యూసీఐఎల్ అధికారుల్ని నిలదీసిన జగన్

 

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో యురేనియం కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ సీరియస్ అయ్యారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పురోగతి లేకుండా రైతుల, గ్రామస్తుల సమస్యలను పరిష్కరించకుండా ఏ విధంగా సమావేశం పెట్టారని యురేనియం ప్లాంట్‌ అధికారులను జగన్‌ నిలదీశారు.

యురేనియం ప్లాంట్‌వల్ల పులివెందుల ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడమే కాకుండా, కాలుష్యమవుతున్నాయని అంతే కాకుండా భూములు కోల్పోయినవారికి ఇవ్వాల్సిన ఉద్యోగం, పరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జగన్మోహరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రేవెన్స్‌ కమిటీ సమావేశంలో ఇవే అంశాలపై చర్చించారు. రైతుల డిమాండ్లను తీర్చిన తర్వాతనే రెండో ప్లాంట్‌ మైనింగ్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అయితే సమస్యలేవీ పరిష్కరించకుండా...ఈ రోజు అధికారులు పులివెందులలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశ ప్రారంభంలోనే జగన్‌ అడిగిన ప్రశ్నలకు యురేనియం కార్పొరేషన్‌ అధికారులు నోరు మెదపలేదు. దీంతో జగన్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చరు..నెరవేర్చాలని ఆందోళన చేస్తే పోలీసు కేసులు పెడతారు...ఇక్కడంతా ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని అధికారుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఇన్ని సమస్యలున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సబబు కాదని సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే గ్రీవెన్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని రెండో ప్లాంట్‌ గురించి మాట్లాడుకుందామని సమావేశాన్ని జగన్‌ బాయ్‌కాట్‌ చేశారు. ఆయనతోపాటు మిగతా సభ్యులందరూ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. యురేనియం ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తానని ఈ సందర్భంగా జగన్‌ హామీనిచ్చారు.

 

తాజా వీడియోలు

Back to Top