యాచారంలో షర్మిల రచ్చబండ

యాచారం, 08 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండలో మహిళల సమస్యలను సావధానంగా విన్నారు. రాజన్న రాజ్యం ఒక్క శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని 
స్పష్టంచేశారు. రూపాయి కిలో బియ్యంతో ప్రజలు ఎలా బతుకుతారని ఆమె
ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ఆవేదన
వ్యక్తంచేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానానికి అపూర్వ స్పందన లభిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. తమకు వచ్చే డబ్బులు కరెంటు బిల్లులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను అన్ని రకాలుగా దోచుకుంటోందని ఆరోపించారు.  శ్రీమతి షర్మిలను పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు కలిశారు. రాజన్న ముఖ్యమంత్రిగా ఉండగా వేతనాలు  సక్రమంగా అందేవనీ, ఇప్పుడు అందడం లేదనీ తెలిపారు. పావలా వడ్డీ రుణాలు  అందడం లేదని డ్వాక్రా మహిళలు శ్రీమతి షర్మిలకు ఫిర్యాదు చేశారు. రాజన్న హయాంలో పింఛన్లు సయమానికి అందేవనీ ఇప్పుడు అందడం లేదనీ ఓ వృద్ధురాలు చెప్పింది.  ఎక్కడున్నావు రాజన్నా అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

కుమ్మక్కు కుట్రలను నమ్మం


     కుమ్మక్కు కుట్రలను నమ్మే ప్రసక్తే లేదని ప్రజలు స్పష్టంచేశారు. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వంలో కిరణ్ అధికారాన్ని చలాయిస్తున్నారని చెప్పారు. ప్రజలు సుస్థిరంగా ఉండాలంటే రాజన్న రాజ్యం రావాలనీ,అందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే మార్గమనీ వారు తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చాలా బాధపడుతున్నాడనీ, ప్రభుత్వానికి పట్టించుకునే తీరిక లేదనీ శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువుల ధరలు నాలుగింతలయ్యాయనీ, మద్దతు ధర లేదనీ, మంచినీరు అందడం లేదనీ చెప్పారు. కరెంటు వారికిచ్చినపుడు ఇస్తారనీ, లేనపుడు తీస్తారనీ ధ్వజమెత్తారు. రాత్రి పూట కరెంటు సరఫరా ఇవ్వడం వల్ల ప్రాణాలు పణంగా పెట్టి పొలాలకు నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తోందన్నారు. ఈ సర్కారుకు మనసు లేదనీ ,ప్రజలను పట్టించుకోవడం లేదనీ, ముఖ్యంగా మహిళల ఊసే పట్టడం లేదనీ ఆరోపించారు. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్క బియ్యం కేజీ రూపాయికి ఇచ్చి వీటి ధరలు పెంచితే ఎలా బతకాలని ప్రశ్నించారు. పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని శ్రీమతి షర్మిల చెప్పారు. కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి. సర్చాజులు వేస్తూ ప్రజలను పీడిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Back to Top