బాబు తాటాకు చప్పుళ్లకు భయపడం

  • ప్రసన్నకుమార్‌ని అన్యాయంగా అరెస్టు చేశారు
  • ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం: గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేయడం అన్యాయమని ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కార్‌ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రసన్నకుమార్‌ అక్రమ అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే ఉద్యమాలను పూర్తి స్థాయిలో అణిచేయాలని చూడడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నేతలు బాక్సైట్‌ వ్యాపారస్థులతో చేతులు కలిపి గిరిజన సంపదను కొల్లగొడుతున్నారని ప్రజలను చైతన్యపరుస్తున్న  ప్రసన్నకుమార్‌ని అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రసన్నకుమార్‌ పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా, శాంతియుత నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఒక సంఘవిద్రోహ శక్తిని అరెస్టు చేసినట్లుగా అతన్ని రాత్రికి రాత్రి అరెస్టు చేసి అన్యాయంగా 9 కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ మొత్తం ప్రసన్నకుమార్‌ వెంట ఉందని అతన్ని బయపెట్టాలని చూస్తూ సహించబోమని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. శాసనసభ, మండలిలో ఈ విషయాలను ప్రస్తావిస్తామని చెప్పారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భయపడదని, అధికార పార్టీ అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాడుతామని కొలగట్ల హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top