ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం: కొత్తపల్లి సుబ్బారాయుడు


పశ్చిమగోదావరి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, ప్రభుత్వానికి కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. తణుకులో జగన్ చేపట్టిన దీక్షకు ఆదివారం కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం నుంచి  రైతులు,  డ్వాక్రా మహిళలు, పార్టీ శ్రేణులతో కలసి తణకుకు వచ్చారు.  తణుకు వెళ్లడానికి ముందుగా పట్టణంలో కొత్తపల్లి సోదరుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ జగన్ జిల్లాలో    రెండు రోజుల పాటు నిర్వహించిన పోరాటం చారిత్రాత్మకమైనదన్నారు. జగన్ దీక్షకు జనం తండోపతండాలుగా రావడం చూస్తుంటేనే, ప్రజలకు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం జగన్ ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, జగన్‌కు వెన్నుదన్నుగా నిలవడానికి తామంతా నిలబడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా వైఎస్సార్ సీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఏడునెలలు గడుస్తుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ైరె తుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు, ఉన్న పింఛన్లను ఊడగొడుతున్నారని విమర్శించారు. జపాన్, సింగపూర్, మలేషియా అంటూ గాలిలో మేడలు, అదీ చాలదు అన్నట్టుగా యోగా పాఠాలు తప్పిస్తే చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమం విషయంలో దారుణంగా విఫలమయ్యిందని కొత్తపల్లి విమర్శించారు.
Back to Top