ప్రజలకు అండగా ఉంటాం

మదనపల్లె రూరల్‌: రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణతో ఇళ్లు కోల్పోతామన్న భయంతో ఉన్న సీటీఎం ప్రజలకు అండగా ఉంటామ‌ని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిలు భ‌రోసా క‌ల్పించారు. శుక్రవారం సీటీఎంకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లను రోడ్డు విస్తరణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత విస్తీర్ణంలో మార్కింగ్ చేశారు, ఎన్ని ఇళ్లు పడగొట్టాల్సి వస్తుంది. అలైన్‌మెంట్ మారిస్తే ఎదురయ్యే ఇబ్బందులేంటి అన్న అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పీలేరు, వాయల్పాడు, సీటీఎంలలో రోడ్డు విస్తరణ పనులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారనే ముందస్తుగా బైపాస్‌రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. రైల్వేగేటులను ఎత్తేయాలన్న కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం బ్రిడ్జి నిర్మాణానికి సర్వే చేయడం జరిగిందని, పొడుగు, వెడల్పులు తగ్గించేలా అధికారులను ఒప్పిస్తామన్నారు. సీటీఎంలోని ప్రముఖ దేవాలయాలైన నలవీర గంగమ్మ, ఆంజనేయస్వామి ఆల‌యాల‌కు, పెద్దసంఖ్యలో ఇళ్లకు నష్టం వాటిల్లకుండా ప్రస్తుతం అధికారులు ప్రతిపాదించిన అలైన్‌మెంట్ కాకుండా వేరేది సర్వే చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజల సమక్షంలోనే రైల్వే ఆర్‌.వో.తో మాట్లాడి అక్కడికక్కడే ప్రజల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సర్వేతో సుమారు 35 ఇళ్ల వరకు కోల్పోతాయని అధికారులు చెప్పారన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి రైల్వే అధికారులను కలిసి పరిస్థితిని వివరించి సమస్య పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ధ్యేయమని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైయ‌స్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్‌జాన్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షమీం అస్లాం, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆనందరెడ్డి, ఉదయ్‌కుమార్, కార్మిక విభాగం షరీఫ్, కౌన్సిలర్లు మహ్మద్ రఫీ, పూల వేమనారాయణ, వెంకటరమణారెడ్డి, సర్పంచ్‌శరత్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాగరాజరెడ్డి, ఎస్‌.ఏ.కరీముల్లా, వెలుగుచంద్ర, వెంకటరమణ, వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top