుంబం మొత్తాన్ని సాకుతున్నాడు. ఆ దేవుడే లేకుంటే ఈ బిడ్డే లేడు.. ఈ బిడ్డే లేకుంటే మా కుటుంబమే ఉండేది కాదు’అంటూ ఆ నాటి నాన్నగారి సాయమే.. నేడు తమను కష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కిస్తోందని చెప్పుకొచ్చింది. పందలపాకలో ఆ ముగ్గురిదే కాదు.. వందలాది మంది అక్కచెల్లెమ్మలదీ అదే గుండెకోత.  

ఎన్ని కుటుంబాలు నాశనమైపోయినా.. ఎన్ని జీవితాలు కడతేరిపోయినా.. ‘నాకు మాత్రం డబ్బే ముఖ్యం..’అని భావించే సీఎంగారికి ఈ ఆడబిడ్డల కన్నీటి ధార కనిపిస్తుందా..?! ఆ కన్న తల్లుల గుండెకోత ఘోష వినిపిస్తుందా?! 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. బెల్టు షాపులను రద్దు చేయడం.. మీరు ప్రమాణస్వీకారం చేసిన రోజు పెట్టిన తొలి ఐదు సంతకాలలో ఒకటి.. గుర్తుందా? కానీ నేడు రాష్ట్రంలోబెల్టు షాపులు లేని గ్రామం ఒక్కటైనా ఉందా? డీఅడిక్షన్‌ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ మేనిఫెస్టోలోని 16వ పేజీలో ప్రకటించారు.. ఒక్కటైనా ఏర్పాటు చేశారా? రాష్ట్ర ప్రజల సాక్షిగా మీరు చేసిన తొలి సంతకాలను సైతం నిలబెట్టుకోకపోవడం.. ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేయ డం కాదా? ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని మీ మేనిఫెస్టోకు విలువేముంది?!   
-వైఎస్‌ జగన్‌   


 

Back to Top