మంత్రివర్గంలో మైనార్టీలకు చోటేది?

గుంటూరు(నరసరావుపేట):  రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు చోటేద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగ నాయకులు ప్ర‌శ్నించారు. న‌ర‌స‌రావుపేట‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు షేక్‌.ఖాజావలి మాష్టారు మాట్లాడుతూ 1956లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 2014వరకు ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేకుండా లేదన్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మైనార్టీలకు ప్రాతినిధ్యంలేకుండా చేసి ఆ మైనార్టీ శాఖను పల్లెరఘునాధరెడ్డికి అప్పగించి ముస్లింలను అపహాస్యం చేశాడన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని వైయ‌స్ఆర్‌ సీపీ నుంచి ఎన్నికైన మైనార్టీ ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, జలీల్‌ఖాన్‌లను పార్టీలో చేర్చుకొని వారికీ రిక్తహస్తం చూపించాడన్నారు. రాష్ట్రంలో సుమారు 11శాతం ఉన్న ముస్లిం మైనార్టీల తరపున కనీసం ఇద్దరికైనా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉండగా ఇవేమి పట్టించుకోకుండా వ్యవహరించిన సీఎం చంద్రబాబుకు మైనార్టీలు నిశ్శభ్ద విప్లవం ద్వారా తగిన బుద్దిచెప్పాలని ఆయన కోరారు. జిల్లా కార్యదర్శి షేక్‌.ఖాదర్‌బాషా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలిపిన చంద్రబాబు ముస్లింలకు తీవ్ర అన్యాయం చేశాడని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న అన్యాయం ఏ ముస్లిం మర్చిపోడని హెచ్చరించారు. మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్, జిల్లా కార్యదర్శి షేక్‌.సైదావలి మాట్లాడుతూ 11శాతం ఉన్న ముస్లిం మైనార్టీల తరపున మాట్లాడేందుకు ఒక్కరు కూడా లేకపోవటం శోచనీయం అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకు ఆ కుటుంబానికి రిక్తహస్తమే చూపించాడన్నారు. మైనార్టీ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ఖాదర్‌బాషా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించి మంత్రివర్గంలో సముచిత స్థానం ఏర్పాటుచేయగా టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి వారి సంక్షేమానికి తూట్లు పొడిచిందన్నారు. దీని పరవ్యసం తప్పకుండా ఆ పార్టీ నాయకులు చవిచూస్తారని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్‌ అక్తాబ్, మైనార్టీపట్టణ అధ్యక్షుడు షేక్‌.గౌస్, మాజీ సర్పంచ్‌ పొదిలే ఖాజా, షేక్‌.జానిబాషా, ఫరూక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top