‌అవినాష్‌రెడ్డి అరెస్టు.. రిమ్సుకు తరలింపు

కడప, 25 ఆగస్టు 2013:

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం జరిగేంత వరకు సమైక్యంగా ఉంచాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పులివెందుల సమన్వయకర్త వైయస్ అవినా‌ష్‌రెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, రిమ్సు ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలోని నీటి సమస్యలు, హైదరాబాద్ అంశం పరిష్కారమయ్యేంత వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అంటూ చేపట్టిన ‌ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అవినాష్‌రెడ్డి శిబిరం వద్దకు భారీ ఎత్తున పోలీసులు చేరుకుని అరెస్టు చేశారు. అవినాష్‌రెడ్డి దీక్ష చేపట్టి ఆదివారానికి ఏడవ రోజుకు చేరింది.

ఆదివారానికి అవినాష్‌రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించి.. ఆందోళనకరంగా మారింది. వైద్యులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. దీక్షను కొనసాగించడానికే అవినాష్‌రెడ్డి నిశ్చయంగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి రిమ్సు అస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా ఆయన తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.

Back to Top