తాకట్టుపెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు..?

  • హోదా ప్రకటన ప్రజలు సాధించుకున్నది
  • చట్టసభలపై నమ్మకం పోగొడుతున్న బీజేపీ, టీడీపీలు
  • బాబు కేంద్రాన్ని ప్రశ్నించలేనన్ని తప్పులు చేశారా?
  • కమీషన్లకు కక్కుర్తిపడి బాబు పోలవరం తీసుకున్నారు
  • 2018కల్లా పూర్తి చేస్తామని దొంగమాటలు చెబుతున్నారు
  • వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సాధించుకున్న ప్రత్యేక హోదా హక్కును తాకట్టుపెట్టే అధికారం సీఎం చంద్రబాబుకు ఎవరిచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన చైతన్య పథం కార్యక్రమానికి హాజరైన ధర్మాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. విభజిత ఏపీకి అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేసి ఏపీకి ప్రత్యేక హోదా హక్కును సాధించుకున్నారని గుర్తు చేశారు. హోదా 5 కోట్ల ఆంధ్ర ప్రజలదని,  రాజకీయ పార్టీలది కాదని ధ్వజమెత్తారు. ఏపీని విడదీయాలని కేంద్రం అన్ని ప్రధాన పార్టీలతో నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలను ఒప్పించడానికి చట్టం రూపంలో కొన్ని హామీలను ఇవ్వడం జరిగిందన్నారు. 

చట్టసభలో గత ప్రధాని ఏపీకి ఇచ్చిన హామీలను నీరుగార్చే అవకాశం బీజేపీ, టీడీపీలకు ఎవరిచ్చారని నిలదీశారు. గత కాంగ్రెస్‌ హయాంలో చట్టంలో సవరణలు కోరకుండా ప్రధాని హామీలకు సంతృప్తి చేందామని చెప్పి ప్రస్తుతం హోదా అంశం చట్టంలో లేదు, 14వ ఆర్థిక సంఘం అభ్యంతరాలు వ్యక్త పరుస్తుందని తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష బీజేపీ రాజ్యసభలో మాట్లాడినవి ఆధారాలతో సహా ఉన్నాయని ఈసందర్భంగా తెలిపారు. దేశంలో అత్యున్నతమైన పార్లమెంట్‌ చట్టసభలో ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఆ లోటును పూడ్చడానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని అమలు పర్చకుండా చట్టసభ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నాయని ఫైరయ్యారు. చట్టసభలో ప్రతినిధులుగా ఉన్న వారే ఇలా చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలని వెంకయ్యను ప్రశ్నించారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు హోదా 10 సంవత్సరాలు ఇస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయలేదా అని నిలదీశారు. దేశంలో దుర్మార్గపు సాంప్రదయాన్ని తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

సభ్యుల అభిప్రాయం తీసుకున్నారా బాబు
హోదాను నీరుగార్చి కేంద్రం ప్రకటించే ప్యాకేజీని స్వాగతించే ముందు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో, లేక అసెంబ్లీలోని సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారా అని చంద్రబాబును ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన నాలుగు పేజీల నోట్‌లో ఏపీకి లబ్ది చేకూర్చే అంశం ఒక్కటి కూడా లేదని స్పష్టం చేశారు. చట్టంలోని అంశాలపై కేంద్రంతో పోరాడకుండా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాబుకు పోరాటం చేసే శక్తి లేదా? లేక ప్రశ్నించలేని తప్పులు చేసి భయపడి మాట్లాడలేకపోతున్నారా చెప్పాలన్నారు. కేవలం ఓటుకు కోట్ల కేసులో, పట్టిసీమలో రూ. 300 కోట్లు లంచం, రాజధాని రియలెస్టేట్‌ వ్యాపారాల వల్ల మాట్లాడలేకపోతున్నారా చెప్పాలన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి- హోదాకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత భేదం ఉందన్నారు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు, రాయితీలు లభిస్తాయి తప్ప ప్యాకేజీ వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. చంద్రబాబు వ్యక్తిగత స్వార్థానికి హోదాను తాకట్టపెట్టి ప్యాకేజీ వల్ల లాభాలు అంటు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తెచ్చానని సన్మానం చేయించుకున్న వెంకయ్యనాయుడు గుండెమీద చెయ్యివేసుకొని చట్టంలోని అంశాలకంటే ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పాలని నిలదీశారు. 

కమీషన్ల కోసం కక్కుర్తి పడతారా..?
జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రం చంద్రబాబు చేతులో పెట్టడం అన్యాయమని ధర్మాన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలియని చంద్రబాబు కమీషన్లు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి ప్రజలకు హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. . రూ. 800 కోట్లతో చేసే వంశధారనే ఇప్పటి వరకు చేయలేకపోయారు. రూ. 8 వేల కోట్లతో నిర్మించే పోలవరాన్ని 2018 కల్లా పూర్తి చేస్తామని దొంగ మాటలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. కేంద్రానికి అప్పగించిన ప్రాజెక్టును స్వలాభాలకు ఆశపడి ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

టీడీపీ, బీజేపీకి కాంగ్రెస్‌ కు పట్టిన గతే
వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి 
శ్రీకాకుళం: ఎన్నికల ముందు హోదాపై అంకెల గారడీ చేసి... అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. శ్రీకాకుళంలో జరిగిన చైతన్య పథం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పలు సందర్భాల్లో వివరించారని గుర్తు చేశారు. హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ అనేక పోరాటాలు చేస్తూ వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. 15 సంవత్సరాలు హోదా సాధిస్తామని ఓట్లేయించుకొని,  అధికారంలోకి వచ్చాక తన స్వార్థ రాజకీయాల కోసం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల జీవితాలను బాబు కేంద్రానికి తాకట్టపెట్టారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు మర్చిపోయారంటే టీడీపీకి, బీజేపీకి ఏపీలో నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top