ఇట్లాంటి పాలనలో దళితులకు కష్టాలు లేకుండా ఉంటాయా?09–05–2018, బుధవారం   
పెరికె గూడెం, కృష్ణా జిల్లా 


ఈ రోజు పాదయాత్ర కైకలూరు నియోజకవర్గ ప్రజల కష్టాల నివేదనలు, కన్నీటి విజ్ఞాపనల మధ్య సాగింది. ‘అన్నా.. కొందరు అధికార పార్టీ నేతలు చేపల చెరువులంటూ అనుమతులు తెచ్చుకుని నిబంధనలకు విరుద్ధంగా మా ఊరికి ఆనుకునే అక్రమంగా రొయ్యల చెరువులు సాగుచేసుకుంటున్నారు. మా గ్రామంలో తాగునీటి బావులన్నీ ఉప్పుమయమై... మాకే కాదు, మా పశువుల దాహానికీ నీరందని దౌర్భాగ్యం దాపురించింది’ అంటూ కానుకోల్లు హరిజన కాలనీకి చెందిన దళిత సోదరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు మంచినీళ్లు లేకున్నా ఫర్వాలేదు.. మా పంటకాలువలు కలుషితమైపోయి సాగునీరు లేకున్నా ఫర్వాలేదు.. మా పొలాలు ఉప్పుమయమై నిస్సారమైనా ఫర్వాలేదు.. కలుషిత నీటితో మా ఆరోగ్యాలు దెబ్బతిన్నా ఫర్వాలేదు.. మా పశువులు తాగేందుకు నీరు లేకుండా అలమటించినా ఫర్వాలేదు.. వాళ్ల రొయ్యల చెరువులు మాత్రం బాగుండాలి. వాళ్లు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి.. వారిని అడిగే నాథుడూ లేడూ.. మమ్మల్ని ఆదుకునే పాలకుడూ లేడూ’ అంటూ ఆక్రోశం వెలిబుచ్చారు. నిజంగా చాలా బాధేసింది. సామాన్య ప్రజలంటే లెక్కా జమా లేకుండా... తమ సంపద పెరిగితే చాలు.. అవతలివారి డొక్కలు ఎండిపోయినా ఫరవాలేదనుకునే బాపతు నాయకుల్ని ఏమనాలో అర్థం కాలేదు.  
 
ఈ రోజు సాయంత్రం జరిగిన దళిత సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో వారు తమ గుండెల్లోని ఆవేదనను, మనసులోని ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ‘అన్నా ఈ పాలనలోనే ఎందుకు మా మీద దౌర్జన్యాలు, అకృత్యాలు ఎక్కువవుతున్నాయి? ఈ పాలనలో మా భూములపైనే ఎందుకు పాలకుల డేగకళ్లు పడుతున్నాయి? ఈ పాలనలోనే మా హాస్టళ్లు ఎందుకు మూతపడుతున్నాయి? మా స్కాలర్‌షిప్పులు ఎందుకు నిలిచిపోతున్నాయి? మా చదువులెందుకు కుంటుపడుతున్నాయి? మా సంక్షేమ పథకాలు ఎందుకు నిలిచిపోతున్నాయి? ఈ పాలనలోనే మాపై ఎందుకు వివక్ష పెరిగిపోతోంది? మా జీవితాలు ఎందుకు అంధకారమైపోతున్నాయి’ అంటూ ఈ దుర్మార్గ పాలనపై ప్రశ్నల పరంపర సంధించారు.  
 
‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అంటూ తన మనసులోని మకిలితనాన్ని దాచుకోకుండా బయటపెట్టిన చంద్రబాబుగారు ఓ వైపు, ‘దళితులందరూ శుభ్రత లేనివారు, చదువు రానివారే. వారికేం చేసినా వ్యర్థమే’ అంటూ ఆభిజాత్యంతో అహంకరించిన ఆయన మంత్రివర్గ సహచరుడు మరోవైపు ఉంటే ఇక బాబుగారి అనుచరులు ఎలా ఉంటారో, ఆయనగారి పాలనెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇట్లాంటి పాలనలో దళితులకు కష్టాలు లేకుండా ఉంటాయా? కడగండ్ల పాలవకుండా ఉంటారా?  
 
కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ మత్స్య సంఘాల అభివృద్ధి సంఘం ప్రతినిధులు కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను, మత్స్యకార కుటుంబాలకు పట్టిన దుర్గతిని, ఎన్నో కుటుంబాలు వలసబాట పట్టిన వైనాన్ని ఆవేదనతో వివరించారు. రాబోయే మనందరి ప్రభుత్వంలో వారి సమస్యలను సానుభూతితో పరిశీలించి, వాటిని కూలంకషంగా చర్చించి మత్స్యకార కుటుంబాలకు మంచి చేయగల ప్రతి అవకాశాన్నీ అన్వేషించి న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చాను.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత ఎన్నికలప్పుడు డప్పు కొట్టావు.. చెప్పుకుట్టావు.. నేనే పెద్ద దళితుడినంటూ పోజులిచ్చావు. మరి మీ పాలనలో దళితులపై అకృత్యాల్లో దేశంలోనే నాలుగో స్థానం సాధించావు. దీనికేం సమాధానం చెబుతావు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం దళితులను రెండు వర్గాలుగా విడదీశావు.. ఇరువురినీ మోసం చేశావు. ఆ ఉసురు ఊరికేపోతుందా?
- వైయ‌స్‌ జగన్‌ 

తాజా ఫోటోలు

Back to Top