ఏ ప్రాంతానికి వెళ్లినా చంద్రబాబు మాటిచ్చి మోసం చేశారన్నా అంటున్నారు ప్రజలు

03–07–2018, మంగళవారం,
కుయ్యేరు, తూర్పుగోదావరి జిల్లా.

పంచారామాల్లో ఒకటై, దక్షిణ కాశీగా పిలిచే ద్రాక్షారామంలో వెలసిన భీమేశ్వర స్వామిని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న మాణిక్యాంబ అమ్మవారిని భక్తులు మహా మహిమాన్వితులుగా కొలుస్తారు. అట్టి ఆధ్యాత్మిక క్షేత్రమున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. 

రాత్రి మొదలైన వర్షం ఉదయం కూడా ఎడతెరిపి లేకుండా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర ఆలస్యంగా మొదలుపెట్టాను. ఎంతో అభిమానంతో వచ్చి నన్ను కలిసి చంటిబిడ్డలకు నామకరణాలు చేయించారు.. కొందరు. అక్షరాభ్యాసం చేయించారు.. మరికొందరు. 


డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న స్వర్ణలత అనే చెల్లెమ్మ తన వాళ్లతో వచ్చి కలిసింది. మా కుటుంబంపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమను అక్షరాలుగా మార్చి, మాపై తొమ్మిదేళ్లుగా మనసులో అంతర్లీనంగా పెంచుకున్న అభిమానానికి పుస్తక రూపాన్ని ఇచ్చింది. తను ఏడో తరగతి చదివేటప్పటి నుంచి నేటి దాకా పత్రికల్లో మా గురించి వచ్చిన ముఖ్యమైన వార్తా విశేషాలను, ఫొటోలను సేకరించి పుస్తకంగా మార్చింది. వాటిపై తను స్పందించి రాసుకున్న వాక్యాలు మనసుకు హత్తుకున్నాయి. ఆ పేదింటి బిడ్డ కొండంత అభిమానంతో పట్టుకొచ్చిన వెలకట్టలేని ఆ పుస్తక బహుమతి నన్ను కదిలించింది. మా కుటుంబ సభ్యులపై అభిమానాన్నంతా అక్షర చిత్రికలుగా పట్టితెచ్చిన స్వర్ణలత, ఆ తల్లికి సహకరించిన ఆమె సోదరి సువర్ణకుమారిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను.

ప్రజావసరాలు తెలుసుకోవడం సిసలైన నాయకుడి నైజం. అడగకుండానే అన్నీ సమకూర్చడమే అసలైన పాలనా దక్షత. ఈ తరహా ఆలోచన ధోరణి నాన్నగారికే చెల్లంటూ ఇక్కడి ప్రజలు చెబుతుంటే గర్వంగా అనిపించింది. ఏ హామీ ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గానికి ఎంతో మేలు చేసిన నాన్నగారి జ్ఞాపకాలను గుర్తు చేశారు. అదే క్రమంలో నాలుగేళ్లుగా హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని బాబుగారి బండారాన్ని ఆగ్రహంతో బయటపెట్టారు.. నాతో కలిసి అడుగులేసిన ఈ ప్రాంత ప్రజలు. ముందుగా మాట ఇవ్వకపోయినా.. ఎవరూ అడగకుండానే ఈ నియోజకవర్గంలో వెటర్నరీ, ఉద్యానవన పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేశారు.. నాన్నగారు. కోట్ల రూపాయలతో 21 కి.మీ. మేర గోదారి గట్లను పటిష్టం చేసి ముంపు భయాన్ని పోగొట్టారు. దాదాపు రూ.800 కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. మరోవైపు చంద్రబాబు గారు 2017 జనవరి 5న జరిగిన బహిరంగ సభలో ఎన్నో హామీలిచ్చి రామచంద్రపురం రూపురేఖల్నే మార్చేస్తాన న్నారు. అందరికీ ఇళ్లన్నారు.. భూగర్భ డ్రైనేజీ అన్నారు.. ద్రాక్షారామానికి రింగ్‌ రోడ్డు అన్నారు. ఇలా ఎన్నెన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. నాన్నగారి విశ్వసనీయతకు, చంద్రబాబు నయవంచనకు మధ్య ఉన్న తేడాను వివరించి చెప్పారు.. ఈ ప్రాంత ప్రజలు. 

నా ఈ ప్రజాసంకల్ప యాత్రలో ఏ ప్రాంతానికెళ్లినా ‘చంద్రబాబు హామీ ఇచ్చి మాటతప్పాడన్నా.. మాట ఇచ్చి మోసం చేశాడన్నా’ అంటున్నారు.. ప్రజలు. ఒక్కచోట కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న దాఖలాలే కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులను మోసగించినట్టు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ముఖ్యమంత్రి కాగానే చేసిన సంతకాల్లో ఒకటి.. రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తానని. మినరల్‌ వాటర్‌ సంగతి దేవుడెరుగు.. రాష్ట్రంలో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు అందని పరిస్థితులు ఉండటం వాస్తవం కాదా? పుష్కల జలవనరులు ఉన్న కోనసీమలోనే తాగునీటి కోసం కటకటలాడితే మిగతా ప్రాంతాల పరిస్థితేమిటి? మీ నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణం కాదా? పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయక, కొత్తవి చేపట్టక, ఉన్నవాటిని సరిగా నిర్వహించక పోవడమే ఈ దుస్థితికి కారణం కాదా? 
-వైయ‌స్‌ జగన్‌    
తాజా వీడియోలు

Back to Top