బాబూ..రోజా అంటే ఎందుకంత భయం

  • రోజాను రాజకీయంగా సమాధి చేయాలని ప్రభుత్వం కుట్ర
  • చేయని నేరానికి రోజా ఇప్పటికే 14 నెలలు శిక్ష అనుభవించారు
  • సస్పెన్షన్ పొడిగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేయడం దారుణం
  • బికినీ ఫెస్టివల్ చేస్తే తప్పేంటన్న ఏకైక మహిళ అనిత
  • మహిళలపై జరిగే ప్రతి దాడి వెనుక టీడీపీ నాయకులున్నారు
  • ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వంలో ఉన్నందుకు మహిళగా సిగ్గుపడుతున్నాం
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
హైదరాబాద్ః కొత్త రాజధానిలో కొత్త అసెంబ్లీలో తెలుగు దేశం ప్రభుత్వం కొత్త సంప్రదాయలకు తెరతీస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ప్రివిలేజ్ కమిటీ రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ కొనసాగించాలని సిఫారసు చేయడం దారుణమని అన్నారు. చేయని తప్పుకు 14 నెలల పాటు రోజా శిక్ష అనుభవించారని, ఈ రోజు మళ్లీ కొత్తగా సంవత్సరం ముందు  జరిగిన అనిత సంఘటనను తెరపైకి తెచ్చి రోజాను సస్పెండ్ చేస్తున్నారంటే ప్రభుత్వం మహిళల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో ప్రజలు గమనించాలన్నారు. రోజా చేసిన తప్పు ఏంటి? మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని విచక్షణారహితంగా వేధించిన తీరును ఖండించినందుకా...?ర్యాగింగ్ కు బలైన రిషితేశ్వరి కుటుంబానికి అండగా నిలిచినందుకా..?ప్రశాంతంగా ఉన్న వైజాగ్ లో మీరు నిర్వహించదల్చిన బికినీ ఫెస్టివల్ ను అడ్డుకున్నందుకా..?టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వర్గం నడిరోడ్డుపై మహిళపై దౌర్జన్యం చేసిందని నిలదీసినందుకా..?  దేనికోసం రోజాను సస్పెండ్ చేస్తున్నారని విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని నిలదీశారు.  

హత్య చేసిన ఖూనీకోరుకు కూడ ఒక్కసారే శిక్ష వేస్తారు. ఉరిశిక్ష వేసిన వాళ్లకు కూడ చివరి కోరిక ఏంటని అడుగుతారు. అలాంటిది రోజాను సస్పెండ్ చేసేముందు కనీసం ఆవిడ వివరణ కూడ తీసుకోని దౌర్భాగ్య ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నందుకు మహిళగా సిగ్గుపడుతున్నామని పుష్పశ్రీవాణి అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే ప్రతిదౌర్జన్యం వెనుక టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారన్నది వాస్తవం కాదా అని  ప్రశ్నించారు. మహిళా సమస్యలమీద రోజా పోరాడడం తప్పా? ఓ మహిళ శాసనసభ్యురాలు అని కూడ చూడకుండా ఇంత నీచంగా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి..?అని పుష్పశ్రీవాణి టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.  ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రోజాను చూస్తే ముఖ్యమంత్రి ఇంతగా భయపడతారని కొత్త ఎమ్మెల్యేలమైన తాము  భావించలేదని, రోజా అంటే ఎందుకంత భయమని చంద్రబాబుకు చురక అంటించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను సస్పెండ్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా సస్పెండ్ చేసేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

రాజధాని నడిబొడ్డులో జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మహిళల మీద జరిగిన దారుణాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే ఏడాదిపాటు రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారని పుష్పశ్రీవాణి అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడడానికి ప్రభుత్వం తమకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ పై అధికార సభ్యులు ఏరకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అడ్డుకుంటున్నారో ప్రజలు గమనించాలన్నారు. జరగని సంఘటనను జరిగినట్టుగా చిత్రీకరించి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వీడియోస్ ను రిలీజ్ చేసిన తీరును పుష్పశ్రీవాణి ఆక్షేపించారు. వీడియా లీకేజ్ గురించి  స్పీకర్, సెక్రటరీలు తమకు తెలియదన్నారంటేనే కచ్చితంగా రోజాను రాజకీయంగా సమాధి చేయాలనే ఈ చర్యకు పాల్పడ్డారని తాము భావిస్తున్నామన్నారు. ఏనాడు దళితుల సమస్యలపై మాట్లాడని టీడీపీ దళిత ఎమ్మెల్యే అనిత..తన పబ్లిసిటీ కోసం రోజాను ఇరికించడం ఆమెకు ఎంతవరకు సబబు అని  ప్రశ్నించారు. 

ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని దళితులను అవమానించిన పార్టీ టీడీపీ. కుతూహలమ్మను కంటతడి పెట్టించిన చరిత్ర టీడీపీదని పుష్పశ్రీవాణి ఫైర్ అయ్యారు. వైజాగ్ లో బీచ్ ఫెస్టివల్ తీసుకొస్తే తప్పేంటి అన్న ఏకైక మహిళ అనిత అని పుష్పశ్రీవాణి గుర్తు చేశారు. బాలకృష్ణ మహిళలను అవమానపరిస్తే తప్పేంటి అని వెనకేసుకొచ్చిన నీవా దళితుల గురించి మాట్లాడేది అని అనితపై విరుచుకుపడ్డారు. ప్రివిలేజ్ కమిటీ అధికారపక్షం వాళ్లకేనా అని పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార సభ్యులు సభలో ప్రవర్తించిన తీరుపై తాము ప్రివిలేజ్ కమిటీకి  25 సార్లు ఫిర్యాదులు చేశామని,  ఒక్కదానిపై కూడ విచారించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే రోజాను సస్పెండ్ చేస్తున్నామని మీరు అంటున్నారో,  ఆ చర్యలను వెనక్కితీసుకోకపోతే ఎటువంటి పరిణాలు ఎదురవుతాయో మీరు ఊహించలేరని పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళలను బాధపెట్టినా, అన్యాయం చేసినా పుట్టగతులుండవని చరిత్ర రుజువు చేసిందన్నారు.  రాబోయే కాలంలో మహిళలే బాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
Back to Top